అమరావతి: ఇంకొన్ని గంటల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఈ సినిమా విషయంలో వివాదం నెలకొంది. పెద్ద సినిమాలకు పండగ టైమ్లో అదనపు షోలకు అనుమతులు ఇస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలో జీవోలు విడుదల చేసేవి. అలాగే ఈ మధ్య టిక్కెట్ రేట్లు కూడా పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే 'ఉగాది' కానుకగా విడుదల కాబోతోన్న 'వకీల్ సాబ్' విషయంలో మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పలు థియేటర్లలో తనిఖీలు చేసిన ఏపీ రెవిన్యూ అధికారులు.. టికెట్ ధరలు పెంచేందుకు అనుమతిలేదని, ఒకవేళ టికెట్ ధరలు పెంచితే థియేటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే 9, 10 తేదీల్లో ప్రీమియర్ షోలు, బెన్ఫిట్ షోలు, రెగ్యులర్ షోలకు ధరలు పెంచి టికెట్స్ అమ్మేశామని, ఆన్లైన్లో టికెట్లు విక్రయించామని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సడెన్గా ఏపీ రెవిన్యూ అధికారులు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లేదని, టికెట్ ధర పెంచి అమ్మితే థియేటర్ సీజ్ చేస్తామని కూడా థియేటర్ యజమానులకు హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన మెగాభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిగతా హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు అవకాశం ఇచ్చి.. తమ హీరో సినిమాకు ఎందుకు అనుమతి ఇవ్వరని మెగాభిమానులు ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అవుతున్నారు. రేట్లు పెంచుకునేందుకు అనుమతివ్వకపోతే.. శుక్రవారం థియేటర్ల ముందు కూర్చుని ధర్నా చేస్తామని ఏపీ ప్రభుత్వానికి ధీటుగా ఫ్యాన్స్ కూడా హెచ్చరికలు పంపుతున్నారు. గతంలో లానే బెన్ఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని.. రాజకీయ కక్ష సాధింపు సినిమాలపై చూపించవద్దని.. రాజకీయాలను, సినిమాలను వేరువేరుగా చూడాలని వారు కోరుతున్నారు.