అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-06T08:40:32+05:30 IST

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. అతనితో పాటు మరో ఏడుగురిని అరెస్టు..

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్ట్‌

ఫకృద్దీన్‌ సహా ఏడుగురి నుంచి రెండు టన్నుల దుంగలు, రూ.9.5 లక్షల నగదు స్వాధీనం


కడప(క్రైం), జూలై 5: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. అతనితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి రెండు టన్నుల దుంగలు, నాలుగు వాహనాలు, రూ.9.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ మంగళవారం కడప పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. చాపాడు మండలం ఖాదర్‌పల్లికి చెందిన స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ అతని అన్న లాల్‌బాషా, మరో సోదరుడు జాకీర్‌, అదే గ్రామానికి చెందిన లతీఫ్‌ ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. వీరు తమిళ కూలీలను తెప్పించి లంకమల్ల, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికించి ఖాజీపేట, మైదుకూరు ప్రాంతాల్లోని గోడౌన్‌లో దుంగలు నిల్వ ఉంచేవారు. వీటిని ఢిల్లీకి, బెంగళూరుకు తరలించేవారు. ముందస్తు సమాచారంతో ఫ్యాక్షన్‌ డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు టౌన్‌లోని మాడూరు వద్ద ఫకృద్దీన్‌, అతని అనుచరులైన యాసిన్‌, కామరాజు, గోడౌన్‌ యజమాని రామ్మోహన్‌రెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు.


వీరి నుంచి 40 ఎర్రచందనం దుంగలు, రూ.9.5 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖాజీపేట మండలం కొత్తపేట సమీపంలో మైదుకూరు రూరల్‌ సీఐ నరేంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట ఎస్‌ఐ కుళాయప్ప సిబ్బందితో దాడిచేసి ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన నల్లగొండు వీరభద్రుడు, ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బానవత్‌ గోపినాయక్‌, అనంతపురం జిల్లా బోదపల్లి గ్రామానికి చెందిన బోయ అరవిందును అరెస్టు చేసి 15 ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-07-06T08:40:32+05:30 IST