రాజ్యసభలో 5 రెట్లు పెరిగిన ప్రాంతీయ భాషా వినియోగం

ABN , First Publish Date - 2021-01-17T07:59:22+05:30 IST

రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే పెద్దల సభలో మాతృ భాషలను ఎక్కువగా ఉపయోగించినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరినట్లవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇచ్చిన ప్రోత్సాహం ఫలితాన్నిస్తోంది.

రాజ్యసభలో 5 రెట్లు పెరిగిన ప్రాంతీయ భాషా వినియోగం

 2018-20 మధ్య తెలుగులో 33సార్లు ప్రసంగాలు

 ప్రాంతీయ భాషలకు వెంకయ్య పెద్ద పీట


న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే పెద్దల సభలో మాతృ భాషలను ఎక్కువగా ఉపయోగించినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరినట్లవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇచ్చిన ప్రోత్సాహం ఫలితాన్నిస్తోంది. రాజ్యసభలో గతంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా ప్రాంతీయ భాషలో సభ్యులు మాట్లాడారు. 2018-20 మధ్య మునుపెన్నడూ లేనివిధంగా 22 షెడ్యూల్డు భాషల్లోని పదిభాషల్లో మాట్లాడారు. సభ్యుల్లో ఎక్కువమంది హిందీలో మాట్లాడగా, ఆ తర్వాత ఆ అవకాశాన్ని తెలుగువారు ఉపయోగించుకున్నారు. సంస్కృతంలో కూడా సభ్యులు మాట్లాడడానికి ముందుకు రావడం విశేషం.


రాజ్యసభలో మాట్లాడిన భాషల్లో సంస్కృతానికి 5వ స్థానం దక్కింది. ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోని డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాలీ భాషల్లోనూ మొదటిసారిగా సభ్యులు మాట్లాడగా, చాలా కాలం తర్వాత అస్సామీ, బోడో, గుజరాతీ, మరాఠీ, మణిపురి, నేపాలీ భాషల్లోనూ ప్రసంగించారు. 2018లో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంతాలీ, సింధీ భాషల్లో తొలిసారి అనువాదకులను ప్రవేశపెట్టడంతో ఈ భాషల్లో కూడా సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కలిగింది.


22 షెడ్యూల్డు భాషల్లో అనువాద సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో 2018 జూలై నాటికి సభ్యులు అన్ని భాషల్లో మాట్లాడేందుకు వీలు కలిగింది. కొత్తగా చేర్చిన 10 భాషల్లో వెంకయ్య మాట్లాడడం విశేషం. 2020లో జరిగిన 33 సిట్టింగ్‌లలో సభ్యులు కనీసం 49 సార్లు ప్రాంతీయ భాషల్లో ప్రస్తావనలు చేశారు.


2013-17 కాలంలో 329 సిట్టింగ్‌లు జరిగినప్పటికీ సభ్యులు హిందీ మినహా కేవలం 10 భాషల్లోనే మాట్లాడారు. 2018-20 మధ్య 163 రోజులు సమావేశాలు జరగగా, ప్రాంతీయ భాషల్లో సభ్యులు 135 రోజులు పాల్గొన్నారు. తమిళంలో 18సార్లు, తెలుగులో 33 సార్లు, ఉర్దూలో 24 సార్లు, బెంగాలీలో 17సార్లు, సంస్కృతంలో 12 సార్లు మాట్లాడారు.


Updated Date - 2021-01-17T07:59:22+05:30 IST