Abn logo
Jul 24 2021 @ 17:14PM

ఆర్థిక సంస్కరణలపై ముఖేశ్ అంబానీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల ఫలాలు ప్రజలకు సరిసమానంగా అందలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అన్నారు. అట్టడుగున ఉన్న పేదలు సంపన్నులవడంపై దృష్టి పెట్టడం కోసం భారతీయ అభివృద్ధి నమూనా అవసరమని చెప్పారు. 2047నాటికి మన దేశం అమెరికా, చైనాలతో సమానంగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చి 30 సంవత్సరాలైన సందర్భంగా ఆయన రాసిన వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 


సమానత్వమే ముఖ్యం

ఆర్థిక సంస్కరణల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. 1991లో కొరత ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, 2021నాటికి ఇది అవసరాలను తీర్చగలిగే ఆర్థిక వ్యవస్థగా మారిందని తెలిపారు. ఇక భారత దేశం 2051నాటికి సుస్థిర, సమృద్ధ, అందరికీ సమాన సంపదను ఇవ్వగలిగే ఆర్థిక వ్యవస్థగా పరివర్తన చెందాలని ఆకాంక్షించారు. భారత దేశంలో మనందరి ఉమ్మడి శ్రేయస్సు, సౌభాగ్యాలకు ముఖ్యమైనది సమానత్వమేనని స్పష్టం చేశారు. 


నూతన ఆలోచనా శక్తికి ఊపు

భారత దేశం 1991లో దూరదృష్టితో, ధైర్యసాహసాలతో వ్యవహరించిందన్నారు. ఆర్థిక వ్యవస్థ దిశను, నిర్ణాయకాలను మార్చిందన్నారు. అంతకుముందు నాలుగు దశాబ్దాలపాటు జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ఆక్రమించిన స్థానంలోని  ప్రాబల్య స్థానంలోకి ప్రైవేటు రంగాన్ని కూడా చేర్చిందని తెలిపారు. లైసెన్స్-కోటా విధానానికి తెర దించిందని, వాణిజ్య, పారిశ్రామిక విధానాలను సరళతరం చేసిందని పేర్కొన్నారు. కేపిటల్ మార్కెట్లకు, ఫైనాన్షియల్ సెక్టర్‌కు స్వేచ్ఛనిచ్చిందని పేర్కొన్నారు. ఈ సంస్కరణలు భారత దేశ నూతన ఆలోచనా శక్తికి ఊపునిచ్చాయని, వృద్ధి వేగం పుంజుకునే శకాన్ని ప్రారంభించాయని పేర్కొన్నారు. 


సగానికి తగ్గిన పేదరికం రేటు

ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మన దేశానికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయన్నారు. జనాభా 88 కోట్ల నుంచి 138 కోట్లకు పెరిగినప్పటికీ, పేదరికం రేటు సగానికి తగ్గడానికి దోహదపడ్డాయని అన్నారు. చాలా ముఖ్యమైన మౌలిక సదుపాయాలు గుర్తించలేనంతగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. నేడు మన ఎక్స్‌ప్రెస్‌వేస్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయన్నారు. అదే విధంగా మన అనేక పరిశ్రమలు, సేవలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని తెలిపారు. టెలిఫోన్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండవలసిన రోజులు ఉండేవని గుర్తు చేశారు. అదేవిధంగా ఓ కంప్యూటర్ కొనుక్కోవడానికి ప్రభుత్వ అనుమతి కోసం వ్యాపార సంస్థలు చాలా కాలం వేచి ఉండవలసిన పరిస్థితులు ఉండేవన్నారు. 


అంతకన్నా గొప్ప కల ఏముంటుంది?

గడచిన మూడు దశాబ్దాల్లో మనం సాధించిన విజయాల వల్ల గొప్ప కలలు కనే హక్కును సాధించుకున్నామని తెలిపారు. మన దేశాన్ని అమెరికా, చైనాలతో సమానంగా, ప్రపంచంలో మూడు సంపన్న దేశాల్లో ఒకటిగా అభివృద్ధి చేయడం ద్వారా 2047లో 100వ స్వాతంత్ర్యదినోత్సవాలను జరుపుకోగలగాలనే కల కన్నా గొప్ప స్వప్నం మరొకటి ఉండదని తెలిపారు. 


రానున్న ముప్ఫయ్ ఏళ్ళలో ఇది మన బాధ్యత

మన ముందు ఉన్న మార్గం సులువైనది కాదని, అయినప్పటికీ అనూహ్యమైన, తాత్కాలిక సమస్యలు మనల్ని నిరోధించకుండా జాగ్రత్తవహించాలని అన్నారు. రానున్న ముప్ఫై ఏళ్ళను స్వతంత్ర భారత దేశ చరిత్రలో అత్యుత్తమమైనవిగా తీర్చిదిద్దాలని, ఆ అవకాశం మనకు ఉందని, ఇది మన పిల్లలు, యువత పట్ల మన బాధ్యత అని,  తెలిపారు. దీనిని సాధించడంలో మిగతా ప్రపంచంతో సహకరిస్తూనే స్వయం సమృద్ధ భారత దేశం నమూనా సరైన సమాధానం కావచ్చునని పేర్కొన్నారు. 


సత్యాన్ని నిర్లక్ష్యం చేశాం

ఇప్పటి వరకు ఆర్థిక సంస్కరణల వల్ల భారతీయులకు లభించిన ఫలితాలు అసమానంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అసమానతలు ఆమోదయోగ్యం కాదని, సమర్థనీయం కాదని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అట్టడుగున ఉండే ప్రజలకు లబ్ధి చేకూరడంపై దృష్టి సారిస్తూ భారతీయ అభివృద్ధి నమూనా ఉండాలని పిలుపునిచ్చారు. చాలా కాలం మనం సంపదను కేవలం వ్యక్తిగత, ఆర్థిక సంబంధిత మాటలలో మాత్రమే అర్థం చేసుకున్నామన్నారు. ‘అందరికీ విద్య’, ‘అందరికీ ఆరోగ్యం’, ‘అందరికీ ఉపాధి’, ‘అందరికీ మంచి ఇళ్లు’, ‘అందరికీ పర్యావరణ భద్రత’, ‘అందరికీ క్రీడలు, సంస్కృతి, కళలు’ ‘అందరికీ స్వీయాభివృద్ధి అవకాశాలు’ - సంక్షిప్తంగా ‘అందరికీ సంతోషం’ ను సాధించడంలోనే భారత దేశపు నిజమైన సంపద ఉందనే సత్యాన్ని మనం నిర్లక్ష్యం చేశామన్నారు. శ్రేయస్సు, సౌభాగ్యాలకు సంబంధించిన ఈ పునర్నిర్వచిత పరామితులను సాధించడానికి వ్యాపారం, సమాజంలోని మూలాలకు శ్రద్ధ, సంరక్షణ, ఇతరుల మనోభావాలతో తాదాత్మ్యం చెందడాన్ని తీసుకెళ్ళాలని వివరించారు.