ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ : మోదీ

ABN , First Publish Date - 2021-12-07T20:54:32+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలు ఉత్తర ప్రదేశ్‌కు రెడ్

ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ : మోదీ

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలు ఉత్తర ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ వంటివని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ రానున్న శాసన సభ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోందని, ఉగ్రవాదుల పట్ల అలసత్వం ప్రదర్శించడానికి ఆ పార్టీ ఇలా కోరుకుంటోందని చెప్పారు. ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారు ప్రమాద ఘంటికలు మోగిస్తారని తెలిపారు. 


ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యంవహిస్తున్న ప్రాంతం గోరఖ్‌పూర్‌లో మూడు మెగా అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎయిమ్స్, ఎరువుల కర్మాగారం కూడా వీటిలో ఉన్నాయి. 


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారు ప్రమాద ఘంటికలు మోగిస్తారని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, కరోనా వైరస్ సంక్షోభ సమయంలో సైతం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగించిందని వీరికి అర్థం కాదన్నారు. తమ ప్రభుత్వాలు అభివృద్ధిని నిలిపేయలేదని తెలిపారు. సదుద్దేశంతో పని చేస్తే, విపత్తులు సైతం అడ్డంకులు కాబోవని చెప్పారు. 


అణగారిన వర్గాలు, అవకాశాలు లభించని వర్గాల గురించి ఆందోళన చెందే ప్రభుత్వం శ్రమించి పని చేస్తుందని, ఫలితాలను కూడా సాధిస్తుందని చెప్పారు. దృఢ నిశ్చయం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పడానికి నేడు గోరఖ్‌పూర్‌లో కార్యక్రమమే నిదర్శనమని వివరించారు. 


Updated Date - 2021-12-07T20:54:32+05:30 IST