అత్యుత్సాహం ప్రదర్శిస్తే వేటు తప్పదు

ABN , First Publish Date - 2021-04-11T05:14:52+05:30 IST

పోడు భూముల విషయంలో అత్యుత్సాహం, నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై వేటు తప్పదని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు హెచ్చరించారు.

అత్యుత్సాహం ప్రదర్శిస్తే వేటు తప్పదు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో బైక్‌పై రేగా

అటవీ అధికారులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరిక

పైడిగూడెంలో పోడుసాగుదారులతో సమావేశం

మావోయిస్టు ఇలాఖాలో బైక్‌పై ప్రయాణం

దుమ్ముగూడెం ఏప్రిల్‌ 10: పోడు భూముల విషయంలో అత్యుత్సాహం, నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై వేటు తప్పదని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం వద్ద వివాదాస్పద అటవీభూముల్లో పోడుసాగు చేస్తున్న ఆదివాసీలతో శనివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో చేపట్టనున్న సమగ్ర భూసర్వే అనంతరం అర్హులైన ప్రతీ ఒక్క పోడు సాగుదారుడికి భూమి పట్టాలిప్పిస్తామని తెలిపారు. పోడుభూముల సమస్యపై ప్రభుత్వం జారీ చేసిన స్టేటస్‌కోను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు కేవలం ఇసుక రీచ్‌ల కోసమే గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ఆదివాసీ గ్రామాల్లో ప్రతీ ఒక్క అభివృద్ధి పని కోసం ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం ఆదిలాబాద్‌ నుంచి అశ్వారావుపేట వరకు ప్రతీ గ్రామంలో గ్రామసభ నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సమానమైన పీసా చట్టం నిర్వీర్యానికి గురవుతోందని తెలిపారు. పోడు వివాదాలతో ఆదివాసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా గిరిజన సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై రేగాకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్‌ డా. తెల్లం వెంకట్రావు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ సీతమ్మ, సర్పంచ్‌లు మంగమ్మ, జ్యోతి, శివాజీ, శివరామకృష్ణ, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. రేగా పర్యటన కోసం సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పైడిగూడెం అటవీప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. 

మావోయిస్టు ఇలాఖాలో బైక్‌ ప్రయాణం 

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పైడిగూడెం అటవీ ప్రాంతంలో ప్రభుత్వ విప్‌ రేగా ద్విచక్రవాహనంపై కొంతసేపు ప్రయాణించారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో వివాదాస్పద పోడు భూముల వద్దకు బైక్‌పై రేగా వెళ్లారు. ఉగాది అనంతరం సమీక్షా సమావేశంలో మాట్లాడుకుం దామని అప్పటి వరకు వివాస్పద భూముల్లో ట్రెంచి పనులు ఆపాలని రేంజి అధికారి పాయం కనకమ్మకు ప్రభుత్వ విప్‌ రేగా సూచించారు.  

Updated Date - 2021-04-11T05:14:52+05:30 IST