రాయితీకి రెడ్‌ సిగ్నల్‌!

ABN , First Publish Date - 2021-10-22T08:25:20+05:30 IST

రైలు టికెట్లలో రాయితీ (కన్సెషన్‌)ని ఎత్తి వేయడంతో వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మొత్తం టికెట్‌లో 50నుంచి 75 శాతం వరకు రాయితీపొందిన వేలాది మంది ప్రస్తుతం పూర్తి చార్జీలు,..

రాయితీకి రెడ్‌ సిగ్నల్‌!

  • రైలు టికెట్లపై కన్సెషన్‌కు మంగళం 
  • కొవిడ్‌ నేపథ్యంలో ఈ సౌకర్యం ఎత్తివేత

విశాఖపట్నానికి చెందిన రామ్మోహన్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో బోరబొండలో ఉంటున్నాడు. గతంలో వీరిని చూసేందుకు రామ్మోహన్‌ తల్లిదండ్రులు సీనియర్‌ సిటిజన్‌ టికెట్లపై స్లీపర్‌ క్లాసులో రూ. 295 చొప్పున వెచ్చించి హైదరాబాద్‌ వచ్చేవారు. ప్రస్తుతం రాయితీ టికెట్లను ఎత్తివేయడంతో ఒక్కొక్కరు రూ.395 చొప్పున చెల్లించి రావాల్సి వస్తోంది. దీంతో ఏడాదిలో 4సార్లు వచ్చే వారు ఇప్పుడు రెండుసార్లు కూడా రాలేకపోతున్నారు. 


రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన కాజీపేటకు చెందిన వెంకటేశ్వర్లు వికలాంగ కేటగిరీలో టికెట్‌పై 75శాతం రాయితీతో రైలులో హైదరాబాద్‌ ఆస్పత్రికి వచ్చేవాడు. స్లీపర్‌ క్లాస్‌లో రూ.185 ఛార్జీతో ప్రయాణించిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం రూ.245 వెచ్చించి వస్తున్నాడు. 


ఇలా వీరిద్దరే కాదు.. రైళ్లలో టికెట్లపై రాయితీ సౌకర్యాన్ని ఎత్తివేయడంతో ఎంతో మంది వివిధ వర్గాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రైలు టికెట్లలో రాయితీ (కన్సెషన్‌)ని ఎత్తి వేయడంతో వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మొత్తం టికెట్‌లో 50నుంచి 75 శాతం వరకు రాయితీపొందిన వేలాది మంది ప్రస్తుతం పూర్తి చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆస్పత్రులు, అత్యవసర పనులకు వెళ్తున్నవారు సతమతమవుతున్నారు. సీనియర్‌ సిటిజన్లు (పురుషులు-60, స్ర్తీలు-58 ఏళ్లు పైబడిన), వికలాంగులు, అంధులు, స్వాతంత్య్ర సమరయోధులు, క్యాన్సర్‌, తలసేమియా, హృద్రోగ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్‌, రాష్ట్రపతి అవార్డు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, యుద్ధ వితంతువులు, పాత్రికేయులతో పాటు ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు (మొత్తంగా 110 కేటగిరీలు చెందిన వారికి) ప్రయాణ సమయంలో భారతీయ రైల్వే టికెట్లపై రాయితీ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో రైళ్ల సంఖ్యను కుదించడం, ప్రత్యేక రైళ్లను నడుపుతుండడంతో ఈ రాయితీ సౌకర్యానికి తిలోదకాలు ఇచ్చింది. 

రైళ్ల సంఖ్య పెరుగుతున్నా అదే తీరు

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు, విశాఖపట్నం, గుంతకల్లు, నాందేడ్‌ డివిజన్ల పరిధిలో 274 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కొవిడ్‌ స్పెషల్‌ పేరుతో ఆయా రైళ్లకు రాయితీ సౌకర్యాన్ని తొలగించారు. 

30శాతం అధిక చార్జీల భారం..

టికెట్లలో రాయితీని తొలగించిన రైల్వే కొవిడ్‌ స్పెషల్‌ పేరుతో నిర్వహిస్తున్న రైళ్లలో చార్జీలు పెంచింది. ఉదాహరణకు సికింద్రాబాద్‌ - మహ బూబాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రె్‌సలో గతంలో జనరల్‌లో రూ.65 టికెట్‌ ఉండగా, ఇప్పుడు రూ.90 వసూలు చేస్తున్నారు. సెకండ్‌ సీటింగ్‌ రిజర్వేషన్‌కు రూ.110 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి రైలులో 30 శాతం అధిక ఛార్జీని వసూలు చేస్తున్నారు. జనరల్‌ టికెట్లతోపాటు సెకండ్‌ సీటింగ్‌, స్లీపర్‌, సెకండ్‌ ఏసీ, త్రీ టైర్‌ ఏసీలు.. అన్నింటిలో టికెట్ల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2021-10-22T08:25:20+05:30 IST