మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రాత్రి వేళలో రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2021-09-04T05:48:17+05:30 IST

మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రాత్రి వేళలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అన్నిపత్రాలూ సక్రమంగా ఉండే డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు చేసే అధికారులు... నిషేధిత సర్వే నెంబర్లు, అనధికార లేఅవుట్లలోని ప్లాట్లు, తదితర క్రయ, విక్రయాల ప్రక్రియను రాత్రివేళలో చేయడం అలవాటుగా మారింది.

మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రాత్రి వేళలో రిజిస్ర్టేషన్లు
క్రమవిక్రయదారులు, దళారీ, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి

ప్రైవేటు వ్యక్తులతో పని పూర్తి!


మదనపల్లె, సెప్టెంబరు 3: మదనపల్లె సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రాత్రి వేళలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అన్నిపత్రాలూ సక్రమంగా ఉండే డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు చేసే అధికారులు... నిషేధిత సర్వే నెంబర్లు, అనధికార లేఅవుట్లలోని ప్లాట్లు, తదితర క్రయ, విక్రయాల ప్రక్రియను రాత్రివేళలో చేయడం అలవాటుగా మారింది. స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో శుక్రవారం పగలంతా యథావిధిగా రిజిస్ర్టేషన్లు చేశారు.  సాయంత్రం 4 గంటలకుపైన సబ్‌రిజిస్ర్టార్‌... కార్యాలయం నుంచి వెళ్లిపోగా, రాత్రి 7.30 నుంచి 8గంటల వరకూ ప్రైవేటు సిబ్బంది డాక్యుమెంట్‌లో ప్రధానమైన చెక్‌స్లిప్పుతో(సీఎస్‌)పాటు ఫొటోలు తీశారు. అనంతరం మరో ప్రైవేటు అటెండర్‌ క్రయ, విక్రయదారుల నుంచి రాత్రివేళలోనే లైట్ల వెలుగులో వారి నుంచి కీలకమైన వేలిముద్రలు, సంతకాల ప్రక్రియ పూర్తిచేశారు. తరచూ సర్వర్‌ సమస్య, ఆన్‌లైన్‌ పనిచేయలేదని, తగిన సిబ్బంది లేరంటూ కాలయాపన చేసే అధికారులు, సిబ్బంది ఈరోజు వచ్చిన డాక్యుమెంట్లను, మరుసటిరోజు రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. మామూలు వాటికంటే సొమ్ములు ఎక్కువగా వచ్చే పత్రాలు, అయిన వారికి మాత్రం ఆలస్యం చేయకుండా పనికానిచ్చేస్తున్నారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉండే వాటిని ఉదయాన్నే చేస్తుండగా, సరైన రికార్డులు లేని, కొర్రీలు పెట్టే డాక్యుమెంట్లను ఎవరూ లేని సమయంలో ఇలా రాత్రివేళలో చేసేస్తున్నారు. మదనపల్లె మండలం కోళ్లబైలు రెవెన్యూ గ్రామం సర్వే నెం.596లోని పది డాక్యుమెంట్లను రిజిస్ర్టేషన్‌ చేశారు. గతంలో వ్యవసాయ భూమిగా ఉన్న ఈ స్థలాన్ని ప్రస్తుతం ప్లాట్లు కింద చేస్తున్నారు. కడపకు చెందిన ఓ వ్యక్తి సూచనల మేరకు వీటిని రిజిస్ర్టేషన్‌ చేసినట్లు తెలిసింది. సబ్‌రిజిస్ర్టార్‌ లేకపోయినా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు, దళారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. సబ్‌రిజిస్ర్టార్‌ బయటకు వెళ్తూ, పూర్తి చేసేయండి, తర్వాత వచ్చిన రికార్డులో నమోదు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే డాక్యుమెంట్‌ ఫొటోఫార్మర్‌లో మాత్రం తేదీ, సమయంతో సహా నమోదు కావడాన్ని మరిచిపోయినట్లున్నారు. సాధారణంగా సాయంత్రం 5గంటల లోపల ప్రక్రియను పూర్తి చేయాల్సివుంది. కానీ నాలుగురాళ్లు అధికంగా వచ్చే వాటిని, బయటకు రాకుండా చేయాల్సిన రిజిస్ట్రేషన్లను ఇలాంటి సమయంలో చేయడం చర్చనీయాంశంగా మారింది. లక్షల రూపాయలు చేతులు మారినట్లు చెబుతున్న ఇవి డీకేటీ భూమా? లేక పట్టా అన్నది అధికారుల విచారణలో తేలాల్సింది.  అలాగే ఆరునెలల క్రితం కూడా ఇదే తరహాలో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌ విధులు ముగించుకుని ముందే వెళ్లిపోగా, తర్వాత సిబ్బందే డాక్యుమెంట్‌కు నెంబర్లు ఇచ్చి, అకౌంట్‌బుక్కులో నమోదు చేశారు. దీన్ని అప్పట్లో ఆంధ్రజ్యోతి  దినపత్రిక వెలుగులోకి తేవడంతో కార్యాలయంలో పెద్ద దుమారమే రేగింది.



Updated Date - 2021-09-04T05:48:17+05:30 IST