Abn logo
Sep 26 2020 @ 03:44AM

కళాతపస్వితో చుట్టరికం

Kaakateeya

  • చంద్రమోహన్‌తోనూ

ఎస్పీబీ జీవితాన్ని మలుపు తిప్పిన వారిలో కళాతపస్వి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్‌ ముఖ్యులు. విశ్వనాథ్‌కు బాలూకు బంధుత్వం కూడా ఉంది. సోదరుడి వరుస అవుతారు. ఆయనను బాలూ విశ్వం అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తారు. అలాగే సుప్రసిద్ధ నటుడు చంద్రమోహన్‌ కూడా బాలూకు సోదరుడి వరస. శంకరాభరణం సినిమా తీస్తున్నపుడు బాలమురళీకృష్ణతో పాడిద్దామా, ఏసుదాసును సంప్రదిద్దామా లేక బాలూతోనా అన్న ప్రశ్న వచ్చింది. బాలూ అప్పటికే కమర్షియల్‌ చిత్రాల జోరులో ఉన్నారు. ఆ సమయంలో కేవీ మహదేవన్‌ బాలూకే ఓటేశారు. అప్పటికే ‘ఓ సీత కథ’, ‘సిరిసిరి మువ్వ ’ మొదలైన సినిమాల్లో బాలూ గాత్ర సౌరభాన్ని ఆస్వాదించిన మామ (మహదేవన్‌) బాలూనే ఎంపిక చేశారు. అయితే శంకరాభరణం పాడడానికి బాలూ ససేమిరా అన్నారు. ‘నాకు శాస్త్రీయ సంగీతం రాదు. నా వల్ల విశ్వం అన్నయ్య తీసే సంగీత ప్రధాన చిత్రం దెబ్బతినకూడదు.. అంచేత పాడను’ అన్నారు. అపుడు విశ్వనాథ్‌ బాలూ తండ్రి సాంబమూర్తి దగ్గర ఈ విషయం ప్రస్తావించినపుడు- ‘చెంప మీద ఒక్కటి కొట్టి పాడించు.. ఎందుకు పాడలేడు, పాడతాడు’ అన్నారు.


శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు తెలియని బాలూ ఎలా పాడతాడని చాలా మంది సినీ ప్రముఖులు కూడా ముందే పెదవి విరిచారు. కానీ మహదేవన్‌ సహాయకుడైన పుహళేంది -బాలు చేత నిరంతరం ప్రాక్టీసు చేయించి- శాస్త్రీయ సంగీత విరుపులు నేర్పి-  పాడించారు. ఆ సినిమా చూసినవారంతా నిజంగా బాలూ అతి తక్కువ కాలంలోనే క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నాడే అన్నారు. మొదట్లో పెదవి విరిచిన వారే మెచ్చుకున్నారు. ఇక ఆనాటి నుంచి విశ్వనాథ్‌ తీసిన అన్ని కళాత్మక చిత్రాల్లోనూ బాలూయే ప్రధాన గాయకుడు. ఒకటి రెండు సినిమాల్లో మాత్రం ఏసుదాసు చేత పాడించారు. బాలూకు అనేక అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టిన విశ్వనాథ్‌ గారి సినిమాలెన్నో..!

Advertisement
Advertisement
Advertisement