కోలుకుంటున్న పర్యాటకం

ABN , First Publish Date - 2020-12-04T06:05:01+05:30 IST

జిల్లాలో పర్యాటక రంగం క్రమంగా కోలుకుంటోంది. కరోనా నేపథ్యంలో దాదాపు ఆరు నెలలు పర్యాటక ప్రదేశాలు, రిసార్టులు, హోటళ్లు వెలవెలబోయాయి. ఆంక్షలు అన్నీ ఎత్తేసినా, ఇంతకు ముందులా సందడి కనిపించడం లేదు.

కోలుకుంటున్న పర్యాటకం
సబ్‌మెరైన్‌ మ్యూజియం వద్ద సందర్శకులు

వారాంతాల్లో కాటేజీలు ఫుల్‌

మిగిలిన రోజుల్లో 50 శాతంలోపే ఆక్యుపెన్సీ

నవంబరులో రూ.1.7 కోట్ల ఆదాయం

డిసెంబరులో మరింత పుంజుకుంటుందని అధికారుల ఆశాభావం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పర్యాటక రంగం క్రమంగా కోలుకుంటోంది. కరోనా నేపథ్యంలో దాదాపు ఆరు నెలలు పర్యాటక ప్రదేశాలు, రిసార్టులు, హోటళ్లు వెలవెలబోయాయి. ఆంక్షలు అన్నీ ఎత్తేసినా, ఇంతకు ముందులా సందడి కనిపించడం లేదు. దసరా నుంచి సంక్రాంతి వరకు ఉత్తరాంధ్రాకు పశ్చిమ బెంగాల్‌ నుంచి పర్యాటకులు వస్తారు. అయితే ఈ ఏడాది కొవిడ్‌ వల్ల రైల్వే శాఖ పరిమితంగా రైళ్లు నడపడం, ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయకు ప్రయాణికుల రైలు నిలిచిపోవడంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒక్క నవంబరులోనే పర్యాటకాభివృద్ధి సంస్థకు సుమారు రూ.5 కోట్ల ఆదాయం వచ్చేది. రుషికొండ, అప్పుఘర్‌, అనంతగిరి తైడా, అరకులోయ, లంబసింగి రిసార్టులు, హోటళ్లు కిటకిటలాడేవి. వీటన్నింటిలో మొత్తం 282 రూములు వుండగా ఈ సీజన్‌లో ఖాళీ వుండేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం వారాంతాలైన శని, ఆదివారాల్లో మాత్రమే 100 శాతం నిండుతున్నాయి. మిగిలిన రోజుల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. రెస్టారెంట్లకు బయటవారు ఎవరూ రావడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లలో దిగిన వారే అక్కడ ఫుడ్‌ తింటున్నారు. గతంతో పోల్చుకుంటే 50 శాతానికి పైగా ఆదాయం తగ్గిపోయింది. ఈ నవంబరులో కేవలం రూ.1.7 కోట్లు మాత్రమే ఏపీటీడీసీకి ఆదాయం వచ్చింది. అయితే జీతాలు, కరెంటు బిల్లులకు ఇబ్బందులు లేకుండా నవంబరు గడిచిందని, డిసెంబరులో ఆదాయం మరింత ఆశాజనకంగా వుంటుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-12-04T06:05:01+05:30 IST