పాలేరు నుంచి నీటి విడుదల నేడు

ABN , First Publish Date - 2020-08-12T10:24:13+05:30 IST

నాగార్జునసాగర్‌ రెండో జోన్‌ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లా ఆయకట్టుకు బుధవారం పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయ

పాలేరు నుంచి నీటి విడుదల నేడు

హాజరుకానున్న మంత్రి అజయ్‌, ఎంపీ నామా, ఎమ్మెల్యే కందాళ

ఏర్పాట్లు చేసిన అధికారులు 


కూసుమంచి, ఆగస్టు 11: నాగార్జునసాగర్‌ రెండో జోన్‌ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లా ఆయకట్టుకు బుధవారం పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి లాకులు ఎత్తి.. ఎడమకాలువకు నీటిని అందించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతేడాది ఆగస్టు 14తేదీన వానాకాలం పంటకు నీటిని విడుదల చేయగా ఈఏడాది వర్షాలు సమృద్ధిగా పడటం, కృష్ణాపరివాహకం నుంచి ప్రాజెక్టులకు గణనీయంగా నీరు చేరడంతో.. సీఎం ఆదేశాలతో ముందుగానే సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.


ఆన్‌అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా.. ఖమ్మంజిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సాగర్‌ మొదటి జోన్‌ నుంచి 2వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో పాలేరు జలాశయం జలకళను సంతరించుకుంది. 23 అడుగుల గరిష్ఠ నీటిమట్టానికి గాను 22అడుగుల మేర నీరు చేరింది. బుధవారం ఉదయానికి అలుగులు పారే అవకాశం ఉండగా.. ఇప్పటికే సాగుపనులను ముమ్మరం చేసిన ఆయకట్టు రైతులు.. పనులను మరింత ముమ్మరం చేయనున్నారు. 

Updated Date - 2020-08-12T10:24:13+05:30 IST