సీతమ్మధారలో దుకాణాల తొలగింపు

ABN , First Publish Date - 2021-08-11T19:30:37+05:30 IST

సీతమ్మధార(విశాఖపట్నం): జీవీఎంసీ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తుండడంతో వాటిని అధికారులు మంగళవారం తొలగించారు.

సీతమ్మధారలో దుకాణాల తొలగింపు

బతుకులు రోడ్డున పడతాయని చిరు వ్యాపారుల ఆవేదన 

ఫిర్యాదుల మేరకే చర్యలన్న చైన్‌మన్‌ 

తొలగింపు పనులను అడ్డుకున్న కార్పొరేటర్‌ పద్మా‌రెడ్డి  


సీతమ్మధార(విశాఖపట్నం): జీవీఎంసీ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తుండడంతో వాటిని అధికారులు మంగళవారం తొలగించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని, తొలగిస్తే పూట గడవడం కష్టమని వారంతా వాపోయారు. స్థానిక కార్పొరేటర్‌ తొలగింపు పనులను అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. నగరంలో సీతమ్మధార అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా గల ఖాళీ స్థలంలో చాలా ఏళ్లుగా తోపుడు బండ్లతో చిరు వ్యాపారులు నూడిల్స్‌, పకోడి, టిఫిన్‌, చెరకు రసం తదితర వ్యాపారాలు సాగిస్తున్నారు. 


కాగా, అది ప్రభుత్వ స్థలమని, అక్కడ వ్యాపారాలు చేయకూడదని జీవీఎంసీ అధికారులు, సిబ్బంది మంగళవారం తొలగింపు చర్యలు చేపట్టారు. బతుకులు రోడ్డున పడతాయని, పస్తులుండాల్సి వస్తుందని అక్కడి వ్యాపారులు అధికారులను వేడుకున్నారు.  ఇక్కడి వ్యాపారాలపై తమకు ఫిర్యాదులు అందాయని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ చైన్‌మన్‌ రామకృష్ణ వారికి సమాధానమిచ్చారు. దీంతో వ్యాపారులంతా లోబోదిబోమంటూ స్థానిక కార్పొరేటర్‌ సాడి పద్మా‌రెడ్డికి తమ సమస్యను వివరించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కార్పొరేటర్‌.. జీవీఎంసీ సిబ్బందికి నచ్చజెప్పారు. వ్యాపారులు రోడ్డున పడతారాని, బడ్డీలు తొలగించవద్దని  సూచించారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజుకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. స్పందించిన ఆయన తోపుడు బండ్లను తొలగించవద్దని, జీవీఎంసీ అధికారులతో తాను మాట్లాడతానని చైన్‌మన్‌కు సూచించారు. దీంతో అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. వ్యాపారులు కేకే రాజు, పద్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 



Updated Date - 2021-08-11T19:30:37+05:30 IST