సచివాలయాల తరలింపు

ABN , First Publish Date - 2021-08-14T06:16:54+05:30 IST

ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలను కోర్టు ఆదేశాలతో అధికారులు ఆదరాబాదరాగా ప్రైవేటు భవనాల్లోకి మార్చారు.

సచివాలయాల తరలింపు


  కోర్టు ఆదేశాలతో ప్రైవేట్‌ భవనాల్లోకి మార్పు

  ఇంతవరకు ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగిన వైనం 

ఆమదాలవలస: ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలను కోర్టు ఆదేశాలతో అధికారులు ఆదరాబాదరాగా ప్రైవేటు భవనాల్లోకి మార్చారు. ప్రభుత్వం 2019 అక్టోబరులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో కొన్నిచోట్ల పాఠశాల భవనాల్లోనే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో పాఠశాలల్లో ఉన్న సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలను తక్షణమే వేరేచోటకు మార్చాలని కోర్టు స్పష్టం చేసింది.  ఆ మదాలవలస పురపాలక సంఘం పరిధిలో 11 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 1, 22, 23వ వార్డులకు సంబంధించి లక్ష్ముడుపేట పాఠశాలలో సచివాలయాన్ని ఏర్పా టు చేశారు.  2,13 వార్డులకు కృష్ణాపురం మునిసిపల్‌ పాఠశాలలో,  5, 9వ వార్డులకు మెట్టక్కివలస ఉన్నతపాఠశాలలో సచివాలయాలను  ఏర్పాటు చేశారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఈ సచివాలయా లను శుక్రవారం అధికారులు వేరేచోటకు తరలించారు.  లక్ష్ముడుపేట సచివాలయాన్ని ఓ ప్రైవేటు భవనంలోకి, కృష్ణాపురం సచివాలయాన్ని సాయిరాం ఆలయ సమీపంలోని షాదీఖానాకు, మెట్టక్కివలస సచివాలయాన్ని పుట్టావీధిలోని ఓ ప్రైవేటు భవనంలోకి మార్చినట్లు మునిసిపల్‌ కమిషనర్‌  తెలిపారు. కాగా,  ఆమదాలవలస మండలంలోని తొగరాం, కణుగులవలస, కొర్లకోట, చీమలవలస, ఎన్‌టీవాడ, కొరపాం పాఠశాలల్లోనే సచివాలయా లు, రైతుభరోసా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. పొందూరు, బాణాం, తాడివలస పాఠశాల ఆవరణలో సచివాలయాలు ఉన్నాయి. వీటిని వేరేచోటకు మార్చాల్సి ఉంది.

Updated Date - 2021-08-14T06:16:54+05:30 IST