Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంటర్‌ ప్రథమలో రికార్డు స్థాయి చేరికలు

ప్రభుత్వ కాలేజీల్లో చేరిన 1.10 లక్షల మంది విద్యార్థులు


హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు రికార్డు స్థాయిలో జరిగాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియ నవంబరు నెలాఖరుతో ముగిసింది. దీంతో అడ్మిషన్ల వివరాలను అధికారులు సేకరించారు. ఈ సమాచారం ప్రకారం... రాష్ట్రంలోని 405 జూనియర్‌ కాలేజీల్లో సుమారు 1,10,686 మంది విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరం కోర్సులో అడ్మిషన్‌ తీసుకున్నారు. క్రితం సంవత్సరాల్లో ప్రభుత్వ కాలేజీల్లో లక్ష లోపే అడ్మిషన్లు ఉండేవి. ఈ ఏడాది మాత్రం అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.


అలాగే ప్రభుత్వ పరిధిలోని గురుకులాలు, ఇతర రెసిడెన్షియల్‌ కాలేజీల్లో 79,197 మంది, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కాలేజీల్లో 7,311 మంది అడ్మిషన్‌ తీసుకున్నారు. ప్రైవేట్‌ కాలేజీల్లో 2,92,791 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం కోర్సులో చేరారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని అన్ని కాలేజీల్లో కలిపి మొత్తం 4,89,985 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరారు. కరోనా నేపథ్యంలో 10వ తరగతికి పరీక్షలు లేకుండా అందరినీ  ఉత్తీర్ణులుగా ప్రకటించడంతో అడ్మిషన్లు పెరిగాయని అధికారులు భావిస్తున్నారు.


కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతి..!

ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు షిఫ్టింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు సుమారు 24 కాలేజీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ప్రతిపాదనలను ఇంటర్‌ బోర్డు ప్రభుత్వానికి పంపింది. త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement