పునరావాసమే చిక్కు!

ABN , First Publish Date - 2021-08-29T05:30:00+05:30 IST

రామాయపట్నం పోర్టు భూసేకరణ విషయంలో నిర్వాసితుల నుంచి సానుకూలత వ్యక్తమైనా పునరావాసంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములకు అందిస్తున్న పరిహారంపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు గ్రామాలను ఖాళీచేసేందుకు ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై మాత్రం అసంతృప్తితో ఉన్నారు. పోర్టు కోసం ప్రాథమికంగా కర్లపాలెంలో 282, ఆవులవారిపాలెంలో 95, మొండివారిపాలెంలో 105 గృహాలు ఖాళీచేయాల్సి ఉంది. వీటిలో పక్కా భవనాలు, రెండంతస్తుల భవనాలతోపాటు రేకులషెడ్లు, పూరిళ్లు కూడా ఉన్నాయి. ఈ గృహాలను సమగ్రంగా సర్వే చేసి గ్రామాలను ఖాళీచేస్తే దక్కే పరిహారాన్ని అధికారుల బృందం నిర్ధారించింది.

పునరావాసమే చిక్కు!
కర్లపాలెం గ్రామం (వ్యూ)


గృహాలకు పరిహారంపై అసంతృప్తి 

సర్వే సమగ్రంగా జరగలేదని నిర్వాసితుల ఆవేదన

వడివడిగా రామాయపట్నం పోర్టు భూసేకరణ  ప్రక్రియ 

రొయ్యల చెరువులకు ఎకరానికి రూ.15లక్షలు,

మెట్ట భూములకు రూ.10లక్షల పరిహారం  

802 ఎకరాల సేకరణకు జాబితా సిద్ధం 

పట్టా భూముల రైతులకు నగదు జమ

పునరావాస గ్రామాల కోసం స్థలంపై కసరత్తు 

కందుకూరు, ఆగస్టు 29 : 

రామాయపట్నం పోర్టు భూసేకరణ వడివడిగా సాగుతుండగా, పునరావాసం విషయంలో పీటముడి పడే అవకాశం కన్పిస్తోంది. ఇది అనేక చిక్కులు తేచ్చేలా ఉంది. భూములకు ఇచ్చే పరిహారంపై సానుకూలత వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామస్థులు ఇళ్లకు ఇచ్చే పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై మాత్రం ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. గ్రామాలను ఖాళీచేస్తే గృహాలకు పూర్తిస్థాయిలో పరిహారంతోపాటు, ప్రతి కుటుంబానికి రూ.6.5లక్షలు అదనంగా చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ప్రతిపాదిత పునరావాస గ్రామంలో ప్రతి కుటుంబానికి ఐదు సెంట్లు భూమి, పునాది కోసం రూ.3లక్షలు ఇవ్వటంతోపాటు ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇస్తుందని తొలుత చెప్పారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. ప్రస్తుతం నివసిస్తున్న గ్రామంలో ఎవరికి ఎంత స్థలం ఉంటే అంతే  అక్కడ ఇస్తామని చెబుతుండటమే గాక ప్రతికుటుంబానికి ఇస్తామన్న పరిహారం గురించి మాట్లాడటం లేదని గ్రామపెద్దలు అంటున్నారు.  


 రామాయపట్నం పోర్టు భూసేకరణ విషయంలో నిర్వాసితుల నుంచి సానుకూలత వ్యక్తమైనా పునరావాసంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు నిర్మాణం కోసం సేకరిస్తున్న భూములకు అందిస్తున్న పరిహారంపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు గ్రామాలను ఖాళీచేసేందుకు ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై మాత్రం అసంతృప్తితో ఉన్నారు. పోర్టు కోసం ప్రాథమికంగా  కర్లపాలెంలో 282, ఆవులవారిపాలెంలో 95, మొండివారిపాలెంలో 105 గృహాలు ఖాళీచేయాల్సి ఉంది. వీటిలో పక్కా భవనాలు, రెండంతస్తుల భవనాలతోపాటు రేకులషెడ్లు, పూరిళ్లు కూడా ఉన్నాయి. ఈ గృహాలను సమగ్రంగా సర్వే చేసి గ్రామాలను ఖాళీచేస్తే దక్కే పరిహారాన్ని అధికారుల బృందం నిర్ధారించింది. అయితే ఈ సర్వే సమగ్రంగా జరగలేదని, పూరిళ్లకు రూ.90వేలు, రేకుల ఇళ్లకు లక్షన్నర నుంచి లక్షా 80వేలు, పక్కాగృహాలకు రూ.6లక్షల నుంచి రూ.12లక్షల వరకూ పరిహారం చెల్లించాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు వేసిన అంచనాల ప్రకారం చూస్తే రెండింతలు చెల్లించినా ప్రస్తుతం ఆ నిర్మాణాలు చేయలేమని, మరోపక్క తమ స్థలాలకు విలువ వేయకుండానే అంచనాలు తయారుచేశారని విమర్శిస్తున్నారు. అలాగే మొదట ఇస్తామన్న రూ.6.5లక్షల గురించి ప్రస్తావించడం లేదని, ఎంత స్థలం పోతుంటే అంతే తిరిగి ఇస్తామని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఇళ్లకు పరిహారం చెల్లిస్తున్నాం కనుక పునరావాస గ్రామాల్లో మీరే గృహాలు నిర్మించుకోవాలని మెలికపెట్టారని అంటున్నారు. వారిచ్చే పరిహారంతో ప్రస్తుతం ఉన్న గృహనిర్మాణ  సామగ్రి ధరలను బట్టి చూస్తే సగానికి కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పునరావాసం కోసం స్థలాలపై తుది కసరత్తు

రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ఖాళీచేయాల్సి వస్తున్న కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామాల పునరావాస కాలనీలను ఎక్కడ నిర్మించాలన్న విషయంలో కూడా కసరత్తు మొదలైంది. ఆవులవారిపాలెం, మొండివారిపాలెంలకు రామాయపట్నం-తెట్టు రోడ్డులో ఉన్న ఓ రొయ్యల ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ, రాయల్‌ పోర్టు సిటీ పేరుతో ఓ ప్రైవేటు సంస్థ వేసిన లేఅవుట్‌కి సమీపంలో 39 ఎకరాల భూమిని సేకరించాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అందుకు ఆ గ్రామాల వారు కూడా అంగీకరించారు. కర్లపాలెం గ్రామస్థులు మాత్రం జాతీయరహదారి పక్కన తెట్టు పెట్రోలు బంకుల సమీపంలో ప్రైవేటు భూమిని కొని ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారు ప్రతిపాదిస్తున్న భూమిని కొనాలంటే అక్కడ ఎకరం కోట్లలో పలుకుతున్నందున అధికారులు ప్రత్యామ్నాయం సూచించాలని కోరుతున్నట్లు సమాచారం. ఆ భూమిని సేకరించటం సాధ్యం కాని పక్షంలో రామాయపట్నం-తెట్టు రోడ్డులోనే మరోచోట భూసేకరణ  చేసే అవకాశం ఉంది.

వడివడిగా భూసేకరణ  

రామాయపట్నం పోర్టు  భూసేకరణ ప్రక్రియ వడివడిగా సాగుతోంది. పోర్టు నిర్మాణం కోసం ప్రాథమికంగా 802 ఎకరాల భూసేకరణ  ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ప్రతిపాదిత రామాయపట్నం పోర్టు నిర్మించతలపెట్టిన గుడ్లూరు మండలంలోని కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామాల పరిధిలో భూసేకరణకు రొయ్యల చెరువులు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.15లక్షలు, మెట్ట పంటలు సాగు చేస్తున్న భూములకు ఎకరానికి రూ.10లక్షలు పరిహారంగా తీసుకుని భూములు అప్పగించేందుకు ఆ మూడు గ్రామాల ప్రజలంతా ఆమోదం తెలపటంతో రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. కొంతమంది రైతుల ఖాతాలకు నగదు కూడా జమచేశారు. ఈ మూడు గ్రామాల పరిధిలో ప్రభుత్వభూములే మూడింట రెండు వంతులు ఉండగా మిగిలిన ఒక వంతులో 200 ఎకరాల వరకు అసైన్డ్‌భూములు కాగా పట్టా భూములు కేవలం 73ఎకరాలు మాత్రమే  ఉన్నాయి. అయితే పట్టాభూములు, అసైన్డ్‌ భూములకే గాక ప్రభుత్వ భూములకు కూడా ఎవరైతే అనాదిగా సాగు చేసుకుంటున్నారో వారిని గుర్తించి పరిహారం చెల్లిస్తామని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రతిపాదించటంతో రైతులు ఆనందంగా ఒప్పుకున్నారు.  అయితే ప్రభుత్వ భూమిలో అనుభవదారుల జాబితాల రూపకల్పనలో అక్కడక్కడా అవకతవకలు జరిగాయన్న విమర్శలున్నాయి.  


మొదలైన నగదు జమలు

మూడు రకాల భూముల్లో పట్టాభూములు, అసైన్డ్‌భూములకు సంబంధించి పలువురు రైతులకు ఇప్పటికే భూపరిహారం వారి ఖాతాలకు జమకాగా శివాయి భూమి (ప్రభుత్వ భూమి)కి సంబంధించి పరిహారం ఇంకా ఎవరికీ జమకాలేదని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అయితే పునరావాస ప్యాకేజీ అమలయ్యాక మాత్రమే పోర్టు నిర్మాణ పనులను అనుమతిస్తామని ఆ గ్రామాల పెద్దలు తేల్చిచెబుతున్నారు. అదేసమయంలో శివాయి భూములకు పరిహారం చెల్లింపుపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూడు గ్రామాల్లో 482కుటుంబాలు ఉండగా శివాయి భూమి అనుభవిస్తున్న వారిలో ఒక్కో కుటుంబం 30సెంట్లు నుంచి గరిష్ఠంగా 3 ఎకరాల వరకు మాత్రమే అనుభవిస్తున్నట్లు తెలిసింది. 95శాతం వరకు ఇదే పరిస్థితి కాగా శివాయి భూమిని ఆక్రమించటం, చేతుల మార్పిడి పద్ధతిలో తమ ఆధీనంలో ఉంచుకున్న మిగిలిన ఐదుశాతం మంది విషయంలో మాత్రం కాస్త భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి రెండు సంస్థలు, ఇద్దరు ముగ్గురు స్థానిక రైతులు పదులసంఖ్యలో శివాయి భూములను హస్తగతం చేసుకున్నారు. వారికి ఇప్పుడు కోట్లలో పరిహారం దక్కే అవకాశం ఉంది. భూమిలేని పేద అయినా ప్రభుత్వ భూమిని ఐదు ఎకరాలకు మించి పొందే హక్కు లేనందున ఆ నిబంధన వర్తిస్తే వీరికి దక్కే పరిహారం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సాంకేతిక ఆటంకాల వల్లనే శివాయి భూములకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. 


పునరావాసం పూర్తయితేనే పనులు మొదలుకానిస్తాం: 

రొయ్యల చెరువులు, పంట పొలాలకు ఇచ్చే పరిహారాన్ని మేమంతా ఆమోదించాం. కొందరు రైతులకు నగదు కూడా పడింది. అయితే పోర్టు నిర్మాణ  బాధ్యతలు తీసుకున్న అరబిందో ప్రతినిధులు కావలిలో మకాం వేసి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఫైనలై నగదు జమ కావటంతో పాటు, పునరావాస గ్రామాల నిర్మాణం కూడా పూర్తయితేనే పోర్టు నిర్మాణ పనులను అనుమతిస్తామని వారికి స్పష్టం చేసి వెనక్కి పంపించాం. కనీసం పునరావాస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమె మాకు నమ్మకం కుదిరితేనే పోర్టు పనులు ప్రారంభించేందుకు అనుమతిస్తాం. లేకుంటే అడ్డగిస్తాం.

 - చాపల రమణయ్య, గ్రామ పెద్ద, కర్లపాలెం


ఆర్‌ఆర్‌ ప్యాకేజీపై సంతృప్తి లేదు


 భూములకు పరిహారం విషయంలో మేము సంతృప్తిగానే ఉన్నాం. కానీ గృహాలకు చెల్లిస్తామని ప్రతిపాదిస్తున్న పరిహారంపై ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు. ఇక్కడ ఉన్న భవనాలు, రేకులషెడ్లు, పూరిళ్లు యథావిధిగా ఇప్పుడు నిర్మించాలంటే అయ్యే ఖర్చులో సగం మాత్రమే వారు పరిహారంగా ఇస్తామంటున్నారు. గృహాల సర్వే కూడా సమగ్రంగా జరగలేదు. అలాగే ఆర్‌ఆర్‌ ప్యాకేజీ విషయంలో గత కలెక్టరు పోలా భాస్కర్‌ అనేక హామీలు ఇచ్చారు. ప్రస్తుత అధికారులు వాటి గురించి మాట్లాడటం లేదు. ఆ హామీలు అమలయ్యేలా చూస్తేనే మేము గ్రామాలను ఖాళీ చేస్తాం..

- మీరయ్య, గ్రామ పెద్ద, కర్లపాలెం 


Updated Date - 2021-08-29T05:30:00+05:30 IST