ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం

ABN , First Publish Date - 2022-01-19T08:07:05+05:30 IST

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం

ఈ ఏడాది పార్టీకి.. రాష్ట్రానికి అతి ముఖ్యం

పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు


అమరావతి, జనవరి 18 (ఆంధ్ర జ్యోతి): ఈ ఏడాది రాష్ట్రానికి అతి ముఖ్యమైన సందర్భాలు రెండు రాబోతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘రాష్ట్ర చరిత్రను మేలు మలుపు తిప్పిన టీడీపీ ఆవిర్భవించి ఈ ఏడాదితో నలభై ఏళ్లవుతుంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి కూడా ఈ ఏడాదిలోనే జరగనుంది. తెలుగు ప్రజలకు ఈ రెండూ అత్యంత ముఖ్యమైన సందర్భాలుగా ఉండబోతున్నాయి. వీటిని ఘనంగా నిర్వహించుకుందాం’ అని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన మంగళవారం  ఘన నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ‘ఒక సాధారణ వ్యక్తి అసాధారణ విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహా మనీషి ఎన్టీ రామారావు. సాధారణ కుటుంబంలో పుట్టి అనితర సాధ్యమైన కృషితో సినీ, రాజకీయ రంగాల్లో మహోన్నతునిగా ఎదిగారని, కొన్ని వర్గాలకే పరిమితమైన అధికారాన్ని బడుగు బలహీన వర్గాలకు చేరువ చేశారని పేర్కొన్నారు. పేదలే దేవుళ్లుగా నమ్మి వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి చిరస్మరణీయునిగా నిలిచిపోయారని తెలిపారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రజా సేవకు పునరంకితమవుదామని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం శ్రమించే పార్టీగా వారి కోసం మరింత బలమైన పోరు సల్పుదామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకుల వైఫల్యంతో రాష్ట్రం అధోగతి పాలవుతున్న ఈ సమయంలో మరింత దూకుడుగా టీడీపీ పోరాడాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.


ఎన్టీఆర్‌తో సామాజిక విప్లవం: అచ్చెన్న

రాష్ట్రంలో సామాజిక విప్లవానికి ఎన్టీ రామారావు ఆద్యుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ వ్యపస్థాపకుడు ఎన్టీరామారావుు 26వ వర్ధంతిని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిర్వహించి, ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్న అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కేవలం ఓటు వేసే యంత్రాల మాదిరిగా మాత్రమే ఉండేవారని, ఆ వర్గాల్లో రాజకీయ చైతన్యం కలిగించి చదువుకొన్న వారిని ముందుకు తెచ్చి రాజకీయ భాగస్వామ్యం కల్పించి తలెత్తుకొని నడిచే అవకాశం కల్పించిన విప్లవకారుడు ఎన్టీఆర్‌ అని తెలిపారు. కరోనా వైర్‌సను మించిపోయి జగన్‌ వైరస్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిందని, రాష్ట్రం బాగు కోరే ప్రతివారూ మళ్లీ టీడీపీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా, పార్టీ అధినేత చంద్రబాబు తేలికపాటి లక్షణాలతో  కరోనా బారిన పడ్డారని,  ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదని... ప్రజల ఆశీస్సులతో కోలుకొని త్వరలోనే వస్తారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని దుర్మార్గ పాలన అంతానికి పోరాటం చేయాలని ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసి వారి గుండెల్లో నిలిచిపోయారని పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి. జనార్ధన్‌ ప్రశంసించారు.  పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు ఎన్టీఆర్‌ సేవలను కీర్తించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. 


తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌: లోకేశ్‌ 

తనకు ఎదురైన ప్రతి సవాల్‌నూ సంచలన విజయంగా మార్చుకున్న నిజమైన కథానాయకుడు దివంగత ఎన్టీఆర్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి.. ఇవే ఎన్టీఆర్‌ ఆయుధాలు. అందుకే ఆయన ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తీసుకుని, వ్యవస్థల్ని సంస్కరించగలిగారు. తెలుగు జాతి ముద్దు బిడ్డ కాగలిగారు. ఎన్టీఆర్‌ 26వ వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి అంజలి ఘటిస్తున్నానని మంగళవారం ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో అసలైన సర్వజన సంక్షేమ రాజ్యం స్థాపించేందుకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 


చరిత్రకు చిహ్నం ఎన్టీఆర్‌: తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌

చరిత్రకు చిహ్నంగా నిలిచిన నాయకుడు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన అన్నారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని  అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి అక్కడి తెలుగు వారు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. 

Updated Date - 2022-01-19T08:07:05+05:30 IST