రిలయన్స్‌ ‘ఫార్చ్యూన్‌’ తలకిందులు

ABN , First Publish Date - 2021-08-03T06:00:09+05:30 IST

భారత కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500

రిలయన్స్‌ ‘ఫార్చ్యూన్‌’ తలకిందులు

  • 59 స్థానాలు దిగజారి 155వ స్థానానికి 
  • 16 స్థానాలు ఎగబాకిన ఎస్‌బీఐ.. 205వ స్థానం


న్యూఢిల్లీ: భారత కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌).. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో 59 స్థానాలు దిగజారి 155వ స్థానానికి చేరింది. మరోవైపు దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ 16 స్థానాలు పైకి దూసుకుపోయి 205వ స్థానం సంపాదించుకుంది. 2017 తర్వాత ఆర్‌ఐఎల్‌ పొందిన కనిష్ఠ స్థానం ఇదే. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంలో తిరుగులేని ఆధిపత్యం గల 500 కార్పొరేట్‌ దిగ్గజాల జాబితా-2021ని ఫార్చ్యూన్‌ సంస్థ సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి లేదా అంత కన్నా ముందు కంపెనీల ఆదాయాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ధారించినట్టు ఫార్చ్యూన్‌ సంస్థ ప్రకటించింది. కొవిడ్‌-19 ప్రభావం వల్ల ఆదాయాలు తగ్గడం రిలయన్స్‌ ర్యాంకింగ్‌ దిగజారడానికి కారణంగా చెబుతున్నారు. 



ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం వల్ల 2020 రెండో త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌ తుడిచిపెట్టుకుపోవడంతో రిలయన్స్‌ ఆదాయం 25.3 శాతం క్షీణించి 6,300 కోట్ల డాలర్లకు పరిమితమైంది, ఇదే ప్రభావంతో ఫార్చూన్‌ జాబితాలోని ఇతర భారత ఆయిల్‌ దిగ్గజాలు కూడా తమ స్థానాల నుంచి దిగజారాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) 61 స్థానాలు దిగజారి 212 ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఓఎన్‌జీసీ కూడా 53 స్థానాలు దిగజారి 243కి దిగివచ్చింది. కాగా  టాటా మోటార్స్‌ 357, బీపీసీఎల్‌ 394 స్థానంలో నిలిచాయి. 


Updated Date - 2021-08-03T06:00:09+05:30 IST