Advertisement
Advertisement
Abn logo
Advertisement

రికార్డ్... నెల రోజులుగా స్థిరంగా పెట్రోల్ ధరలు...

హైదరాబాద్ : ఇటీవలి కాలంలో దాదాపుగా ఏ రోజు చూసినా కూడా... పెట్రో ధరల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అటువంటిది... పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులుగా స్థిరంగా ఉన్నాయంటే ఒకింత ఆశ్చర్యమే మరి. ఒకరకంగా ఇది రికార్డేనన్న వ్యాఖ్యానాలు కూడా వినవస్తున్నాయి. చమురు ధరలు వరుసగా 31 వ రోజు ఆదివారం(డిసెంబరు 05) స్థిరంగా ఉండడం విశేషం. కేంద్రం... ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత మాత్రం ధరలు తగ్గాయి. కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దీపావళికి శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. అదే దారిలో... పలు రాష్ట్రాలు కూడా నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ. 5, డీజిల్ పై రూ. 10 మాత్రమే వర్తిస్తోంది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను 30 శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో పెట్రోల్ ధర రూ. 8 తగ్గింది.


వివిధ పెద్ద నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత తక్కువగా పోర్ట్‌బ్లెయిర్‌లో ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 82.96, లీటర్ డీజిల్ రూ. 77.13 గా ఉన్నాయి. అంటే పోర్ట్‌బ్లెయిర్ కంటే ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 12 ఎక్కువగా ఉంది.మొత్తంమీద పెట్రోల్, డీజిల్ ధరలు పలు నగరాల్లో రూ. 100 దిగువకు వచ్చాయి. ఈ క్రమంలో పెట్రో ధరలు ఢిల్లీలో రూ.94.14, కోల్‌కతాలో  రూ. 89.79, చెన్నైలో రూ. 91.43, భోపాల‌్‌లో (రూ. 90.87. డీజిల్ ధర రూ. 100 లోపు ఉన్నాయి. కేంద్రం సుంకం తగ్గింపు తర్వాత పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. కాగా... చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించలేదు.


ఇదిలా ఉంటే... అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దేశీయంగా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.20, లీటర్ డీజిల్ రూ. 94.62గా ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 110.36, లీటర్ డీజిల్ రూ.96.45 గా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ. 103.97, డీజిల్ రూ. 86.67, ముంబైలో పెట్రోల్ రూ. 109.98, డీజిల్ రూ. 94.14 గా ఉన్నాయి. యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ తదితర దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, బలహీనమైన డిమాండ్ తదితర అ:శాలు ప్రభావం చూపనున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. 


యూరోపియన్ దేశాల్లో కరోనా కేసుల ఆందోళన నేపధ్యంలో చమురు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే...  అంతర్జాతీయంగా ధరలు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపధ్యంలో...  ఇప్పుడు భారత్‌లోనూ ఈ ధరలు మరింత తగ్గిస్తారా అంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మరికొద్ది రోజులపాటు క్షీణిస్తేనే అది సాధ్యపడుతుందని చెబుతున్నారు. దేశీయ రిటైల్ ధరలు... పదిహేను రోజుల రోలింగ్ యావరేజ్ ప్రాతిపదికన నిర్ధారితమవుతాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్‌లో మరికొన్ని రోజులు తగ్గితేనే ఇక్కడ కూడా తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో  నవంబరు 25 వ తేదీ వరకు ధరలు గరిష్టాల వద్ద ఉన్నాయి. ధరలు గత రెండు రోజులుగా మాత్రమే తగ్గుముఖం పట్టాయి. 

Advertisement
Advertisement