Odisha: భారీవర్షాలతో ముగ్గురి మృతి..రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2021-09-14T13:23:39+05:30 IST

ఒడిశాలో కురిసిన భారీవర్షాల వల్ల ముగ్గురు మరణించారు....

Odisha: భారీవర్షాలతో ముగ్గురి మృతి..రెడ్ అలర్ట్

పాఠశాలలకు సెలవు

భువనేశ్వర్: ఒడిశాలో కురిసిన భారీవర్షాల వల్ల ముగ్గురు మరణించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఒడిశా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని 12 జిల్లాల్లో మంగళవారం భారీవర్షాలు కురవనున్నందున ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.భారీవర్షాల వల్ల పూరి, ఖుర్దా, కటక్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, ధెంకనల్, నయాగఢ్, సంబల్‌పూర్, దేవగఢ్, అంగుల్, సోనేపూర్, బార్‌గఢ్‌ జిల్లాల్లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని పాఠశాలవిద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆదేశించారు. 


ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్ అమృత్ రుతురాజ్ చెప్పారు. పూరి, భువనేశ్వర్ నగరాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. గరద్ పూర్ మండలంలోని బడాబెట గ్రామంలో ఇంటి గోడ కూలిన ఘటనలో అభయ్ మొహపాత్ర అనే వ్యక్తి మరణించారు. డెరాబిన్ మండలంలోని బెనిపూర్ దిహాసాహి గ్రామంలో గోడ కూలి నర్మద అనే మహిళ మరణించింది. ఖుర్దా జిల్లా నూగార్ గ్రామానికి చెందిన రైతు కంబేశ్వర్ కాల్వలో మునిగి మరణించారు.


Updated Date - 2021-09-14T13:23:39+05:30 IST