ఆత్మీయ స్మృతుల్లో పీవీ

ABN , First Publish Date - 2020-06-27T06:20:24+05:30 IST

పీవీ గారు ‘మౌనం’ మర్మధర్మాలు తెలిసినవారు. లేకపోతే చొక్కారావు నుండి మొదలుపెట్టి సోనియాగాంధీ వరకు భరించనలవికానన్ని బాధలు భరించి రాజకీయాల్లో మెలమెల్లగా...

ఆత్మీయ స్మృతుల్లో పీవీ

పీవీ గారు ‘మౌనం’ మర్మధర్మాలు తెలిసినవారు.  లేకపోతే చొక్కారావు నుండి మొదలుపెట్టి సోనియాగాంధీ వరకు భరించనలవికానన్ని బాధలు భరించి రాజకీయాల్లో మెలమెల్లగా ప్రధాని పదవి వరకు ఎదుగుతారా మరి?


నా పెళ్ళికి పీవీ నరసింహారావుగారు వడ్కాపూర్‌ (పాత కరీంనగర్‌ జిల్లా) వచ్చారు. ఆ రోజుల్లో పల్లెల్లో పెళ్ళిళ్లలో కూర్చోవడానికి కుర్చీలుండేవి కావు. కార్పెట్లే. ఎంతవారైనా జంపుఖానాలపై కూర్చోవలసిందే. ఆయన కూడా అలానే కూర్చున్నారు అందరితోపాటు. అపుడు పీవీ గారు రాజకీయాల్లో ఇంకా అంత ముందుకు రాలేదు జిల్లాలోనే ఉండేవారు. ఎలా వచ్చారా నా పెళ్ళికని నేనాలోచిస్తే నాకు తెలిసింది. మా నాయనగారికి వారికి సాహిత్యపరమైన అనుబంధం ఉండెడిదని, నాన్నగారి పిలుపునందుకొని పీవీ గారు వచ్చారని. ఆ పిదప ఐ.వి.చలపతిరావుగారు మా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వచ్చారు. వారికి, పీవీ గారికి మిత్రత్వమేర్పడడం, అడపాదడపా నరసింహారావు గారు చలపతిరావు గారి వద్దకి రావడం, పోవడం వలన వారితో పరిచయం పెరిగింది. నేను శాతవాహన పి.జి.కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ అయ్యాక ఆ పరిచయం మరింత పెరిగింది. నరసింహారావుగారు ఆ సంస్థకు సెలెక్షన్‌ బోర్డ్‌ మెంబర్‌గా కూడా ఉండేవారు. అప్పటికి వారు మినిస్టర్‌ అయ్యారు. శాతవాహన పి.జి. కాలేజ్‌లో ఎం.బి.ఏ. ప్రారంభం రోజున వారు ఢిల్లీ నుండి కరీంనగరం వచ్చారు. 


నేనా సంస్థలో పని చేసిన తీరు పీవీగారికి నచ్చింది. అప్పటికి వారు సెంట్రల్‌ మినిస్టర్‌ అయ్యారు. అంతకు పూర్వం జగిత్యాల కాలేజి అఫిలియేషన్‌ ఇవ్వడానికి యూనివర్సిటీ కమిషన్‌ వచ్చినప్పుడు కొంతమంది ఆనాటి రాబోయే కాలేజీ భవనాలను చూసి ముక్కుమీద వేలేసుకొని ఇక్కడ కాలేజీ పెడతారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే ‘అవును ఒకనాడు కరీంనగర్‌ కాలేజీ కూడా ఇలాగే ప్రారంభించాం, అది ఇపుడు ఎంత ఎదిగిందో చూశారా మీరు? కొండలరావంత కొండంత వాడు అండగా ఉండగా దీనికేం కొదువ? అక్కడ కూడా ఆయన పనిచేసి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అతని ఆధ్వర్యంలో ఇది కూడా అలాగే వృద్ధి చెందగలదు. కొన్నాళ్ళయ్యాక మీరే చూద్దురు అని’ కమిషన్ సభ్యులకు పీవీ నచ్చచెప్పారు. ఆ కళాశాల నిజంగానే అత్యుత్తమమైన కాలేజీగా పేరు తెచ్చుకుంది మొత్తం రాష్ట్రంలో.


వారు ఢిల్లీలో ఎన్నాళ్ళున్నారో అన్నాళ్ళు నేను అక్కడికి పోయినప్పుడల్లా తప్పనిసరిగా కలిసేవాన్ని సునాయాసంగా. ఎప్పుడు కలిసినా కేశవరావుగారు ఎలా ఉన్నారు? జగపతి ఎలా ఉన్నాడు? అని అడిగేవారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎంతో మురిపెంగా. ఆ పిదపే ఏ విషయాలైనా. నాయనగారు చనిపోయాక ఒకసారి నేను ఢిల్లీ పోతే కేశవరావుగారు ఎలా ఉన్నారని అడిగితే వారు గతించారని చెప్పగానే, ఎవరో అతి దగ్గరి బంధువులో, మిత్రులో పోతే ఎంతో విచారగ్రస్తులైనట్లై, అయ్యో! కేశవరావుగారు చనిపోయారా? అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగగా గద్గదికంగా ఎప్పుడు? అని ఎంతో చింతిస్తూ, వారి విచారాన్ని వ్యక్తం చేస్తూ, వారికీ మా నాయనగారికున్న సాహిత్య పరమైన చిరకాల సంబంధాన్ని వెలిబుచ్చారు.


పీవీ గారు ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా నేను తప్పనిసరిగా కలిసేవాన్ని. కరీంనగరం వాన్ని, చిరకాలంనుండి తెలిసినవాన్ని, కేశవరావు గారి కుమారున్ని, వారికి ఎంతో నచ్చిన నా తమ్ముడు జగపతిరావు అన్నను, విద్యారంగంలో కాస్తో, కూస్తో పేరు గడించిన వాన్ని, స్వాతంత్య్ర సమరయోధున్ని, మొట్టమొదటి మంథని అసెంబ్లీ ఎన్నికల్లో వారు ‘కంటెస్ట్‌’ చేసినపుడు నేను అచట ‘ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌’ గా కూడా పనిచేసినవాన్ని కూడా కదా మరి!

నేను విశ్వనాథ సాహిత్య పీఠం స్థాపించి ‘జయంతి’ని తిరిగి నడపగలగడం వారికెంతో నచ్చింది. నాతో ఎన్నోసార్లన్నారు ‘బాగొస్తుంది మీ జయంతి’ యని.అంతేకాదు, వారికి నాపై ఎంత విశ్వాసం కుదిరిందంటే, నేను విశ్వనాథ వారి జయంతి ప్రత్యేక సంచికకు ఒక సందేశాన్ని పంపమని కోరితే వారి ఆరోగ్యం బాగుండక, వీలుకాక తుదకు ఆనాటి రాజ్యసభసభ్యుడు వి.రాజేశ్వరరావుతో ‘కొండలరావును తానే వ్రాసి నాకు పంపించమను’ యని కబురంపారు.నాకు ఒళ్ళంతా వణికింది. అంతపాటి వారి సందేశాన్ని నేను నా భాషలో నా భావంతో, వారి భాషవతు వారి భావంవతు వ్రాయడమా యని? కాని ఎంత చిత్రవిచిత్రమది. ఒక్కచోట కూడా మార్చక సంతకం పెట్టి పంపించారు వారు.ఆరోజు నేనింకా ఎన్నటికీ మరచిపోలేను.


వారు ఢిల్లీలో ఒక దవాఖానాలో ఉండగా నేను, జె.బాపురెడ్డి కలిసివెళ్లాం చూడడానికి. మాకు కాఫీ ఫలహారాలు తెప్పించి ఎంతో ఖులాసాగా మాట్లాడారు. అపుడు వైద్యులగురించి ఒక జోక్‌ చెబుతూ... ‘‘నన్ను చాలామంది పరీక్షించారు, మందులిచ్చారు. కాని నాకు అంతగా నెమ్మది కాలేదు. ఒకసారి వైజాగ్‌ నుంచి ఎవరో వచ్చారు. అక్కడ ఒక యునానీ/ఆయుర్వేద డాక్టరున్నాడు. ఆయన మందిస్తే దానికిక తిరుగులేదు, మీకు అట్టే నయమయిపోతుంది అంటే నేను ఎందుకైనా మంచిది చూద్దామని అతనితో ఆ మందు తెప్పించి వాడాను. నాకేమి నయం కాలేదు. ఆ మాటే చెప్పాను నాకు చెప్పినాయనకు. ఆ వైజాగ్‌ డాక్టర్‌తో ఆయన ‘ఏమయ్యా! పీవీ గారికి ఆ మందిచ్చావు. అదేమీ పని చేయలేదట’ అని అంటే, అతడు ‘అదే వాడకపోతే ఈ పాటికి మరణించేవాడు’ అని అన్నాడని నాకు తిరిగొచ్చి చెప్పాడు, అలా ఉంటారు డాక్టర్లు’’ అని ఒకటే నవ్వు. 


పీవీ గారిలో హాస్యం మృగ్యం అని ఎవరో నాతో అంటే ‘నీకేం తెలుసయ్యా! పీవీ.గారి ‘‘హ్యూమర్‌’’ గురించి యని, వారి ఉపన్యాసాలను, పుస్తకాలను వడబోసి ‘విట్‌ అండ్‌ విజ్‌డమ్‌ ఆఫ్‌ పి.వి.’ అని నేనొక చిన్నపాటి పుస్తకాన్ని ప్రచురించాను. అది చదవండి వారి వ్యంగ్యమెలా ఉంటుందో చవిచూడడానికి అన్నాను. పీవీ మంచి హాస్యప్రియుడు. అలా వ్రాసేవాడు, మాట్లాడేవాడు. కాని ఏమాత్రం ఏర్పడడు. ఆ ఏర్పడక పోవడాన్నే ‘పి.వి. తనమంటాం’ మేము. 

పి.వి.గారు మౌనం మర్మధర్మాలు తెలిసినవారు. అందుకే Politicians have to have patience with patience అను చలోక్తి విసిరారు. లేకపోతే చొక్కారావు నుండి మొదలుపెట్టి సోనియాగాంధీ వరకు భరించనలవికానన్ని బాధలు భరించి రాజకీయాల్లో మెలమెల్లగా ప్రధాని పదవి వరకు ఎదుగుతారా మరి?


నాకు పీవీ గారు వారి రచనల ద్వారా ఎక్కువ పరిచయం. ఎంత పరిచయమో నేను వారిపై వేసిన జయంతి ప్రత్యేక సంచిక చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే నా ‘విట్‌ అండ్‌ విజ్‌డమ్‌ ఆఫ్‌ పి.వి.’ చదివితే. నాకు చింతేమిటంటే వారిని నేను తెలుగు అకాడమీలో ఉండగా బ్రహ్మాండంగా జరిపిన ‘టూ డెకేడ్స్‌ సెలబ్రేషన్స్‌’కు తీసుకురాలేకపోయానని, వారు వస్తానని రాలేకపోయారని.


డాక్టర్ వెల్చాల కొండలరావు

పూర్వ సంచాలకులు, అధ్యక్షులు – తెలుగు అకాడమి

Updated Date - 2020-06-27T06:20:24+05:30 IST