సడలింపు, జాగ్రత్త

ABN , First Publish Date - 2020-10-08T09:22:54+05:30 IST

కట్టడుల్లో ఎంతో కాలం జీవించలేము. ఒక ప్రయోజనం కోసం పాటించే నిర్బంధాలు మరో రకంగా ప్రమాదకరం కావచ్చు...

సడలింపు, జాగ్రత్త

కట్టడుల్లో ఎంతో కాలం జీవించలేము. ఒక ప్రయోజనం కోసం పాటించే నిర్బంధాలు మరో రకంగా ప్రమాదకరం కావచ్చు. వ్యాధి సోకకుండా కాపాడుకోవడం ఎంత అవసరమో, ఆర్థిక కార్యక్రమాలను గాడిన పడేయడం కూడా అంతే అవసరం. త్వరితగతిన తాళాలు విప్పాలన్న ప్రభుత్వ సంకల్పం మంచిదే కానీ, వాస్తవ పరిస్థితికి, కట్టడుల సడలింపులకు నడుమ ఒక సమన్వయం కూడా అవసరం. అక్టోబర్‌ 15 నుంచి అనుమతిస్తున్న సడలింపుల గురించిన విధివిధానాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం 100 మందికి మించిన గుంపులను, ఊరేగింపులను, ఉత్సవాలను కూడా తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవచ్చునని చెప్పింది. రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సడలింపు ఇచ్చినట్టు సులభంగానే అర్థమవుతుంది. ఆన్‌లైన్‌ సందేశాలు, వర్చువల్‌ సమావేశాలతో నిర్వహించగలిగేవి కావు బిహార్‌ ఎన్నికలు. నాలుగు గోడల మధ్య జరిగే సామూహిక కార్యక్రమాలు మాత్రం 200 మందికి మించకూడదని చెప్పారు తప్ప, వీధుల్లో జరిగే ఊరేగింపులకు సంఖ్యా పరిమితి ఏమీ ఉన్నట్టు లేదు. 


అత్యంత ప్రమాదకరమైన విపత్తు ఎదురైనప్పుడు, మునుపెన్నడూ అనుసరించని కట్టడులను పాటించవలసి వచ్చింది. వైరస్‌ ముప్పు ఇంకా మనదేశంలో ఆరంభదశలో ఉన్నప్పుడే, కఠినమైన ఆంక్షలను విధింపజేసుకున్నాము. అప్పుడు అట్లా చేయడం వల్లనే, మన వైద్య ఆరోగ్య వ్యవస్థను సంసిద్ధం చేసుకునే వెసులుబాటు చిక్కింది అనేవారున్నారు. లేదు, ఆ సమయంలో అటువంటి ఆకస్మికమైన, కఠినమైన లాక్‌డౌన్‌ విధించడం తప్పుడు నిర్ణయమనీ, వలసకూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులు, వృత్తిపనివారు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని విమర్శించేవారూ ఉన్నారు. ఉన్నట్టుండి సమస్త జీవన వ్యవస్థలూ స్తంభించిపోతే, అందువల్ల బాధితులయిన బలహీనులకు ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఏమాత్రం అండదండలు లభించాయి అన్నది పెద్ద ప్రశ్న. ఎంత పెద్ద కష్టం అయినప్పటికీ, జాతి దాన్ని తట్టుకుని నిలబడింది. కొద్దికొద్దిగా తేరుకుంటున్నది. కొందరికి ఈ కాలంలో పెద్ద కష్టం ఏమీ లేకుండా సుఖంగానే జరిగిపోయి ఉండవచ్చు. అనేకమంది తీవ్రంగా దెబ్బతిని ఉండవచ్చు. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే పౌర జీవన సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి, అత్యధిక ఉత్పాదక, వాణిజ్య, సేవా ప్రక్రియలు మొదలు కావలసిందే. కాకపోతే, వ్యాధి మళ్లీ విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మళ్లీ విజృంభణ ప్రమాదం గురించి మాట్లాడుతున్నామంటే, మొదటి విడత విజృంభణ ముగిసిందని కాదు. అంకెలలో కనిపిస్తున్న సానుకూల ధోరణిని అధికారులు శుభసూచనగా చెబుతున్నారు. కానీ, ప్రమాదం పూర్తిగా సమసిపోకుండా ఉదాసీనత చూపడం శ్రేయస్కరం కాదు. తగ్గినట్టే కనిపిస్తూ మళ్లీ పెరిగిన ఉదాహరణలు అమెరికాలోనూ ఉన్నాయి, మనదేశంలోనూ ఉన్నాయి. న్యూయార్క్‌ మళ్లీ పాఠశాలలను మూసేసింది. ఎంతో సమర్థతతో తొలిరోజుల్లో కట్టడి చేసిన కేరళ ఇప్పుడు విజృంభణను ఎదుర్కొనలేక సతమతమవుతున్నది.


బిహార్‌ ఎన్నికలు మాత్రమే కాక, రానున్న నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతకమ్మ వంటి పండగలు కూడా సడలింపుల వెనుక ఉండవచ్చు. ఉత్సాహాలను చంపుకుని, పండగలన్నిటినీ నామమాత్రంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కాస్త సందడి పెరుగుతుంది. కానీ, పుణ్యక్షేత్రాలు, మతపరమైన కూడికలు వ్యాప్తి కారకాలని మరచిపోకూడదు. ఉత్సవాలలో, ఊరేగింపులలో ఆరడుగుల దూరాలను పాటించడం సాధ్యం కాదు, పాటించరు కూడా. మాస్కును నిరాకరించడంలో మన వారు డొనాల్డ్‌ ట్రంపును ఆదర్శంగా తీసుకుంటున్నారు. సడలింపులను ఉదారంగా ఇస్తున్నప్పుడు, కరోనా వ్యాప్తి నిరోధక నియమాలను కఠినంగా పాటించేట్టు అయినా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. 


సినిమా పరిశ్రమపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది, తమ జీవనోపాధి గురించి ఆందోళన చెందుతున్నారు నిజమే కానీ, తీవ్ర వ్యాప్తి కారకాలుగా భావించే వాటిలో ముఖ్యమైనవి సినిమా హాళ్లు. తలుపులు మూసి, సహజమైన గాలి ఆడనిచోట వందలాది మందిని అనుమతించడంలో ప్రమాదావకాశముంది. ఎయిర్‌ కండిషనింగ్‌ను 23 డిగ్రీలకు పైనే ఉంచాలని నిర్దేశిస్తే, దాన్ని పాటించేదెవ్వరు? పాటిస్తే ప్రేక్షకులకు కలిగే ఉక్కపోత సంగతేమిటి? సినిమారంగంలోని దినవేతన కార్మికులను, సినిమాహాళ్ల యజమానులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. లాక్‌డౌన్‌ వల్ల మూతపడితే, వాణిజ్య రేట్లతో కరెంటు బిల్లులు, ఇతర చార్జిలు కట్టవలసి రావడమేమిటి? 


పాఠశాలల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. చిన్నారులు కూడా కొవిడ్‌ కారణంగా ప్రమాదాలకు లోనవుతారు. బాలల్లో అత్యధికులకు వ్యాధి నిరోధకశక్తి ఉంటుందనుకున్నా, వారి ద్వారా కుటుంబంలోని పెద్దవారికి అది సోకవచ్చు. పాఠశాలలో పిల్లల మధ్య సాన్నిహిత్యాన్ని నియంత్రించలేము. ఆన్‌లైన్‌ విద్యను అందరికీ సక్రమంగా అందించడం ఎట్లా అనే విషయమై ఆలోచన చేసి, సాధ్యమైంతవరకు పిల్లలను స్కూళ్లకు దూరంగా ఉంచడమే ప్రస్తుత పరిస్థితిలో శ్రేయస్కరం.


ప్రభుత్వ సడలింపులు, మార్గదర్శకాలు ఎట్లా ఉన్నా, వాటికి ప్రజల సమ్మతి, సంసిద్ధత ఎంతో ముఖ్యం. చాలా వ్యాపారరంగాలను తిరిగి ప్రారంభించారు. కానీ, మునుపటి వలె అవి సాగడం లేదు. గ్రామాలకు వెళ్లిన కోట్లాది మంది వలసశ్రామికులు తిరిగి పట్టణాలకు రావడం లేదు. వినియోగదారుల కొనుగోళ్ల ప్రాధాన్యాల్లో, సరళుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వీటి కారణంగా, అనేకమంది జీవనోపాధులు ప్రమాదంలో పడ్డాయి. థియేటర్లు తెరచినా ప్రేక్షకులు ఎంతవరకు వెడతారో సందేహమే. పాఠశాలలు తెరచినా తల్లిదండ్రుల స్పందన ప్రశ్నార్థకమే.

Updated Date - 2020-10-08T09:22:54+05:30 IST