దిద్దుబాటు

ABN , First Publish Date - 2021-08-13T05:30:00+05:30 IST

‘మొక్కై వంగనిది మానై వంగుతుందా?’ అనేది సామెత. సత్యమే సామెతగా ప్రజల్లో ప్రచారం అవుతుంది. మంచయినా, చెడైనా మనుషుల్లో మొక్కగానే మొదలవుతుంది. మంచయితే దాన్ని మరింత పెరిగేలా చూడాలి. అదే చెడైతే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. ఒక చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని ఉపేక్షించి వదిలెయ్యకూడదని బుద్ధుడు చెప్పిన అయిదుగురి కథ ఇది...

దిద్దుబాటు

‘మొక్కై వంగనిది మానై వంగుతుందా?’ అనేది సామెత. సత్యమే సామెతగా ప్రజల్లో ప్రచారం అవుతుంది. మంచయినా, చెడైనా మనుషుల్లో మొక్కగానే మొదలవుతుంది. మంచయితే దాన్ని మరింత పెరిగేలా చూడాలి. అదే చెడైతే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. ఒక చిన్న తప్పు జరిగినప్పుడు దాన్ని ఉపేక్షించి వదిలెయ్యకూడదని బుద్ధుడు చెప్పిన అయిదుగురి కథ ఇది. 


దొంగతనం మహాదోషం

ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరూ పొలం పనులు చేసేవారు. ఎవరి మంచి నీటి కుండ వారే తీసుకుపోయేవారు. ఆ కుండలను ఒక చెట్టు కింద ఉంచి, పొలం పనులు చేసేవారు. దాహం వేసినప్పుడు వచ్చి ఎవరి కుండలో నీరు వారే తాగేవారు. కానీ ఒకసారి ఒకడు మంచి నీటి కోసం వచ్చి, వేరేవారి కుండలో నీరు తాగాడు. తిరిగి వెళ్ళి పనిలో పడ్డాడు. ఆ రోజు సాయంత్రం అతను నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చింది. ‘నాలో ‘దొంగతనం’ అనే దోష గుణం ప్రవేశించింది. దీన్ని ఇప్పుడే తుంచేసుకోవాలి. ఇలాగే వదిలేస్తే పెరిగి పెద్దదైపోతుంది. నన్ను దొంగను చేస్తుంది’ అనుకున్నాడు. చెడ్డ లక్షణాన్ని చూసి భయపడ్డాడు. ఆ భయమే అతణ్ణి తీర్చిదిద్దింది.


మోహం దహించేస్తుంది...

ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉన్నాడు. న్యాయమైన ధరలకు సరుకులు ఇస్తాడనీ, కల్తీ వస్తువులను అమ్మడనీ, తూకంలో మోసం చెయ్యడనీ మంచి పేరుంది. ఒక రోజు భార్యాభర్తలిద్దరు అతని దుకాణానికి వచ్చారు. ఆమె చాలా అందంగా ఉంది. చక్కగా అలంకరించుకుంది. ఆమెను చూడగానే వ్యాపారి మోహంలో పడ్డాడు. దురాచలోచన కలిగింది. ఆ రోజు రాత్రి భోజనం చేసి, నిద్రకు సిద్ధమవుతూ ఉండగా... తనకు కలిగిన ఆ కామవికారం గుర్తుకు వచ్చింది. ‘ఇది నిప్పు రవ్వ. ఈ చిన్న రవ్వ చాలు, ఊరూ వాడా తగలబెట్టడానికి. ఇది నన్ను నిలువునా దహించేస్తుంది. కీర్తిని హరిస్తుంది. కుటుంబానికి దూరం చేస్తుంది’ అనుకున్నాడు. భయపడ్డాడు. ఇక అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాడు. మనశ్శాంతి పొందాడు. అలా తనను తాను సరిదిద్దుకున్నాడు.


అసత్యం దుఃఖకారకం...

మరో సందర్భంలో... ఒక వ్యక్తి, అతని కొడుకూ కొండ దారిలో వెళ్తున్నారు. అక్కడ దొంగలు ఉంటారు. బాటసారుల్ని పట్టుకుంటారు. దొరికినవారు గురు శిష్యులైతే గురువును తమ దగ్గర ఉంచుకొని, శిష్యుణ్ణి విడిచిపెడతారు. వెళ్ళి డబ్బు తెమ్మంటారు. అన్నా తమ్ముళ్ళైతే అన్ననూ, తండ్రీ కొడుకులైతే తండ్రినీ వదిలిపెడతారు. వారైతే మిగిలిన వారి కోసం తిరిగి తప్పక వస్తారనీ, అడిగిన డబ్బు తెస్తారనీ దొంగల నమ్మకం. ఈ విషయం తెలిసిన తండ్రి తన కొడుకుతో ‘‘ఒకవేళ దొంగలు పట్టుకుంటే నేను నీ తండ్రినని చెప్పకు. నీవు నా బిడ్డవని నేను చెప్పను’’ అన్నాడు. కొంతసేపటికి వారిద్దరినీ దొంగలు పట్టుకున్నారు. ఇద్దరూ అబద్ధం చెప్పారు. దొంగలు వారిని వదిలిపెట్టారు. కానీ, అబద్ధం చెప్పాననే బాధ మాత్రం ఆ కొడుకును వదిలిపెట్టలేదు. ‘ఈ అలవాటు ఇలా ముదిరితే చివరకు మోసకారినైపోతాను. అది దుఃఖకారకం అవుతుంది’ అని భయపడ్డాడు. ‘ఇక ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు’ అని నిర్ణయించుకున్నాడు. అలాగే జీవించాడు.


జీవహింస కూడదు...

ఒక ఊరిలో జాతరలు జరుగుతున్నాయి. గ్రామస్తులు వందలాది మేకలనూ, కోళ్ళనూ, ఇతర జంతువులనూ బలికి సిద్ధం చేశారు. అయితే, బలి క్రియకు సంఘం పెద్ద అనుమతి కావాలి. గ్రామస్తులు వెళ్ళి అడిగారు. సంఘం పెద్ద ‘సరే’ అన్నాడు. బలి క్రియ పూర్తయింది. ఆ ప్రాంతం రక్తంతో తడిసి ఎర్రబడింది. వేలాది జంతువుల తలలు పోగుపడ్డాయి. మాంసం గుట్టలు గుట్టలుగా చేరింది. ఈ దృశ్యాన్ని చూడగానే సంఘం పెద్ద మనసు చివుక్కుమంది. హృదయం ద్రవించింది. ‘నా ఒక్క మాట వల్లే ఈ జీవహింస జరిగింది. ఇక ఇలాంటి కర్మకాండలను అనుమతించకూడదు’ అనుకున్నాడు. హింసా ప్రవృత్తిని తుంచేసుకోవాలనుకున్నాడు. ఆనాటి నుంచి ఆ సంఘంలో జంతు హింసను ఆపించాడు.


మత్తుతో అనర్థం...

ఆ రోజుల్లో మద్యపాన ఉత్సవాలు జరిగేవి. రకరకాల మద్యాన్ని తయారు చేసుకున్న గ్రామ ప్రజలు గ్రామాధికారి దగ్గరకు వచ్చి, అనుమతి అడిగేవారు. ఆయన అనుమతి ఇచ్చాడు. ప్రజలు తాగారు, ఊగారు. తిట్టుకున్నారు. తలలు పగిలాయి. కాళ్ళు, చేతులు విరిగాయి. ఉత్సవం చివరకు విషాదంగా మారింది. ‘దీనంతటికీ తప్పు నాదే’ అని పశ్చాత్తాపపడ్డాడు గ్రామాధికారి. ‘మనిషిని మత్తులో ముంచి, ప్రమత్తత కలిగించి, పశువుల్లా మార్చే మద్యపానానికి అనుమతి ఇవ్వడం వల్లే ఈ ఘోరం జరిగింది ’అనుకున్నాడు. ఇంకెప్పుడూ అలాంటివాటికి అనుమతి ఇవ్వలేదు.

ఇలా అయిదుగురు తమ అనుభవం ద్వారా ‘పంచశీల’ను గ్రహించారు. తమను తాము దిద్దుకున్నారు. తాము చేసిన తప్పులను తెలుసుకొని, ఆదిలోనే సరి చేసుకున్నారు. 

ఇలా తమను తాము సరిదిద్దుకుంటూ శీలగుణాలను పెంపొందించుకోవాలని ఈ కథల ద్వారా బుద్ధుడు బోధించాడు.

- బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2021-08-13T05:30:00+05:30 IST