రాష్ట్ర బకాయిలు విడుదల చేయండి

ABN , First Publish Date - 2022-02-20T07:58:50+05:30 IST

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను

రాష్ట్ర బకాయిలు విడుదల చేయండి

  •  కేంద్ర మంత్రి నిర్మలకు మరోసారి హరీశ్‌ లేఖ


హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి లేఖ రాశారు. ఇవే బకాయిల చెల్లింపుపై గత జనవరి 24న కూడా కేంద్రమంత్రికి ఆయన లేఖ రాశారు. అప్పటి నుంచి ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికైనా బకాయిలను చెల్లించాలని లేఖలో కోరారు. 


హరీశ్‌ పేర్కొన్న బకాయిల వివరాలు

 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద రాష్ట్రానికి రెండేళ్ల బకాయిలు రూ.900 కోట్లు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయడంతో పాటు ఈ గ్రాంట్‌ను 2021-22 తర్వాత మరో ఐదేళ్ల పాటు పొడిగించాలి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కోసం నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన రూ.24,205 కోట్లను విడుదల చేయాలి.

 స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అకారణంగా తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారు. వీటిని వీలైనంత త్వరగా విడుదల చేసేలా చూడాలి.

 రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎ్‌సఎ్‌స)కు సంబంధించి రాష్ట్రం ఆవిర్భవించిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరపాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఏపీకి వెళ్లాయి. ఈ విషయాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్‌ జనరల్‌(ఏజీ) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంకా సర్దుబాటు చేయలేదు. ఈ మొత్తాన్ని వెంటనే తెలంగాణకు విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలి.


Updated Date - 2022-02-20T07:58:50+05:30 IST