Apr 22 2021 @ 01:05AM

థియేటర్లలోనూ... డిజిటల్‌ తెరపైనా... ఒకే రోజున విడుదల!

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ మే 13న విడుదల కానుంది. ముందుగా ప్రామిస్‌ చేసినట్టు రంజాన్‌ పండక్కి ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తున్నారు సల్మాన్‌. అయితే, ఆసక్తికరమైన అంశం ఏంటంటే... థియేటర్లతో పాటు డిజిటల్‌ తెరపైనా అదే రోజున విడుదల చేస్తున్నారు. థియేట్రికల్‌ రిలీజ్‌తో పాటు జీ5 ఓటీటీకి చెందిన జీప్లెక్స్‌లో టికెట్‌ రుసుము చెల్లించి చూడొచ్చు. అదే విధంగా డిష్‌, డీ2హెచ్‌, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ వంటి డీటీహెచ్‌ వేదికలలోనూ ‘పే పర్‌ వ్యూ’ విధానంలో సినిమా విడుదల కానుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విధంగా సినిమా విడుదల చేస్తున్నామని జీస్టూడియోస్‌ సీఈవో షరిఖ్‌ పటేల్‌ తెలిపారు. ఓవర్‌సీస్‌ మార్కెట్‌లో సుమారు 40 దేశాల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత యూకేలో విడుదల కానున్న తొలి హిందీ చిత్రమిదే. వాస్తవానికి, గతేడాది రంజాన్‌కి సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అప్పట్లో లాక్‌డౌన్‌ వల్ల కుదరలేదు. ఇప్పుడూ కరోనా విజృంభణ అధికంగా ఉండటంతో థియేటర్లలో, డిజిటల్‌ తెరపైనా ఒకే రోజు విడుదల చేస్తున్నారు.