Abn logo
Oct 25 2021 @ 23:58PM

రికార్డులు తడిచి.. చెదలు పట్టాయట!

దువ్వూరు పీఏసీఎ్‌సలో ఏర్పాటు చేసిన పీపీసీ

దువ్వూరు పీఏసీఎ్‌సలో మాయాజాలం

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల రికార్డులు నాశనం

కొనుగోళ్లపై అప్పట్లో అనేక ఆరోపణలు

ఆర్టీఐ ద్వారా రైతులు సమాచారం సేకరణ

పూర్తిస్థాయిలో విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి..


ఒకటి కాదు.. రెండు కాదు.. కొన్ని వందల పేపర్లతో కూడిన రికార్డులు వర్షానికి తడిచిపోయాయి. తద్వారా చెదలు పట్టి నాశనమయ్యాయి. ఏంటి...? నమశక్యంగా లేదా!? నిజమండీ. గతేడాది ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను ఆ ఏడాది అక్టోబరులో ఓ గదిలో భద్రపరిచారట. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన సమయంలో గదిని తెరచి చూడగా కేవలం గత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన రికార్డులు మాత్రమే తడిచి చెదలు పట్టి నాశనమయ్యాయట. ఇవి ఎవరో అన్నమాటలు కావు. సంగం మండలం దువ్వూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) అధికారులు జిల్లా సహకార శాఖాధికారికి ఇచ్చిన వివరణ ఇది. 


నెల్లూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఎప్పుడో ఫిబ్రవరిలో రికార్డులు తడిచిపోతే ఇప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయడంలో ఆంతర్యమేమిటన్నది సంబంధిత అధికారులకే తెలియాలి. సంగం మండలానికి చెందిన ఎం సుధాకర్‌ అనే రైతు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం. గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో జిల్లావ్యాప్తంగా అక్రమాలు జరిగాయి. అనేకచోట్ల వెలుగులోకి రాగా కొన్ని చోట్ల పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే దువ్వూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇక్కడ జరిగిన కొనుగోళ్ల వివరాలను కొందరు రైతులు ఆర్టీఐ ద్వారా  వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయగా అనేక అనుమానాలను రేకెత్తించేలా అధికారుల నుంచి వివరణ వచ్చింది. 


ఎన్నో ఆరోపణలు.. మరెన్నో అనుమానాలు..

గతేడాది ఎడగారు సీజన్లో అధిక విస్తీర్ణంలో పంట సాగు జరిగింది. అప్పుడు అధికార పార్టీ నేతలు, దళారులు కలిసి రైతులను నట్టేట ముంచారన్న ఆరోపణలున్నాయి. ఈక్రాప్‌ బుకింగ్‌ ద్వారానే కాకుండా స్థానిక రెవెన్యూ అధికారులు సాగు ధ్రువీకరణ పత్రాలు ఇస్తే ఆ రైతు నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం(పీపీసీ)లో కొనుగోలు చేశారు. ఇదే అవకాశంగా కొందరు నిలువుదోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల మిల్లర్లు, అధికార పార్టీ నేతలు, దళారులు కుమ్మక్కై రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను లాగేసుకున్నారు. ఇటువంటి సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. దువ్వూరు పీఏసీఎ్‌సలో ఏర్పాటు చేసిన పీపీసీలో కూడా రైతులు ధాన్యాన్ని తీసుకెళితే రకరకాల సాకులతో కొనుగోలు చేయడానికి నిరాకరించారని, ఈ బాధలు భరించలేక చాలా మంది తక్కువ ధరకు దళారులకు తెగనమ్ముకున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే చాలా వరకు రైతులు బయట మార్కెట్లో అమ్మేసుకుంటే పీపీసీలో మాత్రం భారీగా విక్రయాలు జరిగినట్లు రికార్డుల్లో చూపించారు. గతేడాది ఎడగారు సీజన్‌లో 5600 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇక్కడ కొనుగోలు చేశారు. దీనిపై రైతుల్లో అనుమానాలు కలిగాయి. దువ్వూరు పీపీసీలో ఏదో మతలబు జరుగుతోందంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే అప్పటి పీపీసీ ఇన్‌చార్జ్‌ అధికార పార్టీ నేత కావడంతో రైతులు ముందుకెళ్లలేకపోయారు. కానీ ఇటీవల ఓ రైతు ఆర్టీఐ ద్వారా గతేడాది ధాన్యం కొనుగోళ్ల వివరాలను అడిగారు. ఏ ఏ రైతు నుంచి ఎంతెంత ధాన్యం కొన్నారు? ఆ రైతుల సాగు ధ్రువీకరణ నకళ్లను కూడా అందించాలని దరఖాస్తులో కోరారు. అయితే ఈ దరఖాస్తుపై దువ్వూరు పీఏసీఎస్‌ అధికారులు మొదట పూర్తిస్థాయిలో సమాచారమివ్వలేదు. రైతుల వివరాలు లభ్యం కావాల్సి ఉందని మొదట సమాధానమిచ్చారు. దీనిపై సదరు రైతు జిల్లా సహకార శాఖాధికారికి అప్పీల్‌కు వెళ్లారు. జిల్లా సహకార శాఖాధికారి స్పందించి నోటీసు జారీ చేయడంతో దువ్వూరు పీఏసీఎస్‌ సీఈవో ఈ నెల 12వ తేదీన నెల్లూరుకు వచ్చి జిల్లా సహకార శాఖాధికారికి వివరణ ఇచ్చారు. గతేడాది ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఓ తాత్కాలిక ఉద్యోగి ఇన్‌చార్జ్‌గా ఉన్నారని, ఆయన సమక్షంలో రికార్డులను భద్రపరిచారని వివరణలో పేర్కొన్నారు. వర్షపు నీరు రికార్డుల్లోకి చేరడంతో చెదలు పట్టిపోయాయని, ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిసినట్లు ఉద్యోగుల ద్వారా తెలిసిందంటూ వివరణిచ్చారు. 


విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి..

దువ్వూరు పీఏసీఎ్‌సలో ఏర్పాటు చేసిన పీపీసీ రికార్డులు నాలుగు నెలలకే నాశనమవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే వర్షం కారణంగా తడిచిపోయి ఉంటే ఆ విషయాన్ని ఎందుకు ఉన్నతాధికారులకు తెలియజేయలేదన్నది మరో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. కాగా గతంలో పీపీసీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన తాత్కాలిక ఉద్యోగి ప్రస్తుతం అధికార పార్టీ సానుభూతిపరుడిగా ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా గెలుపొందడం గమనార్హం. దువ్వూరు పీఏసీఎ్‌సలో ఏర్పాటు చేసిన పీపీసీలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రికార్డులు నాశమైపోవడం వెనుక కొందరు అక్రమార్కుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగు జరగని, సాగుకు పనికి రాని భూములపై సాగు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారని, కొన్ని నకిలీ పత్రాలు కూడా సృష్టించి అటు రైతులకు అన్యాయం చేయడంతో పాటు ఇటు ప్రభుత్వాన్ని మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


నోటీసులిచ్చాం  

దువ్వూరు పీఏసీఎ్‌సలో ఏర్పాటు చేసిన పీపీసీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు అందించాలని కొందరు ఆర్టీఐ ద్వారా అడిగారు. వారు మా దగ్గరకు అప్పీలుకు వచ్చాక పీఏసీఎస్‌ అధికారులకు తాఖీదులు ఇచ్చాం. వర్షం కారణంగా రికార్డులు తడిచిపోయి, చెదలు పట్టినట్లు సంబంధిత సీఈవో వివరణ ఇచ్చారు. అయితే ఎందుకిలా జరిగింది, ముందుగా ఎందుకు తెలియజేయలేదన్న విషయాలపై నోటీసులు ఇచ్చాం. 

- తిరుపాల్‌రెడ్డి, జిల్లా సహకార శాఖాధికారి