ఆ పాటకు ఒక ప్రేమపత్రం!

ABN , First Publish Date - 2020-08-01T07:29:44+05:30 IST

సినీ సంగీత ప్రపంచంలో ధ్రువ తారగా చెప్పుకునే మహమ్మద్‌ రఫీ పాడిన పాటలు ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే

ఆ పాటకు ఒక ప్రేమపత్రం!

సినీ సంగీత ప్రపంచంలో ధ్రువ తారగా చెప్పుకునే మహమ్మద్‌ రఫీ పాడిన పాటలు ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. 1950-70 మహమ్మద్‌ రఫీ యుగమంటారు. ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు సి.మృణాళిని రాసిన ‘రఫీ... ఒక ప్రేమపత్రం’ పుస్తకం ఆగస్టు 15న అమెజాన్‌లో విడుదలవుతోంది. నిన్న (జూలై 31) ‘రఫీ సాబ్‌’ వర్థంతి. ఈ సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని విశేషాలు సంక్షిప్తంగా...


అల్లారఖీ, హాజీ అలీ అహ్మద్‌లకు ఏడవ సంతానంగా, అయిదో కొడుకుగా మహమ్మద్‌ రఫీ 1924 డిసెంబర్‌ 24న జన్మించాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి సమీపంలో కోట్ల సుల్తాన్‌ సింగ్‌లో నివసించే వీరి కుటుంబం కడుపునిండా తిండికి కూడా నోచుకోని స్థితిలో ఉండేది. పది మంది సంతానం, తల్లిదండ్రులు కలిసి ఈ చిన్ని, ప్రశాంతమైన గ్రామంలో నివసించేవారు. హాజీ అలీ వంటలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. బహుశా తండ్రి చేతి వంట రుచి అలవాటైనందువల్లేనేమో రఫీ పెద్దయ్యాక మంచి భోజనప్రియుడయ్యాడు. రఫీకి ఇంట్లో పెట్టిన ముద్దు పేరు ఫీకూ. జీవనోపాధి కోసం హజీ అలీ పెద్ద కొడుకుతో లాహోర్‌కి తరలివెళ్లగా, తల్లి, తక్కినపిల్లలూ పంజాబ్‌లో ఉండిపోయారు. ఫీకూకు మంచి స్నేహితులు హిందువైన కుందన్‌, సిక్కు సర్దార్‌ బక్షీష్‌ సింగ్‌ సామ్రా. వీరితో మొదలైన గాలిపటాల వ్యసనం జీవితాంతం ఉండిపోయింది రఫీకి. 


పనితోపాటే కూనిరాగం...

మంచి గాయకుడు విధిగా మంచి అనుకర్త అయి ఉంటాడు. సంగీతశాస్త్ర పరిజ్ఞానం లేని వయసులో కూడా ఈ లక్షణం గాయక ప్రతిభను పట్టిచ్చేస్తుంది. బాల్యంలో రఫీ తన సోదరులతో పాటు పశువులను మేతకు తీసుకువెళ్లేవాడు. ఎపుడైనా అలా అడవుల్లోకి పశువులను తీసుకువెళ్లినపుడు, నక్క కూతలు వినిపిస్తే, సోదరులు, మిత్రులూ కాలికి బుద్ధి చెప్పగా, రఫీ అక్కడే నించుని తను కూడా మరో నక్కకూత వినిపించేవాడట. దాంతో ఆ రాబోతున్న నక్క వెనకడుగువేసేది. ఒక్క జంతువుల కూతలే కాదు. పని చేస్తున్నంతసేపూ ఫీకూ ఏదో ఒక జానపదగీతం కూనిరాగం తీస్తూనే ఉండేవాడు. 


రఫీ, నౌషాద్‌ సంగమంలో దాదాపు అన్ని పాటలూ అత్యధిక జనాదరణ పొందినవే. ఒకే సినిమాలో రఫీ ఎంత వైవిధ్యభరితమైన పాటలు ఆలపించగలడో మొట్టమొదటిసారి నిరూపించింది నౌషాదే. ‘బైజూ బావ్‌రా’ లో ‘తూ గంగాకీ మౌజ్‌’, ‘ఓ దునియాకే రఖ్‌వాలేఖ’, ‘మన్‌ తడపత్‌ హరి దర్శన్‌ కో ఆజ్‌’ వింటే ఎలాంటి మూడ్స్‌ అయినా రఫీ కంఠంలో ఎంత పరిణతితో పలుకుతాయో రుజువైంది. మొదటిది విషాదం కలిసిన ప్రణయగీతమైతే, రెండోది సర్వం కోల్పోతున్న భక్తుడి ఆవేశం, ఉక్రోషం, దు:ఖం అయితే మూడోది భగవంతుడిలో లీనమైపోతున్న భక్తుడి ఆర్తి. ఒకే సినిమాలో ఇన్ని భావాలూ అద్భుతంగా పలికించడమే రఫీని రాత్రికి రాత్రి అగ్రపీఠంపై కూర్చోబెట్టింది. ‘ఓ దునియాకే రఖ్‌వాలే’ పాటలో రఫీ కంఠం ఎంత ఉచ్ఛస్థాయిలో పలికిందో విన్న శ్రోతలు, సినిమారంగ ప్రముఖులు ఆ పాట పాడుతున్నప్పుడు రఫీ గొంతులో ఆ రాపిడికి రక్తం వచ్చిందని కూడా కథ కల్పించారు!. ఎందుకంటే అంతకుపూర్వం అంత ఉచ్ఛస్థాయిలో పాడగల గాయకుడిని ఎవరూ ఎరగరు. అలాంటి స్వరరచన చేయవచ్చని కూడా అప్పటిదాకా సంగీతదర్శకులు సైతం గుర్తించలేదు. ఒక రకంగా నౌషాద్‌ కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్టే అయింది. 


వారిద్దరిదీ ప్రత్యేక అనుబంధం...

షమ్మీ, రఫీ ఒకరినొకరు ఎంతో లోతుగా అర్థం చేసుకున్నారు. షమ్మీ ఎలా అభినయిస్తాడో రఫీకి తెలుసు. రఫీ ఎలా పాడతాడో షమ్మీకి తెలుసు. అందుకే ఇద్దరూ పరప్పర పూరకాల్లా ఉండేవారు. తన పాటల రికార్డింగులన్నిటికీ షమ్మీ స్టూడియోకి వచ్చేవాడు. రఫీ రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడే తను ఎలా అభినయించదలుచుకున్నాడో సూచించేవాడు. రఫీ అచ్చం అలాగే పాడేవాడు. అయితే ‘ఎన్‌ ఈవినింగ్‌ ఇన్‌ పారిస్‌’ చిత్రంలో ‘ఆస్‌మాన్‌ సే ఆయా ఫరిస్తా’ పాట రికార్డింగ్‌ సమయంలో షమ్మీ వెళ్లలేక పోయాడు. తీరా షూటింగ్‌ సమయంలో సరిగ్గా తను ఎక్కడ ఏం చెయ్యదలుచుకున్నాడో అలాగే రఫీ పాడడంతో ఉబ్బితబ్బిబ్బయి తర్వాత రఫీని కలుసుకుని ఎలా పాడగలిగారని అడిగాడు. ‘ఏముంది? ఇక్కడ దూకుతారు; అక్కడ వంగుతారు; అక్కడ నవ్వుతారు, కళ్లెగరేస్తారు అని ఊహించగలిగాను. దాని ప్రకారం పాడాను’ అని రఫీ చెప్పడంతో, తనని రఫీ ఎంతగా అర్థం చేసుకున్నాడో షమ్మీకి అనుభవానికి వచ్చింది. 


‘కశ్మీర్‌ కీ కలీ’ చిత్రంలో ‘తారీఫ్‌ కరూ క్యా ఉస్‌కీ‘ లో తారీఫ్‌ ఎన్ని రకాలుగా హొయలు పోయిందో రఫీ కంఠంలో తెలిసిందే. దానికి కారకుడు షమ్మీ కపూరే. పాట చివర్లో తను రకరకాలుగా హావభావాలు చేయదలుచుకున్నట్టు షమ్మీ చెప్పి, దానికి తగ్గట్టు పల్లవి రిపీట్‌ అయితే బాగుంటుందని నయ్యర్‌కి చెప్పాడు. నయ్యర్‌కి ఆ ఆలోచన అంత నచ్చలేదు. వీళ్లిద్దరూ వాదిస్తూండగా రఫీ కలగజేసుకుని, షమ్మీ కోరినట్టు చేస్తూ మళ్లీ పాడి రికార్డు చెయ్యడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు. దాంతో నయ్యర్‌ కూడా అంగీకరించాడు. 


ప్రైవేట్‌ పర్సన్‌...

సినిమా పాటలకే జీవితాన్ని అంకితం చేసి, ఆ వృత్తిలో పరమదశ అందుకున్న రఫీ తన కుటుంబ సభ్యులనెవరినీ సినిమారంగం దరిదాపులకు రానివ్వలేదు. నిజానికి రఫీ భార్య బిల్కిస్‌కి సినిమాల పట్ల గానీ, ఆ మాటకొస్తే రఫీ పాటల పట్ల గానీ పెద్దగా ఆసక్తి ఉండేదికాదు. ఆమె ఎక్కువగా ఆయన పాటలు వినేది కాదు. ఆమెకు రఫీ తనను ప్రేమించి, గౌరవించే మంచి భర్త మాత్రమే. ఆయన పబ్లిక్‌ ఇమేజ్‌తో ఆమెకే సంబంధమూ ఉండేది కాదు. జీవితంలో ఆయన కోరుకున్న ఆనందాలు చాలా చిన్నవి. తనకిష్టమైన వాళ్లతో ఇంట్లో భోజనం చేయడం, తనకిష్టమైన ఆటలు తీరికవేళల్లో సన్నిహిత మిత్రులతో ఆడుకోవడం, కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పడం. ఎవరు కష్టాల్లో ఉన్నా చూడలేకపోవడం ఆయన బలహీనతే. అందుకే ఏ నిర్మాతకైనా, ఎంత చిన్న సంగీతదర్శకుడికైనా తను పాడడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని తెలిస్తే వెంటనే ఒప్పుకునేవాడు. ఈ నిర్మల మనస్తత్వమే ఆయన్ని ‘ఫరిస్తా’ను చేసింది. ఒక గొప్ప కళాకారుడి వ్యక్తిత్వం కూడా గొప్పదైతే ఆయన్ని జనం జన్మజన్మలకూ గుర్తుంచుకుంటారన్నది రఫీ విషయంలో పూర్తిగా నిజం.


‘అనల్ప బుక్‌ కంపెనీ’ ద్వారా అమెజాన్‌లో ఆగస్టు 15న 

‘రఫీ... ఒక ప్రేమపత్రం’ 

(304 పేజీలు) విడుదలవుతోంది. 


ఇంతకూ రఫీలో గొప్పతనం ఏమిటీ? ఈ ప్రశ్న రఫీనే అడిగితే, ‘నేను సంగీత దర్శకుడి చేతిలో రాయిని. అతను పాడమన్నట్టు పాడతాను. ఆపైన అల్లాదయ’ అన్నాడు. ప్రతి పాటను ‘స్వంతం’ చేసుకోవడం రఫీకి అబ్బిన కళ. తెరపై అభినయిస్తున్న నటుడి కంటే, కథను రాసిన రచయితకంటే, కథను చెబుతున్న దర్శకుడి కంటే ఎక్కువగా రఫీ ఆ సన్నివేశాన్ని, ఆ పాత్ర మనోభావాలని తనలో ఐక్యం చేసుకుంటాడు. తనే ఆ పాత్ర అయిపోతాడు. అందువల్లే పాట వింటున్నంత సేపూ మనలో కూడా అదే భావం, అదే మూడ్‌ కలుగుతాయి.

Updated Date - 2020-08-01T07:29:44+05:30 IST