Apr 22 2021 @ 01:00AM

థియేటర్లలో ‘శుక్ర’వారమే విడుదల

‘‘థియేటర్లు మూసివేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... విడుదల చేయాలని మేం నిర్ణయించుకున్నాం. థియేటర్లు, మల్టిప్లెక్స్‌ల్లో స్ర్కీన్లు... ఎన్ని దొరికితే అన్నిటిలోనూ శుక్రవారమే మా ‘శుక్ర’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని దర్శకుడు సుకు పూర్వజ్‌ అన్నారు. అరవింద్‌ కృష్ణ, శ్రీజితా ఘోష్‌ జంటగా అయ్యన్ననాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాణంలో ఆయన తెరకెక్కించిన సినిమా ‘శుక్ర’. ఈ నెల 23న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘వోట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌’ మీట్‌లో హీరో అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రచార చిత్రాలు, పాటలు నచ్చితే థియేటర్లకు రండి. భౌతిక దూరం పాటిస్తూ... మాస్క్‌లు ధరించి, శానిటైజర్లు రాసుకుని సినిమా చూడండి. పరిస్థితులు ఎలా ఉన్నా చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి వల్ల సినిమా బాగా వచ్చింది’’ అని తేజ పల్లె చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రిష్‌, విశాల్‌ రాజ్‌,  ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు.