Abn logo
Jul 10 2020 @ 00:26AM

అలనాటి పండితులు

దూర్వాసుని వంటి కృష్ణమూర్తి శాస్త్రిలో పసిపిల్లల వంటి అమాయక హృదయం ఒకొకప్పుడు దాపరికం లేక బాహిరమై ఎదిరిమనసును ఆకర్షించివేయడం అరుదుకాదు. కోర్టుకెక్కే లౌక్యంతో పాటు ఆయనలోని వైదిక విభూతి మనలను విస్మయావిష్టులను చేయక మానదు.


సాహిత్యమే జీవితంగా, జీవితమే సాహిత్యరంగంగా నిండుగా జీవించి, దండిగా రచన లొనర్చి, పండి రాలిపోయిన మహావ్యక్తి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి. ఆయన సంస్కృత పాండిత్యానికి మహామహోపాధ్యాయ బిరుదమొక్కటి చాలు గీటురాయి. ఆయన బహుకావ్యరచనకు కవి సార్వభౌమ బిరుదమొక్కటి చాలు వేనోళ్ళ చాటుటకు.


కొమ్ములు తిరిగిన చండ ప్రచండ పండితులున్న ఆ రోజులలో పండితుడనిపించుకొనడమే బ్రహ్మాండం. ఆనాడీయన మహాపండితుడిగా మన్ననలంది కాశీపండిత సభలో, వివిధ రాజాస్థానాలలో సత్కృతులంది మిన్న అనిపించుకున్నాడంటే అదొక మహత్తర విషయం. ఒక చేతి మీదుగా భారత, భాగవత, రామాయణాలను పూర్తి చేసి కృతులొసంగి కీర్తికెక్కడం మనమూహింపలేని మహత్తర కృషి.


సాహిత్యరంగం రణరంగంగా వీర విహారం చేసి, పదాలు, పదార్థాలు, అపశబ్దాలు, కావ్యగుణ దోషాలు మొదలైన అంశాల కోసమని అవేవో తమ జీవితంలోని భాగాలుగా, వానిని తేల్చివేయడం తమ చావుబ్రతుకుల సమస్యగా భావించడం అలనాటి పండితులకే చెల్లును. ఆ సాహిత్యసంరంభంలో అసహాయశూరుడై, అద్వితీయ ధైర్యసాహసోపేతుడై అవక్ర విక్రమం చూపించిన ఉద్దండ పండితుడీయన.


నేడేమి వ్రాసినా తప్పైనా, ఒప్పైనా పట్టించుకొనువారరదు. ఒక్కమాట తమకు తప్పుగా తోచితే పుట్టి మునిగిపోయినట్టు పండితులు మీదపడువారు గనుకనే, ఆ శబ్ద సాధుత్వాసాధుత్వ నిర్ణయంలో హోరాహోరి పోరాడు వారు గనుకనే నాటి సాహిత్యరంగంలో నవ చైతన్యం పొంగిపొరలినది. నిజమే, ఆ వాద వివాద ప్రోద్ధతి ఒకప్పుడు బాహాబాహి, కదాకచివలె మారడం, కోర్టుల కెక్కడం దాకా వెళ్ళడం వీటితో కాస్త మనస్సు చివుక్కు మనిపిస్తుంది. అందులో శ్రీ శాస్త్రి ఔద్ధత్యం మరింత విస్తుపోజేస్తుంది. అయినా ఆ సంఘటనల వెనుకనున్న సాహిత్య ప్రీతి మనలను చకితులను చేయకమానదు. పరశ్శత గ్రంథ ప్రణీతగా ఈ కవిసార్వభౌములు ఆంధ్రలోకంలో విహరించినారు. పండిత మూర్ధన్యుడుగా ఆయనకున్న ప్రతిష్ఠ, కవి సార్వభౌముడుగా ఆయనకు లభించిన ప్రతిష్ఠ కంటే వేయి మడుగలెక్కువనుటకు జంకవలసిన పనిలేదు.


దూర్వాసుని వంటి ఆయనలో పసిపిల్లల వంటి అమాయక హృదయం ఒకొకప్పుడు దాపరికం లేక బాహిరమై ఎదిరిమనసును ఆకర్షించివేయడం అరుదుకాదు. కోర్టుకెక్కే లౌక్యంతో పాటు ఆయనలోని వైదిక విభూతి మనలను విస్మయావిష్టులను చేయక మానదు. అంతటి సాహిత్యోపజీవి చతురంగంలో అతి చతురడన్నప్పుడు, అశ్వికుడుగా అనితర ప్రజ్ఞా ధురీణుడన్నప్పుడు అప్రయత్నంగా మనం ముక్కున వ్రేలిడుకొనక ఊరకుండ లేము. ఆయనది ఒక మాట, ఒక బాణమనే ప్రకృతి. కొన్ని సునిర్దిష్ట భావాలాయన కున్నవి. వానిని వెలనాడుటలో జంకు గొంకు లెరుగని గుండె బల మాయనిది.


1960 డిసెంబర్ 11 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘అహో! ధన్యజీవి!’ నుంచి

Advertisement
Advertisement
Advertisement