రెండో రోజూ రికార్డు రికవరీలు!

ABN , First Publish Date - 2020-09-21T07:32:11+05:30 IST

దేశంలో వరసగా రెండో రోజూ రికార్డు స్థాయిలో రికవరీలు నమోదయ్యాయి. పాజిటివ్‌ల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది...

రెండో రోజూ రికార్డు రికవరీలు!

  • కోలుకున్న వారు 94,612 మంది.. కొత్తగా పాజిటివ్‌లు 92,605
  • దేశంలో 10.10 లక్షల యాక్టివ్‌ కేసులు.. సీఎంలతో 23న ప్రధాని సమీక్ష!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: దేశంలో వరసగా రెండో రోజూ రికార్డు స్థాయిలో రికవరీలు నమోదయ్యాయి. పాజిటివ్‌ల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఆదివారం ఒక్క రోజులో 94,612 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. కొత్తగా 92,605 మందికి పాజిటివ్‌గా తేలింది. రికవరీ రేటు 79.68 శాతానికి చేరింది.


దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 54,00,619కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1133 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరింది. తాజాగా కోలుకున్నవారితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 43,03,043కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10.10 లక్షల యాక్టివ్‌ కేసులున్నట్లు వివరించింది. ఇక దేశంలో మరణాల రేటు 1.61 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 6.36 కోట్ల టెస్టులు చేశామని, శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 12.06 లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. గత 9 రోజుల్లోనే కోటి టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మిలియన్‌ జనాభాకు టెస్టుల సంఖ్య 46,131కి పెరిగినట్లు తెలిపింది. టెస్టులు పెంచడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుతోందని, పాజిటివ్‌ల సంఖ్య తగ్గడమే దీనికి నిదర్శనమని వివరించింది. 


23న సీఎంలతో మోదీ సమీక్ష!

కొవిడ్‌ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ త్వరలోనే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 23న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం కానున్నట్లు సమాచారం. రోజూ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులపై ప్రధాని సమీక్షించనున్నారు.  

  1. మహారాష్ట్రలోని థానేలో 106 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. 10 రోజుల చికిత్స అనంతరం నెగెటివ్‌ రావడంతో ఆమె ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 
  2. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో రాజస్థాన్‌లోని 11 జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించాలని అశోక్‌ గెహ్లోత్‌ సర్కారు నిర్ణయించింది. అక్టోబరు 31 వరకు ఆయా జిల్లాల్లో ఎలాంటి సమావేశాలు, సభలు, మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-09-21T07:32:11+05:30 IST