Abn logo
Nov 23 2020 @ 02:05AM

స్టే తొలగిన వెంటనే రిజిస్ట్రేషన్లు

Kaakateeya

25న ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండండి

కరోనా సెకండ్‌ వేవ్‌పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

అన్‌లాక్‌ అనే నిర్లక్ష్యం వద్దు.. మాస్కులు తప్పనిసరి

రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో పెరుగుదల

సెకండ్‌ వేవ్‌ను తట్టుకునే విధంగా అన్ని రకాల చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా 10,000 ఆక్సిజన్‌ పడకలు సిద్ధం

వ్యాక్సిన్‌ వస్తే ముందు వైద్య సిబ్బందికే: సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్థతతో ఉందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 23న కోర్టు విచారణ ఉన్నందున, 25న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్థంగా ఉండాలని ఆదివారం అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షాణాధికారం ఎవరికీ లేదని వెల్లడించారు. 


ఇక రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్రం సిద్థంగా ఉండాలని, అందుకు  తగిన ఏర్పాట్లు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేయాల్సినంత చేస్తుందని, అన్‌లాక్‌ నడుస్తున్నప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అదే అసలైన మందు అని సూచించారు. క్రమం తప్పకుండా మాస్కులను ధరించాలని పేర్కొన్నారు.


‘‘రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య బాగా తగ్గింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్‌ల సంఖ్య 2.1 శాతమే ఉంటోంది. రికవరీ రేటు 94.03 శాతం ఉంటోంది. కరోనా వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పడకలు ఆక్సిజన్‌ సౌకర్యంతో సిద్థంగా ఉన్నాయి. ఇంకా ఎన్నయినా సిద్థం చేయగలం. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.


ఢిల్లీ, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, పశ్చిమబెంగాల్‌లో కేసులు బాగా పెరుగుతున్నాయని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కొద్దిగా పెరుగుతున్నాయని, దీంతో పాటు కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారని చెప్పారు.  కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముందు ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఆస్తులను ఆప్‌లోడ్‌ చేసుకోవచ్చు


వ్యవసాయేతర ఆస్తుల నమోదు విషయంలో ప్రజలకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. ఆన్‌లైన్‌లోకి ఎక్కకుండా ఉన్న ఆస్తులను యజమాని సొంతంగా నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే విషయాన్ని కోర్డుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను ధరణిలో చేర్చడం కోసం ప్రభుత్వం ఇప్పటికే సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో అప్‌డేట్‌ చేయని ఆస్తుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. వాటిని అలాగే వదిలేస్తారా? లేక మరోసారి సర్వేను నిర్వహిస్తారా? అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు.


తాజాగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ధరణిలోకి ఎక్కకుండా మిగిలి పోయిన ఆస్తుల విషయంలో యజమానులు సొంతంగా వాటిని అప్‌డేట్‌ చేసుకునే వెలుసుబాటును కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఆస్తులను అధికారులు ఉపయోగించే మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా లేదా, మీ సేవ కేంద్రాలు, లేదా వెబ్‌సైట్‌లో యజమాని సొంతంగా కూడా నమోదు చేసుకోవచ్చు. మీ సేవలో అప్‌డేట్‌ చేసుకునే వారు ఏలాంటి రుసుం చెల్లించకుండానే, అంటే ఉచితంగానే తమ ఆస్తులను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. 

కాగా వ్యవసాయేతర ఆస్తుల విషయంలో కూడా రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే సదరు ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట మ్యుటేషన్‌ జరిగే విధంగా చర్యలను తీసుకుంటున్నట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. 


Advertisement
Advertisement