సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2020-08-13T10:11:33+05:30 IST

జిల్లాలో చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చెరువులు, జలాశయాల్లోకి ప్రభుత్వం

సర్వం సిద్ధం

నేటి నుంచి చెరువుల్లో చేప పిల్లల విడుదల

ఈ ఏడాది లక్ష్యం కోటి 92 లక్షలు 


మంచిర్యాల, ఆగస్టు 12: జిల్లాలో చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి  చెరువులు, జలాశయాల్లోకి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను  వదులుతోంది. ఈ పథకంలో భాగంగా నాలుగో విడత చేప పిల్లల విడుదలకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఎంపిక  చేసిన చెరువుల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ చెరువులు, ప్రాజెక్టుల్లో వదిలి పెట్టేందుకు అవసరమైన చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. కాగా నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


325 చెరువులు ఎంపిక..

చేప పిల్లలు వదిలేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు జలాశయాలు, మరో మూడు రిజర్వాయర్లతోపాటు మొత్తం 325 చెరువులను ఎంపిక చేశారు. జిల్లాలోని చెరువులతోపాటు సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, హాజీపూర్‌ మండలంలోని ముల్కల్ల గ్రామంలోగల ర్యాలీవాగు, నీల్వాయి, భీమారం మండలంలోని గొల్లవాగు రిజర్వాయర్లలో నిర్ణీత లక్ష్యం మేరకు కోటి 92 లక్షల బొచ్చ, రవు, బంగారుతీగ, మ్రిగాల రకాలకు చెందిన చేప పిల్లలను విడిచి పెట్టనున్నారు. చెరువుల్లో 40 మి.మీల సైజుగల కోటి 16 లక్షల చేప పిల్లలను వేయనున్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో 100 మి.మీ వరకు సైజు ఉండే 75 లక్షల పిల్లలను వదిలి పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 


సొసైటీల ద్వారా..

జిల్లాలో 88 ఎంపిక చేసిన సొసైటీల ద్వారా చేపల పెంపకం చేపట్టనున్నారు. ఇందులో 17 మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం 5,735 మంది సభ్యులు ఉన్నారు. గంగపుత్ర, బెస్త, ముదిరాజ్‌, బోయ కులస్తులతో కూడిన సంఘాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడు ప్రాజెక్టులు, మూడు రిజర్వాయర్లతోపాటు 375 చెరువులను ఆయా సంఘాలకు అప్పగించి చేపల పెంకం చేపట్టనున్నారు. మత్స్యశాఖ ఆధ్వ ర్యంలో నేరుగా ఆయా కులాలను గుర్తించి సొసైటీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా జిల్లాలో గత సంవత్సరం కోటి 86 లక్షల చేప పిల్లలను విడుదల చేయగా సంతృప్తికర ఉత్పత్తి జరిగింది. మొత్తం 6,265 టన్నులకుపైగా ఉత్పత్తి జరుగగా మత్స్యకారులకు చేపల పెంపకం లాభసాటిగా మారింది.  


దళారీ వ్యవస్థకు తావులేకుండా..

దళారీ వ్యవస్థకు తావులేకుండా కుల వృత్తిదారులతోనే చేపల పెంకం చేపట్టేలా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. చేపల పెంపకానికి సంబంధించి సంఘాల ఏర్పాటు, చెరువుల ఎంపిక, చేప పిల్లల సరఫరా తదితర పనులన్నీ మత్స్యశాఖ ఆధ్వర్యంలోనే చేపడుతున్నారు. ఉత్పత్తి విక్రయాలు మినహా దళారీ వ్యవస్థ జోక్యం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గతంలో చేపల చెరువులను కుల వృత్తుల వారే కాకుండా పలువురు ప్రజాప్రతినిధులు దక్కించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కేవలం చేపలు పట్టి జీవనం సాగించే ఆయా కులాల వారికి మినహా ఇతరులెవరూ చెరువులు దక్కించుకోవద్దనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సంఘాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.   


ఏర్పాట్లు పూర్తి చేశాం..మత్స్యశాఖ జిల్లా ఏడీ, సత్యనారాయణ

జిల్లాలో గురువారం నుంచి చేపట్టనున్న నాలుగో విడత చేప పిల్లల విడుదల కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని బెల్లంపల్లి నియోజక వర్గంలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లక్ష్యం మేరకు చేప పిల్లలను సంబంధిత అధికారులు విడుదల చేయనున్నారు.

Updated Date - 2020-08-13T10:11:33+05:30 IST