ప్రజా పంపిణీ ద్వారా ‘బలవర్ధక’ బియ్యం!

ABN , First Publish Date - 2021-03-08T08:17:37+05:30 IST

పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్‌ అభియాన్‌’ పథకం తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు కాబోతోంది.

ప్రజా పంపిణీ ద్వారా ‘బలవర్ధక’ బియ్యం!

  • భూపాలపల్లిలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ 
  • పేదలకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, 
  • విటమిన్‌- బీ12తో కూడిన బియ్యం
  • అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో.. 
  • ఏప్రిల్‌ 1 నుంచి అమలుకు ప్రభుత్వ నిర్ణయం
  • రాష్ట్రంలో లేని ఫోర్టిఫైడ్‌ రైస్‌ తయారీ యూనిట్లు
  • టెండర్ల ద్వారా ప్రైవేటు ఏజెన్సీలకు

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు.. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పోషణ్‌ అభియాన్‌’ పథకం తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు కాబోతోంది. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌- బీ12తో కూడిన బలవర్థకమైన (ఫోర్టిఫైడ్‌ రైస్‌) బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించనున్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి దీనిని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఈ జిల్లాలో 1.25 లక్షల ఆహార భద్రతకార్డులు కలిగి ఉన్న కుటుంబాలతోపాటు రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్లు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థులకు ‘ఫోర్టిఫైడ్‌ రైస్‌’ పంపిణీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16లో దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 38 శాతం మందిలో ఎదుగుదల లేదని, 36 శాతం పిల్లలు ఎత్తుకు తగ్గ బరువులేరని వెల్లడైంది. వీరికి పోషకాలతో కూడిన బలవర్థకమైన ఆహారం పంపిణీ చేస్తేనే భవిష్యత్తు తరం ఆరోగ్యవంతంగా తయారవుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు2019 జూన్‌లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు పంపంగా.. 15 రాష్ట్రాలు స్పందించాయి. ‘మీ రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఒక జిల్లా పేరు ఇవ్వండి!’ అని మళ్లీ అడిగితే... 9 రాష్ట్రాలే ముందుకొచ్చాయి. ఇందులో తెలంగాణ లేకపోవటం గమనార్హం. 


ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా సహా 9 రాష్ట్రాలు ఒక్కో జిల్లాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఆగస్టు 25న ‘మన్‌కీ బాత్‌’ రేడియో ప్రసంగంలో ‘ఫోర్టిఫైడ్‌ రైస్‌’(బలవర్థక బియ్యం) పంపిణీ ఆవశ్యకతను వివరించారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌- బీ12 లోపంతో బాధపడుతున్న ఐదేళ్లలోపు పిల్లలకు, రక్త హీనతతో బాధపడుతున్న మహిళలకు, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రధాని తెలిపారు. ఇందులోభాగంగా తెలంగాణకు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్రొక్యూర్‌మెంట్‌ చేసే టార్గెట్‌ విధించింది. కేంద్రం కోరిన ఫోర్టిఫైడ్‌ రైస్‌.. బాయిల్డ్‌(ఉప్పుడు) బియ్యం కావటంతో...  వీటిని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అవసరాలకు పంపించనున్నారు. 


సీఎంఆర్‌ నిలిపివేయడంతో..

‘పోషణ్‌ అభియాన్‌’ పథకంలో చేరాలని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల ‘సీఎంఆర్‌’(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)ను మూడు రోజులపాటు  తీసుకోకుండా నిలిపివేసింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా రైస్‌ ఫోర్టిఫికేషన్‌లో చేరటానికి అంగీకారం తెలిపింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను ఎంపికచేసింది. ఈ జిల్లాలో 1.25 లక్షల కుటుంబాలకు ఉన్న ఆహారభద్రత కార్డులకుగాను నెలకు 2 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు, మధ్యాహ్న భోజన పథకంలో లబ్ధిదారులుగా ఉన్న సుమారు 25 లక్షల మంది విద్యార్థులకు కూడా ఫోర్టిఫైడ్‌ రైస్‌ను పంపిణీ చేయాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. వీటికితోడు స్త్రీ శిశు సంక్షేమశాఖ పరిధిలో నడుస్తున్న అంగన్‌వాడీ సెంటర్ల పరిధిలో నమోదై ఉన్న చిన్న పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు కూడా ఫోర్టిఫైడ్‌ రైస్‌నే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పంపిణీ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండటం గమనార్హం. బియ్యం పిండిలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, బీ- 12 విటమిన్లను తగిన మోతాదులో జోడించి... బియ్యం మాదిరిగా తయారుచేస్తారు. 99 కిలోల సాధారణ బియ్యానికి... ఒక కిలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ కలుస్తాయి. ఇందుకుగాను కిలోకు 71 పైసల అదనపు ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. 


యూనిట్లు లేవు.. టెండర్లే శరణ్యం

ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న ఏ రైస్‌మిల్లుల్లోనూ ప్రస్తుతం ‘ఫోర్టిఫైడ్‌’ సిస్టమ్‌ లేదు. దీనికి ప్రత్యేకంగా కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్‌ మెషినరీకి రూ.3 కోట్ల పెట్టుబడి అవుతుందనే అంచనాలున్నాయి. ఒక్కో యూనిట్‌ గంటకు 4 క్వింటాళ్ల ఫోర్టిఫైడ్‌ రైస్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఫోర్టిఫైడ్‌ రైస్‌కు అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? అనే స్పష్టమైన హామీ రైస్‌మిల్లర్లకు లభించటంలేదు. అయితే ప్రైవేటు ఏజెన్సీలకు ప్రొక్యూర్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో తయారుకాలేదని తెలిసింది. ఫోర్టిఫైడ్‌కు ‘తెలంగాణ ఫుడ్స్‌’ మెషినరీ కూడా అనుగుణంగా ఉన్నట్లు సమాచారం. ఆ మెషినరీని కాస్త అప్‌గ్రేడ్‌ చేసి వినియోగించుకుంటే... సమస్య తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


అదనపు ఖర్చు భారం ఎవరికి?

ఒక కిలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఉత్పత్తి చేయటానికి 71 పైసలు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈభారం కేంద్రం భరిస్తుందా? రాష్ట్రం భరిస్తుందా? వినియోగదారుడు భరిస్తాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం కిలోకు రూ.3 చొప్పున రాష్ట్రాలకు బియ్యం పంపిణీ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అందులో రూ.2 సబ్సిడీని భరించి... 1 రూపాయికి కిలో బియ్యం పంపిణీ చేస్తోంది. ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఉత్పత్తి వ్యయాన్ని ఎవరు భరించాలనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - 2021-03-08T08:17:37+05:30 IST