Abn logo
Sep 19 2021 @ 00:27AM

డెంగ్యూ కట్టడికి పటిష్ట ప్రణాళిక

హాట్‌స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి

జిల్లాలో 30కుపైగా వున్నట్టు గుర్తింపు

వారంలో రెండు రోజులు ‘డ్రై డే’

గ్రామాల్లో శానిటేషన్‌, దోమ తెరలు పంపిణీ


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం) 


జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది వీటి బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా వర్షాకాలం పూర్తయిన తరువాత డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతుంటాయి. అందుకు భిన్నంగా ఈ ఏడాది వర్షాకాలం కొన సాగుతుండగానే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా వుంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పటిష్టమైన ప్రణాళికను అమలు చేయడం ద్వారానే డెంగ్యూ జ్వరాల వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డెంగ్యూ కేసులు నమోదవుతున్న 30కుపైగా ప్రాంతాలను హాట్స్‌ స్పాట్‌లుగా గుర్తించి.. అక్కడ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. 


కేసులు పెరగకుండా.. 

రెండు వారాలు వ్యవధిలో ఒక ప్రాంతంలో రెండు కంటే ఎక్కువ కేసులు నమోదైతే ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా నిర్ధారిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఈ తరహా గుర్తించిన హాట్‌ స్పాట్‌లు 30 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో మరిన్ని కేసులు నమోదుకాకుండా చర్యలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ/ గ్రామ సచివాలయం సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటైజేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు చేపట్టారు. హాట్‌ స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాల్లో శుక్రవారంతోపాటు మంగళవారం కూడా డ్రై డే పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ చేయడంతోపాటు వాటిని ప్రతిరోజూ వినియోగించేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ బాధ్యతలను స్థానిక వైద్య సిబ్బందికి అప్పగించారు. డెంగ్యూ నిర్ధారణ కిట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచారు.