Abn logo
May 27 2020 @ 00:33AM

మా నాన్నను వెంటనే విడుదల చేయండి

గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి

బాంబే హైకోర్టు, ముంబై


సర్,

మా తండ్రి, ప్రముఖ విప్లవ కవి వరవరరావుపై తప్పుడు అభియోగాలతో మోపిన ఒక కేసులో మహారాష్ట్ర జైళ్ళలో (2020 ఫిబ్రవరి వరకు పూణేలోని ఎరవాడ జైలులోనూ, దరిమిలా నవీ ముంబైలోని తలోజా జైలులోనూ) ఖైదీగా ఉన్నారు. కొవిడ్ -19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త (ముంబై హైకోర్టులో సోమవారంనాడు ఒక ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించింది) మమ్ములను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 


మా నాన్నగారి వయస్సు 80 సంవత్సరాలు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్యం దుర్బలంగా ఉన్నందున ఆయనకు కరోనా వైరస్ సోకే ప్రమాదమున్నది. ఎనిమిది వారాల క్రితం లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరువాత జైలులో మా తండ్రిని సందర్శించేందుకు మాకు అనుమతి లభించలేదు. సాధారణ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి కూడా అనుమతినివ్వలేదు. ఆయన్ని సందర్శించేందుకు న్యాయవాదులను సైతం అనుమతించడం లేదు. ఈ ఎనిమిదివారాలుగా మా నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు మేము ఎంతో వ్యాకులతతో ఆతురపడుతున్నాము.


డెబ్బై సంవత్సరాలకు పైబడిన వయస్సులో వుండి, అనారోగ్యంతో బాధపడుతున్న మా తల్లితో మూడు సార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు మా నాన్న గారిని అనుమతించారు. ఆయన మా అమ్మతో కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించారు. మా నాన్నగారు ఇప్పుడు విచారణలో ఉన్న ఖైదీ మాత్రమే. గత 47 సంవత్సరాలలో మా తండ్రిపై మోపిన 25 కేసులలోనూ ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 21 విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు కల్పిం చింది. రాజ్యాంగం ప్రకారం ఆయనకు గల ఈ హక్కుకు ఇప్పుడు ప్రమాదం వాటిల్ల కూడదు. 


తలోజా జైలులో ఖైదీ మరణం గురించి, కొవిడ్ -19 వ్యాప్తి గురించి వార్తా పత్రికల్లో చదివాము. తలోజా జైలు అధికారులను కలిసి మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబ్ చేయాలని మా న్యాయవాది పద్మను అడిగాము. ఆమె ఈ విషయమై తలోజా జైలు అధికారులకు ఫోన్ చేయగా, ఫోన్ కాల్‌ను రిసీవ్ చేసుకున్నారుగానీ, న్యాయవాది ప్రశ్నలకు ప్రతిస్పందించలేదు. మా తండ్రి శ్రేయస్సు గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఆతురపడుతున్నాము. ఆందోళన, వ్యాకులత, నిస్సహాయత్వం కలగలిసిన ఈ తీవ్ర దుష్కర పరిస్థితులలో మా నాన్నగారి నిర్బంధ వ్యవహారాన్ని పరిశీలించి, ఈ క్రింద పేర్కొన్న వాటిపై తగుచర్యలకు చొరవ తీసుకోవాలని మిమ్మలను అభ్యర్థిస్తున్నాము. 


(1) వయస్సు, ఆరోగ్యం, కొవిడ్- 19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వరవరరావును తాత్కాలిక బెయిల్ లేదా పెరోల్‌పై విడుదల చేయాలి; 

(2) వరవరరావు భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని స్వయంగా నిర్ధారించుకుని, భరోసా పొందేందుకై ఆయన్ని జైలులో సందర్శించేందుకు కుటుంబ సభ్యులకు అనుమతినివ్వాలి;

(3) కుటుంబ సభ్యులకు తరచు ఫోన్ చేసేందుకు, ఉత్తరాలు రాసేందుకు ఆయనకు అనుమతినివ్వాలి; 

(4) జైలులో మా నాన్నగారితో సమావేశమయ్యేందుకు న్యాయవాదులను అనుమతించాలి. 

ధన్యవాదాలు.

పి. సహజ, పి. అనల, పి. పావన

(పి.వరవరరావు కుమార్తెలు)

Advertisement
Advertisement
Advertisement