టీనేజర్లకు టీకా కోసం రిజిస్ట్రేషన్లు మొదలు

ABN , First Publish Date - 2022-01-01T21:36:48+05:30 IST

ఈ నెల మూడో తేదీ నుంచి దేశంలోని 15-18 ఏళ్ల టీనేజర్లకు టీకాలు ఇవ్వనున్నట్టు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ

టీనేజర్లకు టీకా కోసం రిజిస్ట్రేషన్లు మొదలు

న్యూఢిల్లీ: ఈ నెల మూడో తేదీ నుంచి దేశంలోని 15-18 ఏళ్ల టీనేజర్లకు టీకాలు ఇవ్వనున్నట్టు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రిజిస్ట్రేషన్లు మొదలైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.


అర్హులైన తమ పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు తల్లిదండ్రులు కొవిన్ యాప్‌లో పిల్లల పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని కోరారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను చిన్నారులకు ఇవ్వనున్నారు. 15 ఏళ్లు నిండిన వారు (2007, అంతకంటే ముందు జన్మించినవారు) కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆన్‌సైట్ వద్ద కూడా పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. టీకా తొలి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.


15-18 ఏళ్లలోపు టీనేజర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు గత నెల 25న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అలాగే, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు నిండి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు దేశంలో శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. 

Updated Date - 2022-01-01T21:36:48+05:30 IST