రిలయన్స్‌.. అదుర్స్‌

ABN , First Publish Date - 2021-10-23T08:05:26+05:30 IST

సియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించా యి.

రిలయన్స్‌.. అదుర్స్‌

అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలు 

 రూ.13,680 కోట్లకు క్యూ2 లాభం 

ముంబై: ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)..సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) ఆర్‌ఐఎల్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 43 శాతం వృద్ధి చెంది రూ.13,680 కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.9,567 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆదాయం 49 శాతం వృద్ధితో రూ.1.74 లక్షల కోట్లకు ఎగబాకింది. రిలయన్స్‌కు చెందిన అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదపడింది. చమురు శుద్ధి మార్జిన్లతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల ఇంధన వ్యాపారానికి కలిసి వచ్చిందని, కంపెనీ రిటైల్‌ వ్యాపార స్టోర్లను సందర్శించే కస్టమర్లు ప్రీ-కొవిడ్‌ స్థాయికి పెరిగారని, టెలికాం విభాగంలో ఒక్కో వినియోగదారు నుంచి ఆర్జించే సగటు ఆదాయం మరింత పెరిగిందని రిలయన్స్‌ పేర్కొంది. ప్రధాన వ్యాపార విభాగాల వారీగా కంపెనీ పనితీరు వివరాలు.. 


ఓ2సీ:

రిలయన్స్‌ సంప్రదాయ వ్యాపారమైన ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) వ్యాపార ఆదాయం వార్షిక ప్రాతిపదికన 58.1 ు వృద్ధి చెంది రూ.1.20 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ విభాగ నిర్వహణ లాభం 43.9 శాతం వృద్ధితో రూ.12,720 కోట్లకు చేరుకుంది. 


జియో:

రిలయన్స్‌కు చెందిన డిజిటల్‌ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఈ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.3,728 కోట్లకు చేరకుంది. ఏడాది క్రితం ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,019 కోట్ల లాభంతో పోల్చితే 23.48 శాతం వృద్ధి చెందింది. సమీక్షా కాలానికి ఈ విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12.5 శాతం పెరిగి రూ.23,222 కోట్లకు చేరుకుంది. జియో టెలికాం వ్యాపారంలో ఒక్కో వినియోగదారు నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.143.6కు పెరిగింది. జూన్‌తో ముగిసిన మూడు నెలలకు రూ.138.4గా ఉంది. 

రిటైల్‌:

సెప్టెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ విభాగ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 74.4 శాతం పెరిగి రూ.1,695 కోట్లకు చేరుకుంది. ఆదాయం 9.2 శాతం వృద్ధితో రూ.39,926 కోట్లుగా నమోదైంది. 

Updated Date - 2021-10-23T08:05:26+05:30 IST