ఎల్‌ఎండీకి ఐదు టీఎంసీల నీరు

ABN , First Publish Date - 2020-05-10T10:43:02+05:30 IST

అర్భన్‌ మిషన్‌ భగీరథ కోసం శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి ఎల్‌ఎండీకి ఐదు టీఎంసీల నీటిని విడుదల

ఎల్‌ఎండీకి ఐదు టీఎంసీల నీరు

ఎస్సారార్‌ రిజర్వాయర్‌ నుంచి విడుదలకు సీఎం ఆమోదం 

ఫలించిన మంత్రులు ఈటల, గంగుల ప్రయత్నం 

త్వరలో కరీంనగర్‌లో రోజూ నీటి సరఫరా 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): అర్భన్‌ మిషన్‌ భగీరథ కోసం శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి ఎల్‌ఎండీకి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకారం తెలిపారు. కరీంనగర్‌లో ప్రతి రోజూ తాగునీటిని సరఫరా చేసేందుకు వీలుగా లోయర్‌ మానేరు డ్యాంకు ఎస్సారాఆర్‌ నీటిని విడుదల చేయాలని జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ చేసిన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శనివారం రాత్రి  ఎస్సారార్‌ రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల చేయడం ప్రారంభించారు.


ప్రస్తుతం 7.2 టీఎంసీల నిల్వ

ప్రస్తుతం ఎల్‌ఎండీలో 7.2 టీఎంసీల నీటి నిలువ ఉండగా ఈ ఐదు టీఎంసీల నీటితో కలుపుకొని ఎల్‌ఎండీలో నీటి నిలువ 12.2టీఎంసీలకు చేరుకుంటుంది. మిషన్‌ భగీరథ ద్వారా కరీంనగర్‌లో నిత్యం తాగునీటి సరఫరా చేసేందుకు ఎల్‌ఎండీలో 10 టీఎంసీల నీటి నిలువ అవసరముంటుంది. రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఐదు రోజులపాటు ఎల్‌ఎండీలోకి నీరు వచ్చి చేరనున్నది. కరీంనగర్‌ అర్భన్‌ మిషన్‌ భగీరథ కోసం రెండు రోజుల క్రితం డ్రైరన్‌, వెట్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. త్వరలోనే పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 


రూ. 110 కోట్లతో అర్బన్‌ మిషన్‌ భగీరథ పనులు

కరీంనగర్‌లో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు.  కరీంనగర్‌లో 24/7 మంచినీటిని అందించాలన్నది మంత్రి గంగుల కమలాకర్‌ చిరకాల స్వప్నం. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఆయన ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. దీంతో మున్సిపల్‌, ప్రజారోగ్యశాఖల ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరంలో జరుగుతున్న మంచినీటి సరఫరాను అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకంతో అనుసంధానం చేసి 110 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. నగర వాసులకు నిత్యం నీరందించాలంటే 37 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం.


ప్రస్తుతం రోజు విడిచి రోజు 48 ఎల్‌ఎండీ నీటిని లోయర్‌ మానేరు డ్యాంనుంచి తీసుకుని శుద్థి చేసి 37 ఎల్‌ఎండీ నీటిని సరఫరా చేస్తున్నారు. రోజు నీటి సరఫరాకు ప్రస్తుతం ఉన్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు సరిపోవు. మిషన్‌భగీరథ పనులను ఎల్‌  అండ్‌ టీ కంపెనీ ఈ పనులు చేపట్టి దాదాపుగా పూర్తి చేసింది. ప్రస్తుతం 48 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేసే పిల్టర్‌ బెడ్స్‌ ఉండగా కొత్తగా 36 ఎంఎల్‌డీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను, శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో మూడు వేల కిలో లీటర్ల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. రోజుకు 84 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసే ఫిల్టర్‌బెడ్స్‌ నుంచి బ్యాలెన్సింగ్‌ రిజరాయ్వర్‌కు పంపించి అక్కడి నుంచి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో 24/7 మంచినీటి సరఫరాను చేర్చడంతో రాష్ట్రంలోనే తొలిసారిగా 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేసిన రికార్డు సొంతం చేసుకుంటుంది  ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు ఎస్సారార్‌ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశించడంపై మేయర్‌ వై సునీల్‌రావు నగర ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2020-05-10T10:43:02+05:30 IST