ఛీఛీ.. వీళ్లసలు మనుషులేనా?.. పుట్టిన వెంటనే ఆ పాప నోటికి ప్లాస్టర్ వేసి.. ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి..

ABN , First Publish Date - 2021-08-10T01:54:33+05:30 IST

సరిగ్గా ఒక్క రోజు కూడా గడవని పసికందుపై తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు ఆ దుర్మార్గులు. పాప ఏడవకుండా నోటికి ప్లాస్టర్ వేశారు.

ఛీఛీ.. వీళ్లసలు మనుషులేనా?.. పుట్టిన వెంటనే ఆ పాప నోటికి ప్లాస్టర్ వేసి.. ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి..

ఇంటర్నెట్ డెస్క్: సరిగ్గా ఒక్క రోజు కూడా గడవని పసికందుపై తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు ఆ దుర్మార్గులు. పాప ఏడవకుండా నోటికి ప్లాస్టర్ వేశారు. ఆపై ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి దగ్గరలో ఉన్న ఒక పెద్ద నీటి గుంటలో పడేశారు. ఇలా చేస్తే ఆ పాప కచ్చితంగా చనిపోతుందని, ఎవరికీ కనీసం తెలియదని ఆ రాక్షసులు భావించి ఉంటారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. ఆ దుర్మార్గుల పథకాలన్నీ నీటిపాలయ్యాయి. పాపను నీటి గుంటలో పడేయడంతో ఆ తడికి పాప నోటికి వేసిన ప్లాస్టర్ ఊడిపోయింది. దీంతో ఆ శిశువు గుక్కపట్టి ఏడ్చేసింది. ఈ ఘాతుకం తెల్లవారుజామున 5గంటలకు జరిగింది.


అదే సమయంలో పశువులకు మేత వేయడానికి వెళ్తున్న ఆశాదేవి అనే మహిళ ఆ పాప ఏడుపు విని గాభరాగా గుంట దగ్గరకు వచ్చింది. నీటిలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగును తీసి చూసింది. దానిలో ఉన్న పసికందును చూసి ఆమె షాకైంది. ఒక్కరోజు కూడా లేని శిశువును ఇలా పారేసిన దుర్మార్గులెవరా? అని ఆశ్చర్యపోయింది.


ఈ దుర్మార్గమైన ఘటన బిహార్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌లో జరిగింది. గోపాల్‌పూర్ అనే గ్రామంలో జరిగిన ఈ దురాగతం గురించి ఊరంతా తెలిసిపోయింది. దీంతో ఊళ్లోని వాళ్లంతా ఆ పసికందును చూసేందుకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. తాను రావడం కాసేపు ఆలస్యమైనా పసికందు నీటిలో మునిగి చనిపోయి ఉండేదని, ఇంత క్రూరత్వానికి పాల్పడిన దుర్మార్గులెవరో? అంటూ ఆశాదేవి ఆగ్రహం వ్యక్తచేసింది. పాపను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉంది. పాపను నీటిలో పడేసి ఎక్కువ సమయం అయ్యుండదని, లేదంటే ఆశాదేవి అక్కడకు చేరుకునే సరికే పాప మృతి చెంది ఉండేదని వైద్యులు చెప్తున్నారు.


ఈ ఘటన గురించి తెలిసిన బాల్ కల్యాణ్ అధికారి నౌషద్ రజా.. ఇలాంటి దుర్మార్గపు పనులు ఎవరూ చేయొద్దని కోరారు. ఇలా పసికందుల్ని ముఖ్యంగా ఆడపిల్లలను చాలా మంది పారేస్తున్నారు. ఇలా చేయకుండా స్థానికంగా తాము ఏర్పాటు చేసిన విశిష్ట దత్తక్ గ్రాహణ్ సంస్థాన్‌కు అప్పగించాలని కోరారు. అలా అప్పగించే సమయంలో కనీసం అందించే వారి పేరు కూడా తాము అడగబోమని, ఇలా చిన్నారులను చెత్తకుప్పల్లో పారేసేకన్నా తమకు అందిస్తే వారిని కాపాడుకుంటామని చెప్పారు.

Updated Date - 2021-08-10T01:54:33+05:30 IST