ఆక్రమణలు తొలగించండి

ABN , First Publish Date - 2021-10-24T05:37:52+05:30 IST

రాజమహేంద్రవరంలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్న ఆక్రమణలను తొలగించాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు.

ఆక్రమణలు తొలగించండి

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 23: రాజమహేంద్రవరంలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్న ఆక్రమణలను తొలగించాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో శనివారం టౌన్‌ప్లానింగ్‌, పోలీస్‌ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని రోడ్డు పక్కల ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరం లో అనుమతి పొంది ప్లాన్‌ ప్రకారం ఉన్న భవనాలవే నిర్మాణాలు జరగాలని సూచించారు. అనుమతులు లేకపోతే  పనులు నిలుపుదల చేయాలన్నారు. అనుమతి పొంది 2021-22 ఏడాదికి వ్యాపార ప్రకటనలు, హోర్డింగ్‌లు ద్వారా రావాల్సిన బకాయిలకు డిమాండ్‌ నోటీసులు ఇచ్చి డిసెంబరు లోగా రుసు ము వసూలు చేయాలన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట్ల జీబ్రాలైన్లు, స్పీడ్‌ బ్రేకర్స్‌ వేయాలన్నారు. నగరంలోని అన్ని అపార్టుమెంట్లలో ఇంకుడు గుంటలు వుండేలా చూడాలని, తడి, పొడి చెత్త వేరు చేసే బిన్‌లు, చిన్నపాటి కంపోస్టు యార్డ్‌ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో సిటీ ప్లానర్‌ సూరజ్‌కుమార్‌, టౌన్‌ప్లానింగ్‌  ఏసీపీ, డీసీపీ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:37:52+05:30 IST