రిలయన్స్‌ రికార్డు లాభం

ABN , First Publish Date - 2020-07-31T07:37:22+05:30 IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి.

రిలయన్స్‌ రికార్డు లాభం

క్యూ1లో రూ.13,248 కోట్లుగా నమోదు

కలిసొచ్చిన వాటా విక్రయం, జియో సేవలు 

ఓ2సీ, రిటైల్‌ వ్యాపారాలకు ‘కరోనా’ గండి


న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి(ఏప్రిల్‌-జూన్‌) కన్సాలిడేటెడ్‌ లాభం వార్షిక ప్రాతిపదికన 30.6 శాతం వృద్ధి చెంది రూ.13,248 కోట్లుగా నమోదైంది. కరోనా దెబ్బకు రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌, రిటైల్‌ వ్యాపారాలకు గండిపడినప్పటికీ పెట్రోల్‌ బంకుల విభాగంలో వాటా విక్రయం, జియో సేవలపై బంపర్‌ రాబడి కంపెనీకి కలిసొచ్చాయి. తద్వారా 2019 అక్టోబరు-డిసెంబరు కాలానికి నమోదైన గత అత్యుత్తమ లాభం రూ.11,640 కోట్ల స్థాయిని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది రిలయన్స్‌ పెట్రోల్‌ బంకుల వ్యాపారంలో 49 శాతం వాటాను బీపీ పీఎల్‌సీకి రూ.7,629 కోట్లకు విక్రయించింది. తద్వారా, గత త్రైమాసికంలో రూ.4,966 కోట్ల ఏక కాల లాభం (వన్‌ టైం గెయిన్‌) సమకూరినట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్‌ ఆర్థిక ఫలితాల్లోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


ఈ ఏప్రిల్‌-జూన్‌ కాలానికి లాభదాయకతకు ప్రామాణికమైన ఎబిటా (వడ్డీలు, పన్నులు, తరుగుదల, రుణ చెల్లింపులను మినహాయించకముందు లాభం) మాత్రం 11.8 శాతం తగ్గి రూ.21,585 కోట్లకు పరిమితమైంది. ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ), రిటైల్‌ వ్యాపారాల ఆదాయం తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. 

కరోనా వ్యాప్తి కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్జిన్లు గణనీయంగా తగ్గడంతో పెట్రోకెమికల్‌ వ్యాపార ఆదాయం 33 శాతం తగ్గి రూ.25,192 కోట్లకు పడిపోయింది.  

చమురు శుద్ధి(రిఫైనరీ) ద్వారా రాబడి సగానికి పైగా తగ్గి రూ.46,642 కోట్లకు పరిమితమైంది. ఒక్కో పీపా ముడి చమురు శుద్ధి ద్వారా లభించిన మార్జిన్‌ 6.3 డాలర్లకు పడిపోయింది. గడిచిన దశాబ్దకాలంలో ఇదే కనిష్ఠ మార్జిన్‌. ఈ జనవరి-మార్చి కాలానికి మార్జిన్‌ 8.9 డాలర్లుగా నమోదుకాగా.. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో 8.1 డాలర్లుగా ఉంది. 

జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో చమురు శుద్ధి వ్యాపార స్థూల లాభం 26 శాతం తగ్గి రూ.3,818 కోట్లకు పడిపోయింది. 


రిలయన్స్‌ జియో 

గత త్రైమాసికంలో రిలయన్స్‌ జియో స్టాండలోన్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 183 శాతం వృద్ధి చెంది రూ.2,520 కోట్లకు చేరుకుంది. ఆదాయం 33.7 శాతం వృద్ధితో రూ.16,557 కోట్లుగా నమోదైంది. మార్చి చివరినాటికి 38.75 కోట్లుగా ఉన్న జియో వినియోగదారుల సంఖ్య జూన్‌ చివరినాటికి 39.83 కోట్లకు పెరిగింది. అలాగే, ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు లభించే ఆదాయం రూ.130.6 నుంచి రూ.140.3కు వృద్ధి చెందింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల విక్రయం ద్వారా సేకరించిన రూ.1,52,056 కోట్లలో రూ.22,981 కోట్లు కంపెనీయే అట్టిపెట్టుకోనుందని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ అన్షుమన్‌ ఠాకూర్‌ తెలిపారు. మిగతా నిధులను మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు బదిలీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. 


రిలయన్స్‌ రిటైల్‌ 

లాక్‌డౌన్‌ కారణంగా స్టోర్లు మూసివేయాల్సి రావడం రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారంపై భారీ ప్రభావం చూపింది. దాంతో గత త్రైమాసికంలో ఈ విభాగ ఆదాయం 17 శాతం తగ్గి రూ.31,633 కోట్లకు పడిపోయింది. స్థూల లాభం 47.4 శాతం తగ్గి రూ.1,083 కోట్లకు పరిమితమైంది. గత త్రైమాసికంలో 50 శాతం స్టోర్లను పూర్తిగా మూసివేయడం జరిగిందని, 29 శాతం స్టోర్లను పాక్షికంగా తెరిచినట్లు రిలయన్స్‌ రిటైల్‌ గ్రూప్‌ సీఎ్‌ఫఓ దినేష్‌ థాపర్‌ తెలిపారు.

Updated Date - 2020-07-31T07:37:22+05:30 IST