Abn logo
May 11 2021 @ 07:47AM

రూ. 3,490 విలువైన రెమ్‌డెసివిర్‌ 35 వేలు.. తీగ లాగితే...

హైదరాబాద్‌ సిటీ : ఝాన్సీ (పేరు మార్చాం) కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు పరిచయం ఉన్న పెద్ద పెద్ద ఫార్మసీ దుకాణాల నిర్వాహకుల నుంచి ఇటీవల ఒక ఆఫర్‌ వచ్చింది. రెమ్‌డెసివిర్‌, కొవిఫర్‌ ఇంజక్షన్లకున్న డిమాండ్‌ దృష్ట్యా, కరోనా రోగులకు వాటిని బ్లాక్‌మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తే.. ఆమెకు తగిన మొత్తంలో కమీషన్‌ ఇస్తామనేదే ఆ నిర్వాహకులు చేసిన ఆఫర్‌. దాంతో ఆమె వారి వద్ద కొన్ని అత్యవసర ఔషధాలను తీసుకుని బ్లాక్‌మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో రూ. 3,490ల విలువైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను రూ. 30000- 35000లకు విక్రయిస్తూ ఆమె అనుచరుడు రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. తీగ లాగితే.. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లోని ఫార్మసీ బ్లాక్‌ వ్యవహారం డొంకంతా కదిలింది. దీంతో.. ఇప్పటి వరకు పట్టుబడిన ముఠాలకు మందులు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి వెనుక ఎవరెవరున్నారో.. నగరంలో ఏఏ ఫార్మసీలు ఇలా దందా కొనసాగిస్తున్నాయో అన్న విషయాలపై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది.


బల్క్‌గా తెచ్చి.. బ్లాక్‌లో విక్రయం!

రెమ్‌డెసివిర్‌, కొవిఫర్‌ వంటి అత్యవసర ఇంజక్షన్లను పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్న ఫార్మసీలు ఎక్కువ మొత్తంలో బల్క్‌గా తెచ్చుకుంటున్నారు. కొవిడ్‌ రోగి ఆరోగ్యం మెరుగుపడటానికి రెమిడెసివర్‌, కొవిఫర్‌ వంటి ఇంజక్షన్లను వినియోస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అదునుగా భావించిన కొన్ని ఫార్మసీ కేంద్రాలు, ధనార్జనే ధ్యేయంగా అత్యవసర ఔషధాలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాటిని తమ అనుచరుల ద్వారా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి రూ. 3490లు ఉన్న ఇంజక్షన్‌ను రూ. 30వేల నుంచి 35000 ధర మధ్యలో విక్రయిస్తున్నారు. ఈ అక్రమ మార్గంలో కొంతమంది కేటుగాళ్లు కేవలం రోజుల వ్యవధిలోనే రూ. లక్షలు వెనకేసుకుంటున్నారంటే ఆశ్చర్యం లేదు.

పట్టుబడుతోంది పది శాతమే..

అత్యవసర మందులను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాల ఆటకట్టిస్తున్నారు ట్రై కమిషనరేట్‌ పరిధిలోని ఎస్‌వోటి, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఒకవైపు నిందితులను కటకటాల్లోకి నెడుతున్నా.. మరోవైపు యథేచ్ఛగా బ్లాక్‌ మార్కెట్‌ దందా కొనసాగుతోంది. కేవలం పదిశాతం ముఠాలు మాత్రమే పట్టుబడుతున్నాయని, మిగిలిన వారు చాపకింద నీరులా బ్లాక్‌ దందా కొనసాగిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని, అత్యవసర మందులను బ్లాక్‌ మార్కెట్‌లో వదులుతున్న ఫార్మసీలపై ఓ కన్నేసి ఉంచామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాసుల కక్కుర్తి కోసం అమాయకుల జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 


ఆస్పత్రుల్లోనూ.. అదే తీరు

కరోనా బాధితులకు అత్యవసర సమయంలో వినియోగించే రెమ్‌ డెసివిర్‌ ఇంజక్షన్ల విషయంలో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రెమ్‌ డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలంటూ బాధితుల బంధువులను పరుగులు పెట్టిస్తున్న కొన్ని ఆస్పత్రుల వారు.. చివరకు తమ వద్ద ఉన్నాయంటూ ఒక్కొ ఇంజక్షన్‌కు రూ. 15వేల వరకు వసూలు చేస్తున్నారు. పనిలో పనిగా కొందరు రెమ్‌ డెసివర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుండగా, మరికొందరు నకిలీ ఇంజక్షన్లతో దగా చేస్తున్నారు.

కరోనా బాధితులకు అత్యవసరంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందించేందుకు నగరంలోని ఓ ఫార్మా సంస్థ ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జనాలు బారులు దీరారు. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని భావించిన సదరు సంస్థ ఆన్‌లైన్‌లో రెమ్‌డెసివిర్‌ విక్రయాలను చేపట్టింది. వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా బాధితుల వివరాలు, ప్రిస్కిప్షన్‌ను పొందు పరిస్తే, నేరుగా బాధితుల తరఫు వారికి అందిస్తారు. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు బయట ఎక్కడా మెడికల్‌ షాపుల్లో అందుబాటులో లేదు. అయితే, కొన్ని ఆస్పత్రుల వారు బాధితుల పేర్లతో ఇంజక్షన్లు పొందుతున్నారు. వారికే అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


అత్యవసరమైతే రూ. 15 వేలు

ప్రస్తుతం కరోనా బాధితులు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో కొన్ని ఆస్పత్రుల వారు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. నిర్ణీత సమయంలో ఇంజక్షన్‌ తీసుకురావాలని గడువు పెడుతున్నాయి. ఆ సమయానికి ఇంజక్షన్‌ తీసుకురాలేకపోతే, తమ వద్ద అందుబాటులో ఉందని చెబుతూ రూ. 15 వేలకు ఒకటి చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ విధంగా ఓ ఆస్పత్రిలో ఆరు ఇంజక్షన్లకు మొత్తం రూ. 90 వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీ ప్రకారం ఆరు ఇంజక్షన్లు రూ. 21 వేలకు ఇవ్వాల్సి ఉంగా, నాలుగింతలు అధికంగా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.


ఎమ్మార్పీకి మించి అమ్మకూడదు 

కొవిడ్‌ చికిత్సకు అనుమతులు ఇచ్చిన ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు లెటర్‌తోపాటు రోగి ఐపీ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ను ఫార్మా సంస్థకు పంపితే నేరుగా సరఫరా చేస్తున్నాయి. మెడికల్‌ షాపులలో, ఆస్పత్రులలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు అమ్మితే, డ్రగ్‌ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత లేదు. 

- స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా  

Advertisement