Abn logo
Sep 21 2021 @ 23:54PM

మద్యం పాలకీకి సడలింపు

బార్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ ఫీజులో నెల డిస్కౌంట్‌  

వైన్స్‌ షాపుల గడువు పొడిగింపు

ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు టెండర్లలో రిజర్వేషన్లు! 

జిల్లాలో 31 వైన్స్‌లు, 12బార్లు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): 2019- 21 మద్యం పాలసీకి రాష్ట్ర సర్కారు సడలింపును ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా దాదాపుగా నెల రోజులకు పైగా మద్యం షాపులతో పాటు బార్లను మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థికంగా నష్టపోయామంటూ మద్యం వ్యాపారులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కొంత వెసులుబాటును కల్పించింది. జిల్లాలో 31 వైన్స్‌ షాపులతో పాటు 12బార్లు ఉన్నాయి. ఈ సారి కొత్త మద్యం పాలసీలో భాగంగా మరిన్ని వైన్‌షాపులు జిల్లాకు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మద్యం షాపులు మంజూరుకానున్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి మద్యం షాపుల పాలసి గడువును రెండేళ్ల పాటు పొడిగించారు. 2019-21 మద్యం పాలసీ వచ్చే నెల అక్టోబరు 31తో ముగియనుంది. జిల్లాలో మద్యం షాపుల ద్వారా రూ.16కోట్ల 70లక్షల ఆదాయం వచ్చింది. అలాగే ఏటా రెన్యూవల్‌ చేసే బార్‌లైసెన్సుల ద్వారా రూ.5కోట్ల 4లక్షలు ఆదాయం సమకూరుతుంది. అయితే నెల రోజుల పాటు గడువు పొడిగించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌ శాఖ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో లిక్కర్‌ వ్యాపారులకు మరింత మేలు జరగనుంది.

ఒక్కో బార్‌కు 3.50లక్షల ఆదా..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ఒక్కోబార్‌కు రూ.3.50లక్షలు ఆదాకానుంది. ఏడాదికి జిల్లాలో ఒక్కో బార్‌కు లైసెన్స్‌ ఫీజుగా రూ.42లక్షలను వసూలు చేస్తున్నారు. అయితే 2021-22 సంవత్సరానికి గాను 12 నెలల్లో ఒక నెలను మినహాయించి 11 నెలలకు మాత్రమే బార్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ ఫీజును వసూలు చేయనున్నారు. దీంతో రూ.3.50లక్షల చొప్పున జిల్లాలోని 12బార్లకు రూ.42లక్షలు ఆదా కానుంది. కరోనా కారణంగా అంతంత మాత్రంగానే నడుస్తున్న బార్‌ లిక్కర్‌ వ్యాపారంతో అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న వ్యాపారులకు ప్రభుత్వం ఇచ్చే సడలింపులు కొంత ఆర్థిక తోడ్పాటును ఇవ్వనుందన్న ధీమా వ్యక్తమవుతోంది.

నవంబరు 31 వరకు గడువు..

2019-21 మద్యం పాలసీ గడువు వచ్చే నెల అక్టో బరు 31తో ముగిసిపోనుంది. కానీ తాజాగా ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంతో నవంబరు 31న మద్యం షాపుల గడువు ముగియనుంది. ఆ తర్వాత 2021- 23 కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. జిల్లాలో 31మద్యం షాపులు ఉండగా వీటి ద్వారా రూ.16కోట్ల 70లక్షలు ఆదాయం వస్తుంది. నెల రోజుల గడువును పెంచడంతో సుమారుగా జిల్లాలో రూ.70లక్షల ఆదా యం ప్రభుత్వం నష్ట పోనుంది. దాదాపుగా జిల్లాలోని అన్ని వైన్‌షాపుల సేల్‌ టార్గెట్‌ పూర్తయింది. దీంతో మరో నెల రోజుల గడువు పొడగించిన ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉండదంటున్నారు. ఎందు కంటే మద్యం సరఫరాలో కోత విధిస్తారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతంత మాత్రంగా మద్యాన్ని కేటాయించినా నిర్వహణ ఖర్చులకు పోను మిగిలేది ఏమి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టెండర్లలో రిజర్వేషన్లు..?

ఈ సారి నిర్వహించే మద్యం షాపు టెండర్లలో రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. లిక్కర్‌ వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు రిజర్వేషన్లను వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీలకు 5శాతం, ఎస్టీలకు 5శాతం, గౌడ కులస్థులకు 15శాతం టెండర్లలో రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తుంది. ఇప్పటికే లిక్కర్‌ వ్యాపారంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు కొంత కలిసి వచ్చే అవకాశంగానే కనిపిస్తోంది. అయితే లిక్కర్‌ వ్యాపారం డబ్బుతో కూడుకున్న పని కావడం, ఈ వ్యాపారంలో అనుభవం లేక పోవడంతో ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు ముందుకు వస్తారోనన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్నట్లుగానే మద్యం షాపు టెండర్లలో రిజర్వేషన్లను అమలు చేస్తే మళ్లీ బినామీదందా పెరిగి పోయే అవకాశం ఉందంటున్నారు.