సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2022-01-19T08:05:05+05:30 IST

సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు

సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు

37 గ్రామాల్లో లాంఛనంగా ప్రారంభించిన సీఎం

3 వారాల్లో మరో 14 గ్రామాల్లో అందుబాటులోకి

భూ వివాదాలను పరిష్కరించేందుకే రీ సర్వే: జగన్‌

గ్రామాల్లోని ఆస్తుల రిజిస్ర్టేషన్‌ ఇక గ్రామాల్లోనే

సబ్‌ రిజిస్ర్టార్‌ పరిశీలనకు డాక్యుమెంట్లు

డిజిటల్‌ అసిస్టెంట్‌ దగ్గర నమూనా డాక్యుమెంట్లు

ఎక్కడ తయారుచేసుకొచ్చినా చేసే వెసులుబాటు


అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఆస్తుల రిజిస్ర్టేషన్లను గ్రామ సచివాలయాల్లో చేపట్టారు. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే పూర్తయిన 37 గ్రామాల్లో భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడత 51 గ్రామాల్లో భూముల సమగ్ర సర్వే పూర్తవగా, ఇందులో 37 గ్రామాలకే నెట్‌వర్క్‌ కనెక్షన్‌ ఉండడంతో ఆ గ్రామాల్లోనే ఈ సేవలను ప్రారంభించారు. మంగళవారం నుంచి ఆ గ్రామాల సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు చేసేలా చట్టంలో మార్పు లు తెస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. మిగిలిన 14 గ్రామాల్లోనూ వచ్చే మూడు వారాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. ఆ పధ్నాలుగు గ్రామాల్లోను త్వరలోనే ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటుచేసి రిజిస్ర్టేషన్లు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ సర్వే, సరిహద్దుల చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం ఆయా గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నోటిఫికేషన్‌ ఇచ్చారు. రీ సర్వే అనంతరం రూపొందించిన భూముల రికార్డులను సీఎం రైతులకు అంకితం ఇచ్చారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక కార్స్‌ టెక్నాలజీతో రీ సర్వే చేస్తున్నామని, భూముల హద్దులకు అక్షాంశ, రేఖాంశాలను జోడించి డిజిటలైజ్‌ చేస్తున్నామని చెప్పారు. రీ సర్వేపూర్తయిన  గ్రామాల్లో భూ వివాదాలకు చెక్‌ పెడుతూ గ్రామస్థాయిలో సచివాలయం కేంద్రంగానే భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించామన్నా రు. 80-90 శాతం సివిల్‌ కేసులు భూవివాదాలే అని, రీ సర్వేతో అవి పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రతీ భూ కమతానికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తామని, దాని ఆధారంగా రికార్డును ఎవ్వరూ తారుమారు చేయలేరని సీఎం చెప్పారు. భూ కమతానికి యూనిక్‌ ఐడీతోపాటు అక్షాంశ, రేఖాంశాలు ఉంటాయని, వీటికి క్యూఆర్‌ కోడ్‌ను జతపరుస్తామని, రికార్డులను తారుమారు చేయకుండా పక్కా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో భూముల సర్వేను 2023 జూన్‌ నాటికి పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 


సబ్‌ డివిజన్‌ చేశాకే రిజిస్ట్రేషన్‌..

భూముల క్రయ, విక్రయాల అనంతరం పక్కాగా సర్వేచేసి సబ్‌డివిజన్‌ చేయాలని సీఎం నిర్దేశించారు. సబ్‌డివిజన్‌ పూర్తయ్యాకే భూముల రిజిస్ట్రేషన్‌ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్‌లైన్‌ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్‌డివిజన్‌ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని నిర్దేశించారు. శాశ్వత భూ హక్కు పత్రం అందించేందుకు సింగిల్‌ విండో విధానం అమలు చేస్తామని సీఎం చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


మార్చి కల్లా మరో 650 గ్రామాల్లో..

రీసర్వే పూర్తికానున్న మరో 650 గ్రామాల్లోనూ ఫిబ్రవరి చివరి నాటికి, లేకుంటే మార్చిలో రిజిస్ర్టేషన్లు చేసుకునే ఏర్పాట్లు పూర్తిచేయాలనే నిర్ణయంతో ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లోను రిజిస్ర్టేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌ శాఖ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. కాగా, ప్రభుత్వం అనుమతించిన గ్రామ సచివాలయాల పరిధిలోని రిజిస్ర్టేషన్లు ఇకపై ఆయా చోట్లే జరగాలి. అమ్మకం, గిఫ్ట్‌, ఆస్తుల పంపకం, తాక ట్టు తదితర రిజిస్ర్టేషన్ల కోసం అవసరమైన నమూనా డాక్యుమెంట్లను గ్రామ సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్ల వద్ద అందుబాటులో ఉంచుతారు. నమూనా డాక్యుమెంట్లలో అవసరమైన వివరాలు నింపి రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. లేదంటే డాక్యుమెంట్‌ ఎక్కడ తయారుచేసుకొచ్చినా రిజిస్ర్టేషన్‌ చేస్తారు. గ్రామ సచివాలయంలో ఆ డాక్యుమెంట్‌ను తీసుకుని స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో సమీప సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి పంపిస్తారు. సబ్‌ రిజిస్ర్టార్‌ దాన్ని పరిశీలించి అంతా సరిగ్గా ఉంటే రిజిస్ర్టేషన్‌కు ఆన్‌లైన్‌లోనే ఆమోదం తెలిపి, ఆ డాక్యుమెంట్‌ను తిరిగి గ్రామ సచివాలయానికి పంపించేస్తారు. దీంతో గ్రామ సచివాలయంలోనే రిజిస్ర్టేషన్‌ అయిపోతుంది. ఏవైనా తప్పులుంటే తెలియజేసి, సరిచేసి రిజిస్ర్టేషన్‌ జరిగేలా సబ్‌ రిజిస్ర్టార్‌ సహకరిస్తారు. డాక్యుమెంట్‌లో ఆయన సూచించిన సవరణలు చేసి, మళ్లీ సబ్‌ రిజిస్ర్టార్‌కు ఆన్‌లైన్‌లో పంపిస్తే రిజిస్ర్టేషన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. మొత్తంగా రిజిస్ర్టేషన్‌ చేసుకునే పార్టీలు అసలు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికే వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు.

Updated Date - 2022-01-19T08:05:05+05:30 IST