రెడ్‌జోన్‌లో బయటికొస్తే క్వారంటైనే

ABN , First Publish Date - 2020-06-05T13:32:44+05:30 IST

చెన్నైలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపించిన ప్రాంతాల నుంచి ఎవరైనా నిషేధాజ్ఞలను ఉల్లఘించి బయటకు వెళ్తే వారిపై కేసులు

రెడ్‌జోన్‌లో బయటికొస్తే క్వారంటైనే

చెన్నై: చెన్నైలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపించిన ప్రాంతాల నుంచి ఎవరైనా నిషేధాజ్ఞలను ఉల్లఘించి బయటకు వెళ్తే వారిపై కేసులు నమోదు చేసి రెండువారాలపాటు క్వారంటైన్‌లో ఉంచుతామని కరోనా నిరోధక విభాగం ప్రత్యేక అధికారి జె. రాధాకృష్ణన్‌ హెచ్చరించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కార్యాలయంలో నగరంలో చేపడుతున్న కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై అధికారులతో గురువారం ఉదయం ఆయన సమీక్ష జరిపారు. ఈ సమీక్షానంతరం రాధాకృష్ణన్‌ మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రజలంతా తప్పని సరిగా మాస్కులు ధరించాలని, లేకుంటే వైరస్‌ వ్యాప్తి అధికమవుతుందని తెలిపారు. నగరంలో  పాజిటివ్‌ కేసులు అధికమవుతుండటంపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. తండయార్‌పేట, రాయపురం జోన్లలో కరోనా కేసులు పెరగడానికి ఆ జోన్లలో ఇరుకువీధులు, సందుల్లో అధిక జనాభా నివసించడం కూడా ఓ కారణమని చెప్పారు. వార్డులవారీగా కరోనా వ్యాప్తిపై కార్పొరేషన్‌ అధికారులతో సమీక్ష జరిపామని తెలిపారు. ఇక నగరంలో అత్యధిక కేసులున్న ప్రాంతాల్లో జనసంచారాన్ని కట్టడి చేసేలా పోలీసులు, అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారని, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నవారెవరైనా అక్కడి నుంచి వేరేచోటుకు వెళ్లినట్టు తెలిస్తే వారిపై కేసు నమోదు చేసి 14 రోజులపాటు ప్రభుత్వ శిబిరాల్లో క్వారంటైన్‌లో ఉంచుతామని ఆయన హెచ్చరించారు. 


ఇళ్ళలో క్వారంటైన్‌ రద్దు

ఇదిలా వుండగా నగరంలో కరోనా సోకిన లక్షణాలు కలిగినవారిని ఇళ్లల్లోనే 14 రోజులపాటు నిర్బంధించే విధానాన్ని రద్దు చేస్తున్నట్టు కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ తెలిపారు. రాధాకృష్ణన్‌తోపాటు ఆయన మీడియా ప్రతినిథుల తో మాట్లాడుతూ నగరంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక మీదట జలుబు, జ్వరం, దగ్గువంటి లక్షణాలు కలిగినవారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లోని క్వారంటైన్‌లో ఉంచుతామని తెలిపారు. ప్రత్యేక శిబిరాల్లో ఉన్నవారిలో ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలున్నట్టయితే వారి కుటుంబీకులను క్వారంటైన్‌కు పంపుతామని చెప్పారు. కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వ శిబిరాలకే తరలిస్తామని, ఇళ్లలో ఉంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-05T13:32:44+05:30 IST