‘రిలయన్స్‌’ భూముల స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-01T05:27:36+05:30 IST

అవన్నీ ఒకప్పుడు పచ్చని పొలాలు.. ఆ భూములే వేల కుటుంబాలకు జీవనాధారం.. ఈ క్రమంలో కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌(రిలయన్స్‌ భాగస్వామ్యం) సంస్థ ఆ భూముల్లో పెద్ద పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకొచ్చింది.

‘రిలయన్స్‌’ భూముల స్వాధీనం
కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ భూముల్లో ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టిన తహసీల్దార్‌ సోమ్లానాయక్‌

1730.30 ఎకరాలను చేతుల్లోకి తీసుకున్న ప్రభుత్వం

ఉత్తర్వులిచ్చిన కలెక్టర్‌.. 

తహసీల్దార్‌ సమక్షంలో స్వాధీనం

13 ఏళ్లయినా ప్రాజెక్టు మొదలుపెట్టని కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌

ఉద్యోగాలొస్తాయనుకున్న వారికి మిగిలింది నిరాశే!

ఆ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు పలు సంస్థల ఆసక్తి


నెల్లూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : అవన్నీ ఒకప్పుడు పచ్చని పొలాలు.. ఆ భూములే వేల కుటుంబాలకు జీవనాధారం.. ఈ క్రమంలో కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌(రిలయన్స్‌ భాగస్వామ్యం) సంస్థ ఆ భూముల్లో పెద్ద పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకొచ్చింది. అప్పటి ప్రభుత్వం కూడా ఇందుకు సమ్మతించింది. అయితే ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామని అప్పట్లో చెప్పడంతో రైతులు కూడా ఆశపడి తక్కువ ధరకే భూములను ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఈ భూములను రిలయన్స్‌ భాగస్వామ్యం కలిగిన సంస్థకు అప్పగించి ఇప్పటికి 13 ఏళ్లు కావస్తోంది. ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కావల్సి ఉంది. కానీ ఇప్పటికీ అసలు పనులే మొదలు కాలేదు. రకరకాల కారణాలతో కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ సంస్థ ప్రాజెక్టు నిర్మాణానికి వెనకడుగు వేసింది. దీని మూలంగా పుష్కర కాలం నుంచి వేల ఎకరాల భూములు నిరుపయోగంగా మారిపోయాయి. ఈ క్రమంలో అనేక మార్లు రైతులు ఆందోళన చేశారు. ఈ మధ్యలోనే కోర్టు కేసులు కూడా జరిగాయి. అయితే ఎట్టకేల కు ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే పలుమార్లు సదరు సంస్థకు అధికారులు నోటీసులివ్వడం, వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడం, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు చేపట్టకపోతే భూము లు స్వాధీనం చేసుకునే అధికారం ఉండడంతో ఉన్నతాధికా రులు ఆ దిశగా అడుగులు వేశారు. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు రిలయన్స్‌ భూముల స్వాధీనానికి ఉత్తర్వులిచ్చారు. దీంతో నెల్లూరు ఆర్డీవో నేతృత్వంలో ముత్తుకూరు తహసీ ల్దార్‌ సోమ్లానాయక్‌ శనివారం ఆ ప్రక్రియ ముగించారు. ఐదుగురు స్థానిక పంచాయతీదారుల సమక్షంలో రెవెన్యూ అధికారులు భూముల స్వాధీన పంచానామా రాశారు. కృష్ణప ట్నం, ముత్తుకూరు, నేలటూరు, పైనాపురం, మల్లూరు, మామిడిపూడి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1730.30 ఎకరా లను స్వాధీనం చేసుకుంటున్నట్లు తహసీల్దార్‌ నోటీసులో పేర్కొన్నారు. దీంతో పుష్కరకాలం తర్వాత రైతుల భూములు తిరిగి ప్రభుత్వం చేతికి చేరాయి. 


ఇదీ నేపథ్యం.


2007లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ క్రమంలో కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ సంస్థ కృష్ణపట్నం ప్రాంతంలో అతిపెద్ద పవర్‌ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకొచ్చింది. రెండు దశల్లో 2400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అలా్ట్ర మెగా పవర్‌ ప్రాజెక్టు(యూఎంపీపీ) పేరుతో ముత్తుకూరు మండలంలో భూములు కోరింది. నాటి ఏపీఐఐసీ ద్వారా కృష్ణపట్నం, ముత్తుకూరు, నేలటూరు, పైనాపురం, మల్లూరు, మామిడిపూ డి రెవెన్యూ గ్రామాల పరిధిలో 1730.30 ఎకరాల భూములను సేకరించింది. మొదట తక్కువ పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నించగా రైతులు ఒప్పుకోలేదు. చివరకు ఎకరాకు సుమారు రూ.7 లక్షల వరకు పరిహారం అందించి భూములు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత యూఎంపీపీ నిర్మాణానికి ప్రభుత్వం ఈ భూములను కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ సంస్థకు అప్పగించింది. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో సగం విద్యుత్‌ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. అలానే ఐదేళ్లలోపు ఉత్పత్తి ప్రారంభం కాకపోతే భూములను తిరిగి వెనక్కు తీసుకునే లా నిబంధనలు విధించింది. కాగా ఈ ప్రాజెక్టుకు ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే బొగ్గు విషయంలో రిలయన్స్‌ సంస్థకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముందుగా కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం కన్నా ధర పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఇది కుదరలేదు. ఇలా అనేక సమస్యలు యూఎంపీపీ చుట్టూ అలుముకోవడంతో పనులు  ప్రారంభం కాలేదు. గడువు దాటినా పనులు ప్రారంభం కాకపోవడంతో పలుమార్లు అధికారులకు కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ సంస్థకు నోటీసులు ఇచ్చారు. చివరగా ఇప్పుడు ఆ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఉద్యోగాలొస్తాయన్న ఆశతో భూములిచ్చిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది. అటు పంటలు పండించుకునేందుకు అవకాశం లేకపోవడం ఇటు పనిచేసుకునేందుకు ఉద్యోగాల్లేకపోవడంతో ఆ రైతు కుటుంబాలకు అన్యాయం జరిగింది. 


పలు సంస్థల ఆసక్తి


ఈ భూములను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ భూముల్లో ఏర్పాటు చేసిన గోడపై స్వయంగా తహసీల్దార్‌ వెళ్లి స్వాధీన నోటీసు అంటించి, ప్రభుత్వ భూమిగా బోర్డు కూడా పెట్టారు. అయితే ఈ వ్యవహారమంతా గోప్యంగా జరుగుతుండడం గమనార్హం. ఈ భూముల వ్యవహారం ఇంకా కోర్టులో ఉన్నట్లు చెబుతున్నారు. మరి తర్వాత ఏం జరుగుతుందన్నది చూడాలి. కాగా రిలయన్స్‌ సంస్థ పవర్‌ ప్రాజెక్టు నుంచి ఉపసంహరించు కున్నప్పటికీ పలు సంస్థలు మాత్రం ఆ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గతేడాది ఉత్తర కొరియాకు చెందిన నిపుణుల బృందం ఈ భూములను పరిశీలించింది. వీరు హ్యూండాయ్‌ కంపెనీ ప్రతినిధులుగా అప్పట్లో అధికార వర్గాలు వెల్లడించాయి. అలానే రెండు వారాల క్రితం దక్షిణ కొరియాకు చెందిన మరో బృందం ఈ భూములను పరిశీలించింది. వారి వెంట జిల్లా ఉన్నతాధికారులు ఉండడం గమనార్హం. కాగా రైతుల భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం తర్వాత ఏ పరిశ్రమలకు కేటాయించనుందనేదే ఆసక్తిగా మారింది. 


స్వాధీనం చేసుకున్నాం 


కోస్టల్‌ ఆంధ్ర పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌కు కేటాయించిన భూములను నిబంధనల ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకు న్నాం. ఈ భూములను తదుపరి ఎవరికి కేటాయించాలనే విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. 


- హుస్సేన్‌ సాహేబ్‌, నెల్లూరు ఆర్డీవో

Updated Date - 2021-03-01T05:27:36+05:30 IST