Abn logo
Mar 14 2020 @ 01:38AM

ఫరూఖ్‌ విడుదల

సుమారు ఏడు నెలల నిర్బంధం తరువాత ఫరూఖ్‌ అబ్దుల్లా ఈ శుక్రవారం నాడు విడుదలయ్యారు. జమ్మూకశ్మీర్‌కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, ఒక సారి కేంద్రమంత్రిగా పనిచేసిన ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రజాభద్రతా చట్టం కింద ఇంతకాలంగా నిర్బంధంలో ఉన్నారు. 2019 ఆగస్టు 5వ తేదీన కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, రాజ్యాంగంలోని 370 అధికరణంలో మార్పులు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు, ఆంక్షలు, నిర్బంధాలు విధించింది. కేంద్రం అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయానికి చట్టసభల్లో ఆమోదం లభించింది, దేశవ్యాప్తంగా అనేకులు హర్షాంగీకారాలు తెలిపారు. అదే సమయంలో విమర్శలూ ఎదురయ్యాయి.


జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్బంధంలోకి తోశారని, భారతదేశంతో కలసి ఉండడానికి ఆ ప్రాంతానికి ఏ ప్రాతిపదిక లేకుండా చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వ నిర్ణయానికి కశ్మీర్‌లోని మిలిటెంట్‌ వర్గీయులే కాక, ప్రధానస్రవంతి ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వ్యతిరేకతను గట్టిగా వ్యక్తం చేశాయి. కశ్మీర్‌లో రాకపోకలను నిరోధించడం, అన్ని రకాల కమ్యూనికేషన్లను రద్దు చేయడం, కశ్మీరీ ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చర్యలు తీసుకోవడం అంతర్జాతీయంగా కూడా విమర్శలకు ఆస్కారమిచ్చాయి. విదేశాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులను కశ్మీర్‌లో పర్యటించడానికి అనుమతించారు కానీ, వాటికి విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. ఆందోళనల్లో ఉద్యమాల్లో పాల్గొనే వయస్సున్న యువకులందరినీ రాష్ట్రం బయటికి తరలించి నిర్బంధించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి, ఇతర పార్టీలకు చెందిన అన్ని స్థాయిల కార్యకర్తలను, నాయకులను వారి వారి హోదాలను బట్టి, నిర్బంధంలోకి తీసుకున్నారు. కొందరు జైళ్లకు వెళ్లారు, కొందరు గృహనిర్బంధాల్లో ఉన్నారు. కొందరిని గెస్ట్‌ హౌసుల్లో బంధించారు. ప్రజల మనోభావాలు వ్యక్తం అయ్యే మార్గాలేవీ అందుబాటులో లేకుండా దిగ్బంధం చేయడం ఇంతకు మునుపెన్నడూ జరగనిది. అందుకే, మానవహక్కుల వాదులు కశ్మీర్‌ రాష్ట్రం మొత్తంగా బందిఖానాగా మారిందని వ్యాఖ్యానించారు. 


83 సంవత్సరాల ఫరూఖ్‌ను ఏడు నెలలుగా గృహనిర్బంధంలోనే ఉంచారు. కానీ, రాష్ట్రం అంతా నిర్బంధ నిశ్శబ్దంలో ఉంటే, కాలూ చేయీ ఆడని ఆంక్షల మధ్య కాలం గడపడం కష్టమే. ఫరూఖ్‌ విడుదలయ్యారు కానీ, ఆయన కుమారుడు, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, మరో మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. తీవ్రవాదులను, రాళ్లు రువ్వేవారిని అరెస్టు చేసే ప్రజాభద్రత చట్టం కిందనే వీరందరినీ అరెస్టు చేశారు. ఇంకా ఈ చట్టం కింద నిర్బంధితులు నాలుగువందల మంది దాకా ఉన్నారని అంచనా. ఈ ఏడు నెలల కాలంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి వల్ల కశ్మీర్‌లో ప్రజాభిప్రాయం మారిందా, వారు 370 అధికరణం పీడ విరగడైందని ఆనందపడుతున్నారా, లేక, తమకు మరింత అన్యాయం జరిగిందని బాధపడుతున్నారా గ్రహించడం పెద్దగా కష్టమేమీ కాదు. కశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారా లేదా అన్నది కూడా తెలుసుకోవలసిన అంశం. తనకు స్వేచ్ఛ లభించడం ఆనందంగా ఉన్నదని, అయితే, తక్కిన నాయకుల విడుదల కూడా జరిగినప్పుడే తన ఆనందం పరిపూర్తి అవుతుందని, ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛ లభించినప్పుడు సంపూర్ణమవుతుందని ఫరూఖ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం తాను చేసిన తప్పొప్పులను సవరించుకోవడం ఈ విడుదలతో మొదలయిందని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు కానీ, తక్కిన నేతల విడుదలలు ఎంత శీఘ్రంగా జరుగుతాయో వేచిచూడాలి. 


కశ్మీర్‌ ప్రజా ఉద్యమ నాయకుడిగా, భారత్‌లో జమ్మూకశ్మీర్‌ అనుసంధానానికి కారకుడిగా ఉండిన షేక్‌ అబ్దుల్లా, తరువాత భారత ప్రభుత్వ తిరస్కారానికి గురై రెండుదశాబ్దాల పాటు నిర్బంధంలో ఉన్నారు. ఒక అవగాహన కుదిరిన తరువాత కశ్మీర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. స్వతంత్ర ప్రతిపత్తి గురించి పట్టింపు ఉన్నందుకు ఆయన కష్టాలు పడవలసి వచ్చింది. ఫరూఖ్‌ అబ్దుల్లా, భారతదేశంలో కొనసాగడానికే అంగీకరించిన వ్యక్తి. కానీ, దేశంలో ప్రతిపక్ష రాజకీయాలతో కలసి నడవాలని, రాష్ట్రాలకు అధిక హక్కులు కావాలని కోరినందుకు, ఇందిరాగాంధీ ఆగ్రహానికి గురి అయ్యారు. అనంతరం, కశ్మీర్‌లో ఎన్నికల ప్రహసనం, తీవ్రవాదుల ప్రవేశం, తీవ్రమైన హింస, అణచివేత, తెలిసిన చరిత్రే. పిడిపితో కలసి అధికారాన్ని పంచుకున్న భారతీయ జనతాపార్టీ, తెగదెంపులు చేసుకున్న వెంటనే, తీవ్రమైన చర్యలు తీసుకోవడం ఇటీవలి పరిణామం. బిజెపి అధికార భాగస్వాములు కూడా ఇప్పుడు నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. 


కశ్మీర్‌ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులకు తగిన స్వేచ్ఛ, వారి సమస్యలను చర్చించే వేదికలున్నప్పుడు మాత్రమే శాంతి శాశ్వతమవుతుంది. నిర్బంధ చర్యల వల్ల కానీ, పెట్టుబడుల వల్ల కానీ ఏర్పడే శాంతి తాత్కాలికమే. కశ్మీరీ గొంతును వినిపించే వారిని విడుదల చేసి, రాజకీయ ప్రక్రియలను సాధ్యమైనంత తొందరగా పునరుద్ధరించడం ఒక్కటే కశ్మీర్‌కు ఉపశమనం ఇస్తుంది.

Advertisement
Advertisement
Advertisement