నరసరావుపేటలో సడలింపులు

ABN , First Publish Date - 2020-06-02T09:11:54+05:30 IST

వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న నరసరావుపేటలో మంగళవారం నుంచి సడలింపులు అమల్లోకి రానున్నాయి.

నరసరావుపేటలో సడలింపులు

70 రోజుల తర్వాత ప్రజలకు ఊరట


నరసరావుపేట: వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న నరసరావుపేటలో మంగళవారం నుంచి సడలింపులు అమల్లోకి రానున్నాయి. 70 రోజులుగా నిర్బంధాన్ని ఎదుర్కొన్న ప్రజలు సడలింపులతో ఊరట చెందుతున్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లను కుదించి ఆ మేరకు బారీకేడ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పట్టణ శివార్లలో  ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను పోలీసు శాఖ తొలగిస్తున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో దుకాణాలు, ఆస్పత్రులు, బ్యాంకులు తెరిచేందుకు అధికారులు అనుమతించారు. ఈ మేరకు ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు కంటైన్‌మెంట్‌ జోన్‌లను డీనోటిఫై చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆట స్థలాలకు, సెలూన్‌ షాపులకు అనుమతించారు.


ఈ నెల 3న ప్రకాష్‌ నగర్‌ 14వ వార్డు ప్రాంతాన్ని కూడా గ్రీన్‌జోన్‌గా ప్రకటించనున్నారు. కాగా చిలకలూరిపేటలోని కళామందిర్‌, ఈపూరు మండలంలోని కొండ్రముట్లలో కూడా కంటైన్‌మెంట్‌ జోన్‌లను తొలగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్‌జీవో కాలనీ, పెదచెరువు, ఇస్లాంపేట, నిమ్మతోట, రామిరెడ్డిపేట, అరండల్‌పేట, పల్నాడు రోడ్డ, మండలంలోని అల్లూరివారిపాలెంలను కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి తొలగించారు. వరవకట్ట, ప్రకాష్‌నగర్‌, 60 అడుగులరోడ్డు లింగంగుంట్ల, ఏనుగుల బజారు, పాతూరు, శ్రీరాంపురం ప్రాంతాలు కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ఉన్నాయి. 


వ్యక్తి గత జాగ్రత్తలతో మేలు : ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి 

కంటైన్‌మెంట్‌ జోన్ల డీనోటిఫై చేసే సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మునిసిపల్‌ బంగ్లాలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కరోనా కేసులు తగ్గుమొఖం పట్టాయని చెప్పారు. అయినా ప్రజలు వ్యక్తి గత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కంటైన్‌మెంట్‌ జోన్‌ ప్రాంతాల్లో పేదలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు, కమిషనర్‌ డాక్టర్‌ కే వెంకటేశ్వరరావు, డీఎస్పీ వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:11:54+05:30 IST