పాపిట సింధూరం వద్దనుకుంటే పెళ్లిని తిరస్కరించినట్టే : హైకోర్టు

ABN , First Publish Date - 2020-06-30T03:35:36+05:30 IST

వివాహం తరువాత పాపిట సింధూరం ధరించేందుకు అంగీకరించని వధువు ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గువహటి హైకోర్టు వ్యాఖ్యానించింది.

పాపిట సింధూరం వద్దనుకుంటే పెళ్లిని తిరస్కరించినట్టే : హైకోర్టు

న్యూఢిల్లీ: వివాహం తరువాత పాపిట సింధూరం ధరించేందుకు అంగీకరించని వధువు ఆ వివాహాన్ని తిరస్కరించినట్టేనని గువహటి హైకోర్టు వ్యాఖ్యానించింది. సింధూరం ధరించడం, గాజులు తొడుక్కోవడం అనేది హింధూ వధువు పాటించే ఆచారాలని, వరుడితో వివాహాన్ని అంగీకరిస్తున్నట్టు ఇవి సూచిస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. విడాకుల కోసం ఓ భర్త వేసిన పిటిషన్‌కు సంబంధించి ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


పూర్తి వివరాల్లోకి వెళితే..అస్సాంకు చెందిన ఓ జంటకు 2012లో పెళ్లి అయింది. కానీ పెళ్లై నెల తిరగకముందే వారి బంధం బీటలు వారింది. అత్తమామలతో కలిసి ఉండేందుకు ఆమె నిరాకరించింది. అదే సమయంలో ఆమెకు పిల్లలు కూడా కలుగకపోవడంతో వారి మధ్య బంధం మరింత బలహీనపడింది. ఈ క్రమంలో 2013లో ఆమె భర్త ఇంటిని వదిలి విడిగా ఉండటం ప్రారంభించింది. ఆ సమయంలో భర్త, అతడి కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టింది. అయితే హైకోర్టు అప్పట్లో ఈ కేసును కొట్టేసింది.


అనంతరం..తనకు విడాకులు కావాలంటూ భర్త దిగువ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. భార్య వేధింపులే ఈ నిర్ణయానికి కారణమని చెప్పుకొచ్చాడు. కానీ భార్య మాత్రం విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోగా..భర్త, అత్తమామలే తనను కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. ఇంతకాలం తన సోదరుడే తన బాగోగులు చూసుకున్నాడని తెలిపింది. ఇదిలా ఉంటే.. తన భార్య సింధూరం పెట్టుకునేందుకు కూడా నిరాకరించిందని, అవివాహిత మహిళగానే కనబడేందుకు ప్రయత్నించిందని అతడు చెప్పుకొచ్చాడు.


ఈ చర్యలతో తాను ఓ భర్తగా అవమానం పాలయ్యాయని వాపోయాడు. భార్య తనను వేధిస్తోందని ఆరోపించాడు. అయితే ట్రయల్ కోర్టు మాత్రం భర్త విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇరు పక్షాల వాదనలను విన్న గువహటి హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టేస్తూ అతడికి విడాకులు మంజూరు చేసింది. భర్త అతడి కుటుంబ సభ్యులపై నిరాధార ఆరోపణలు చేయడం, కేసులు వేయడం వేధింపుల కిందకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-30T03:35:36+05:30 IST