Advertisement
Advertisement
Abn logo
Advertisement

పింఛన్లకు ఓటీఎస్‌తో ముడి!

- ‘సెటిల్‌మెంట్‌’ అంగీకరిస్తేనే పంపిణీ 

- అనధికార ఆదేశాలు?

- పథకంపై లబ్ధిదారుల్లో విముఖత

- కఠిన చర్యలతో వసూలుకు ప్రభుత్వ యత్నం

- పెన్షన్‌తో ముడిపెట్టడంతో ప్రజల్లో ఆందోళన

(ఎచ్చెర్ల)

పింఛన్‌ లబ్ధిదారులకు ఓటీఎస్‌ గుబులు పట్టుకుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) చెల్లించకుంటే పింఛన్‌ నిలిపేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ప్రతి నెలా 1 నుంచి 4 వతేదీ మధ్య సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. డిసెంబరు నెలకు సంబంధించి బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ జరగనుంది. ఓటీఎస్‌ చెల్లించని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని కొన్ని మండలాల్లో అనధికారిక ఆదేశాలు వచ్చినట్టు తెలియడంతో పింఛన్లు ఇస్తారా? ఇవ్వరా? అన్న ఆందోళన వెంటాడుతోంది. 1983 నుంచి 2013 వరకూ గృహ నిర్మాణ లబ్ధిదారులు రూ.10 వేలు చెల్లించి సంపూర్ణ గృహ హక్కు పొందాలని అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.  ఈ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. పైగా ఎక్కడికక్కడే స్థానికులు, లబ్ధిదారులు నిలదీస్తున్నారు. ఇప్పటికే తమ సొంతమైన వాటిపై హక్కు కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఈ విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రతి మండలానికి ఓటీఎస్‌ వసూళ్ల లక్ష్యాన్ని నిర్ధేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండల స్థాయి అధికారి నుంచి గ్రామ స్థాయి సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల వరకూ లక్ష్యాన్ని విధిస్తున్నారు. సచివాలయం పరిధిలో   నిత్యం కనీసం 10 మందికి తక్కువ లేకుండా ఓటీఎస్‌ వసూళ్లు జరిగేలా చూడాలన్న నిబంధన ఉంది. దీంతో అఽధికారులంతా పరుగులు తీస్తున్నారు. పర్యవేక్షణకు పంచాయతీకి మండల స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించారు. శ్రీకాకుళం నగరానికి ఆనుకొని ఉన్న ఎచ్చెర్ల మండలంలో ఇప్పటి వరకు 10 శాతం మాత్రమే ఓటీఎస్‌ చెల్లింపులు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే మారుమూల మండలాల్లో ఓటీఎస్‌ పరిస్ధితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సామాజిక పింఛన్లు నిలిపేస్తామని గ్రామాల్లో అక్కడడక్కడ మౌఖికంగా చెబుతుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. కుడి చేతితో ఇచ్చి, ఎడమ చేతితో వెనక్కి తీసుకోవడమేమిటని పలువురు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై ఎచ్చెర్ల తహసీల్దార్‌ సనపల సుధాసాగర్‌ వద్ద ప్రస్తావించగా, ఓటీఎస్‌ చెల్లింపునకు ప్రభుత్వ పథకాలు అందజేసేందుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ఓటీఎస్‌ వల్ల ప్రయోజనాలను గుర్తించి చెల్లింపునకు లబ్ధిదారులు సహకరించాలని కోరారు. 

Advertisement
Advertisement