మూడేళ్లకు గుర్తొచ్చామా?

ABN , First Publish Date - 2022-06-07T05:40:17+05:30 IST

‘మూడేళ్లకు గుర్తుకొచ్చామా..? సమస్యలు తెలుసుకోవాలని ఇప్పుడు అనిపించిందా? రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం.

మూడేళ్లకు గుర్తొచ్చామా?
సంక్షేమ పథకాలను వివరిస్తున్న విప్‌ కాపు

గడపగడపకు ప్రభుత్వంలో ‘కాపు’ను నిలదీసిన జనం 

సెల్‌ఫోన లాక్కొన్న పోలీసులు 


రాయదుర్గం, జూన 6: ‘మూడేళ్లకు గుర్తుకొచ్చామా..? సమస్యలు తెలుసుకోవాలని ఇప్పుడు అనిపించిందా? రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం. ఉండే పింఛన తొలగించారు. అమ్మఒడి రాలేదు. ఇవన్నీ లేకుండానే మమ్మల్ని మూడేళ్లయ్యాక పలకరించాలని ఎలా అనిపించింది’ అంటూ చౌడప్ప, మంగమ్మ, తిప్పేస్వామి, కుమారస్వామి, కొల్లక్క, మారెక్కలు ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డిని నిలదీశారు. సోమవారం రాత్రి వడ్రవన్నూరు గ్రామంలో జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మతో కలిసి విప్‌ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. మూడు గంటల పాటు గ్రామంలో తిరిగిన అనంతరం బీసీ కాలనీలో పర్యటించారు. ఇంటి ముందు డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరంతా ప్రవహించి దుర్వాసన వెదజల్లుతోందని అక్కడున్న  కుమారస్వామి, అతని తండ్రి తిప్పేస్వామి విప్‌కు సమస్యను విన్నవించారు. దీంతో ఆయన అసహనంతో మీ ఊరి సర్పంచను అడగాలని, ఈ పనులన్నీ అతనే చేస్తాడంటూ తెలిపారు. ఈ సమాధానాన్ని జీర్ణించుకోలేని ప్రజలు ఉన్న సమస్యలన్నీ ఆయన ముందు పెట్టి నిలదీయడం మొదలుపెట్టారు.  దీంతో  ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అక్కడే ఉన్న పోలీసులు సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. కాగా అక్కడ జరుగుతున్న సంఘటనను గ్రామసర్పంచ అశోక్‌ తమ్ముడు మేఘనాథ్‌ సెల్‌ఫోనలో వీడియో రికార్డ్‌ చేస్తుండగా గమనించిన పోలీసులు వెంటనే అతడి వద్దకు వచ్చి ఫోన లాక్కొన్నారు. అనంతరం అందులోని వీడియోలు డిలిట్‌ చేస్తామని చెప్పి ఫోన కోసం స్టేషనకు రావాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మారుతి, ఎంపీడీఓ కొండయ్య, పీఆర్‌ డీఈ రామ్మోహనరెడ్డి, ఎంపీపీ విద్యావతి, జడ్పీటీసీ మల్లికార్జున, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని ఉపేంద్రరెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-07T05:40:17+05:30 IST